నవతెలంగాణ-ఆలేరు టౌను
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆదివారం ఆలేరు పట్టణ శివారు హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై, ఆలేరు, మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, మాజీ టెస్కాబ్ రాష్ట్ర వాయిస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఘన స్వాగతం పలికారు.
ఉదయం 8 గంటలనుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ వస్తున్నారని సమాచారం తెలుసుకొని, నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, జిల్లా, మండల, పట్టణ గ్రామాల నాయకులు కార్యకర్తలు ఆలేరు పట్టణ బైపాస్ దాబాల వద్ద గంటల తరబడి వేచియున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించేందుకు వెళ్తూ ఆలేరు పట్టణంలో కొద్దిసేపు ఆగారు. ఆలేరు, మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలు వారికి స్వాగతం పలికారు.
స్వాగతం పలుకుతున్న క్రమంలో కేసీఆర్ జిందాబాద్ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాన్వాయ్ చేరుకోగానే ఒక్కసారిగా తోపులాట జరిగింది. ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు కారులోనుండే నమస్కరిస్తూ అభివాదం చేశారు. ఆలేరుకు ఉదయం తొమ్మిది గంటల వరకు రావాల్సి ఉండగా ఒంటిగంట ప్రాంతంలో కేసీఆర్ తన కాన్వాయ్ తో చేరుకున్నారు. కెసిఆర్ కాన్వాయ్ వెంట మాజీ ఎమ్మెల్యేలు నాయకులు తమ తమ వాహనాలలో నర్సంపేటకు తరలి వెళ్లారు. సర్క్లీన్ స్పెక్టర్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్సైలు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.



