న్యూ ఇయర్‌ ధమాకా

New Year Dhamaka– రాష్ట్రంలో ఏరులై పారిన మద్యం
– సలార్‌ సినిమా కలెక్షన్లను దాటిన లిక్కర్‌ సేల్స్‌
– మూడు రోజుల్లో రూ.620 కోట్ల అమ్మకాలు
– డిసెంబర్‌ మాసంలో రూ.4,274 కోట్లు
– గత ఏడాది కన్నా 26 శాతం పెరుగుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌.
కొత్త సంవత్సరం సందర్బంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. మందు బాబులు గత రికార్డులను బద్దలు కొట్టారు. మూడు రోజుల్లోనే ప్రభాస్‌ నటించిన సలార్‌ సినిమా కలెక్షన్లను తెలంగాణ లిక్కర్‌ సేల్స్‌ దాటేశాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్‌ షాపులకు, ఒంటి గంట వరకు బార్‌లకు అనుమతి ఉండడంతో అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగాయి. మూడు రోజుల్లో రూ.620 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్‌ 29న రూ.180 కోట్లు, 30న రూ.127 కోట్లు, 31న రూ.313 కోట్ల మద్యం అమ్ముడైంది. మొత్తం 11.7 లక్షల కేసుల మద్యం అమ్ముడు కాగా అందులో 4.76 లక్షల కేసుల విస్కి, బ్రాండి, 6.31 లక్షల కేసుల బీర్లను విక్రయించినట్లు సమాచారం. న్యూ ఇయర్‌ వేడుకుల వేళ ప్రతి ఏటా మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఓవరాల్‌గా డిసెంబర్‌ మాసంలో రూ.4,274 కోట్ల అమ్మకాలు సాగాయి. గత ఏడాది డిసెంబర్‌ మాసంతో పోల్చితే 26 శాతం పెరుగుదల నమోదైంది. ఇందులో హార్డ్‌ 33 శాతం, బీర్ల అమ్మకాలు 16 శాతం పెరిగిందని అబ్కారి శాఖ అధికారులు చెబుతున్నారు. మద్యంతో పాటు కూల్‌ డ్రింక్స్‌, చికెన్‌, మటన్‌, చేపలు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి.

Spread the love