Tuesday, August 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహక్కులను హరిస్తే సహించం

హక్కులను హరిస్తే సహించం

- Advertisement -

​క్విట్‌ ఇండియా ఉద్యమమే మాకు స్ఫూర్తి
జైల్ ‌భరోలో కార్మిక‌, క‌ర్ష‌క‌, వ్య‌కాస నేత‌లు
భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు
నినాదాలతో దద్దరిల్లిన ఖైరతాబాద్‌ ‌చౌరస్తా
పోలీసుల దిగ్బంధ‌నంలో లోక్‌‌భవన్‌ ‌పరిసర ప్రాంతాలు
నేత‌ల అరెస్టులు.. ఆ తర్వాత విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

‘మోడీ స‌ర్కార్ డౌన్‌.. డౌన్‌.. బీజేపీ ప్ర‌భుత్వ రైతు, కార్మిక‌, వ్య‌వ‌సాయ కార్మిక విధానాలు న‌శించాలి, ముర్దాబాద్ మోడీ స‌ర్కార్‌’.. అనే నినాదాల‌తో ఖైరతాబాద్‌ ‌చౌరస్తా మార్మోగింది. హ‌క్కుల‌ను హ‌రిస్తే చూస్తూ ఊరుకోబోమంటూ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కేంద్రాన్ని హెచ్చ‌రించారు. క్విట్ ఇండియా ఉద్య‌మ‌మే త‌మ‌కు స్ఫూర్తి అని, ఆ స్ఫూర్తితో మోడీ స‌ర్కారు ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పెద్ద ఎత్తున పోరాటాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తామ‌ని వారు హెచ్చ‌రించారు. క్విట్ ఇండియా డే సంద‌ర్భంగా కేంద్ర కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేర‌కు సోమవారం హైదరాబాద్‌‌లో జైల్ భ‌రో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇందులో భాగంగా చేప‌ట్టిన చ‌లో లోక్‌భ‌వ‌న్ కార్యక్రమానికి ఆయా సంఘాల నుంచి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లొచ్చారు. వారంద‌రూ ఖైర‌తాబాద్ చౌర‌స్తా నుంచి లోక్‌భ‌వ‌న్‌కు వైపున‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. అప్పటికే ఆ ప్రాంతంలో పోలీసుల‌ను మోహ‌రించ‌టంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అయినా నాయ‌కులు వెన‌క‌డుగు వేయ‌క‌పోవ‌టంతో ఇరువైపులా తోపులాట చోటు చేసుకుంది. ఒక‌వైపు ఆందోళనకారుల నినాదాలు..మరోవైపు భారీ బందోబస్తు… వెర‌సి ఖైర‌తాబాద్ చౌర‌స్తా ద‌ద్ద‌రిల్లింది. పోలీసుల వైఖ‌రిని నిర‌సిస్తూ కార్యకర్తలంతా అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా నలువైపులా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పోలీసులు లోక్ భవన్‌‌కు కొంత దూరంలో రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలిపి బారికేడ్లు వేశారు. ముందుకు పోతున్న ర్యాలీని అడ్డుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పాలడుగు భాస్క‌ర్ రోడ్డుపైనే ప‌డుకుని నిర‌స‌న తెలిపారు. ఆయ‌న‌తోపాటు మ‌రికొంద‌రు నాయ‌కుల‌ను పోలీసులు బ‌రాబ‌రా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్ల‌లో ప‌డేశారు. అక్కడే నిరసన ప్రదర్శనను నిలువరించిన పోలీసులు నాయ‌కుల‌ను అరెస్టు చేసి పంజాగుట్ట, అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, కార్యదర్శి జె వెంకటేశ్‌, ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసఫ్‌, ఎస్‌ ‌బాలరాజు, వీఎస్‌ ‌బోస్‌, నర్సింహ,యాదగిరి ఐఎన్‌‌టీయూసీ నాయకులు ఆర్‌‌డీ చంద్రశేఖర్‌,నాగన్న గౌడ్‌, టీయూసీఐ అధ్యక్షులు కె సూర్యం, ఐఎఫ్‌‌టీయూ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌, అనురాధ, బీఆర్‌‌టీయూ అధ్యక్షులు జి రాంబాబు యాదవ్‌, దానకర్ణాచారి పాల్గొన్నారు. సంయుక్త కిసాన్‌ ‌మోర్చా కన్వీనర్లు టి సాగర్‌, పశ్య పద్మ,వి ప్రభాకర్, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య, నాగిరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాద్ రావు,కోశాధికారి మూడ్ శోభన్, రైతు సంఘాల నాయకులు బి రాము,మమిడాల భిక్షపతి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ ‌వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బి ప్రసాద్‌, బి పద్మ, కేవీపీఎస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌‌బాబు, గిరిజన సంఘం రాష్ట్ర అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్‌, ఆర్‌ ‌శ్రీరాంనాయక్‌, రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, సీఐటీయూ సీనియర్‌ నాయకులు డీజీ. నర్సింహారావు, ఐద్వా నాయకురాలు కెఎన్‌. ఆశాలత, నగర సీఐటీయూ అధ్యక్ష‍ కార్యదర్శులు ఎం. దశరథ్‌, జే. కుమారస్వామి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, ఎస్‌ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్‌‌రెడ్డి తదితరులున్నారు.
​ఈ సంద‌ర్భంగా పాలడగు భాస్కర్‌, టి సాగర్‌, ఆర్‌ ‌వెంకట్రాములు… మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉదార వాద సంస్కరణల అమలులో భాగంగా లేబర్‌ ‌కోడ్‌‌ల అమలుకు ఫైనల్‌ ‌రూల్స్‌ను ‌నోటిఫై చేసిందని చెప్పారు. విద్యుత్‌ ‌సవరణ బిల్లు-2025, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వీబీ గ్రామ్‌‌జీ ని తీసుకు రావడం దుర్మార్గమని విమర్శించారు. విత్తన చట్టానికి సవరణలు ప్రతిపాదించడం, ఈజ్ ఆఫ్‌ డూయింగ్‌ ‌బిజినెస్‌ ‌పేరుతో పెట్టుబడి దారులకు గరిష్ట లాభాల కోసం కార్మిక చట్టాలను రద్దు చేయడం ఆందోళనకరమని చెప్పారు. కార్మికుల రోజువారీ పని గంటలను 8నుంచి 10గంటలకు పెంచుకునేందుకు యాజమాన్యాలకు స్వేచ్ఛనివ్వడం లాంటి కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకే జైల్‌ ‌భరో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించామ‌ని చెప్పారు. ఈ పోరాటం ప్రారంభం మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే… పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -