Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవర్షాల నేపథ్యంలో రైల్వే ట్రాక్‌‌ల కంకరను తనిఖీ చేయండి

వర్షాల నేపథ్యంలో రైల్వే ట్రాక్‌‌ల కంకరను తనిఖీ చేయండి

- Advertisement -

ప్రయాణికుల భద్రతపై
 రాజీ పడొద్దు
 భద్రతపై జీఎం శ్రీవాస్తవ అధికారులకు ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు, ఇతర సంఘటనలు జరగకుండా రైల్వే ట్రాక్‌‌లపై కంకర వేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ ‌మేనేజర్‌ ఎస్‌‌కె శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం సికింద్రాబాద్‌‌లోని రైల్‌ ‌నిలయంలో వర్షాలు, ఇతర అంశాలపై భద్రతా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సురక్షిత, నిరంతరాయంగా రైలు కార్యకలాపాలను నిర్వహించడంతోపాటు, వర్షాలతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో జోన్ యొక్క సంసిద్ధత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్ తోపాటు ఆయా శాఖల ప్రధాన అధిపతులు హాజరయ్యారు. సికింద్రాబాద్, హైదరాబాద్ , నాందేడ్ డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ‌ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం ట్రాక్‌ల నాణ్యత, నిర్వహణ పై అధికారులతో మాట్లాడారు. భారీ వర్షపాతం సమయంలో ట్రాక్‌లు చెదరకుండా, స్థిరంగా ఉండేందుకు కంకరను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జీఎం క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలం ఆరంభంలో మరింత ప్రమాదానికి గురయ్యే నూతనంగా నిర్మించిన రైల్వే ట్రాక్ వంతెనలు, ఆర్ యూ బీ , రైల్వే లైన్లపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. జనరల్ మేనేజర్ సురక్షిత రైలు కార్యకలాపాలకు సంబంధించిన అన్ని పనులలో రైల్వే సిబ్బంది, కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఏదైనా చిన్నపాటి అసౌకర్యం తలెత్తినా కూడా దానిని వెంటనే అధికారులకు తెలియజేయాలని తద్వారా సత్వరంగా దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. రైళ్ల సురక్షిత రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రమాదకర ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కందకాలు తవ్వడం , బారికేడ్లు ఏర్పాటు చేయడం వంటి నివారణ ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. 
అలాగే సున్నితమైన ట్రాక్ విభాగాల సమీపంలో పశువులు రైలు కిందపడిపోయే ప్రమాదాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలని కూడా సూచించారు. వర్షాకాలంలో అప్రమత్తమైన నివారణ చర్యల ద్వారా రైలు ప్రయాణాలపై నమ్మకాన్ని కలిగించాలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -