Tuesday, August 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుజనం గుండెల్లో చిరస్థాయిగా పెద్ది

జనం గుండెల్లో చిరస్థాయిగా పెద్ది

- Advertisement -

ఆ కుటుంబానికి అండగా బీఆర్‌ఎస్‌
నర్సంపేట మెడికల్‌ కాలేజీకి పెద్ది పేరు పెట్టడం ఖాయం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి సంస్మరణ సభలో కేటీఆర్‌
విగ్రహం గద్దె కూల్చివేతపై శ్రేణుల తీవ్ర ఆగ్రహం
కాంగ్రెస్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌

నవతెలంగాణ – నర్సంపేట/నల్లబెల్లి
నర్సంపేట అభివృద్ధి ప్రధాత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ఆయన కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని చెప్పారు. పెద్ది సంస్మరణ సభను ఆయన స్వగ్రామమైన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించారు. కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై పెద్ది చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మహనీయుడని కొనియాడారు. ‘ఎంతకాలం బతికాం అన్నది కాదు, ఎలా బతికాం అన్నదే ముఖ్యం. లక్షలాది మంది నీరాజనాలు పలకడమే పెద్ది ప్రజాదరణకు నిదర్శనం’ అని చెప్పారు. కరోనా విపత్కర సమయంలోనూ నర్సంపేటలో ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు. నర్సంపేటలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేసిన పెద్ది కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందని భరోసానిచ్చారు. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, నర్సంపేట మెడికల్‌ కాలేజీకి పెద్ది సుదర్శన్‌ రెడ్డి పేరు పెట్టడం ఖాయమని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

​నిస్వార్ధ రాజకీయ యోధుడు పెద్ది : హరీశ్‌రావు
రెండు దశాబ్దాల పాటు కేసీఆర్‌ ఆలోచనలతో నడుచుకుంటూ, నిస్వార్ధంగా పోరాడిన నాయకుడు పెద్ది అని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. దేవాదుల జలాలను పాకాల, గణపురం, రామప్ప చెరువులకు అందించడంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఉద్యమాన్ని ముందుకు నడిపిన పెద్ది మరణం బీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటన్నారు.

విగ్రహం గద్దె కూల్చివేతపై భగ్గుమన్న బీఆర్‌ఎస్‌
నర్సంపేట మెడికల్‌ కాలేజ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి విగ్రహ నిర్మాణ గద్దెను రాత్రికి రాత్రే కూల్చేయడంపై బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక కాంగ్రెస్‌ నాయకుల కుట్ర ఉందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. రెండ్రోజుల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వరంగల్‌ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నెపునేని నరేందర్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీ ఎదుట పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వినోద్‌ కుమార్‌, మాలోత్‌ కవిత, వినరు భాస్కర్‌, సుదర్శన్‌రెడ్డి భార్య స్వప్న, కుమారుడు నిదర్శన్‌ రెడ్డి, కూతురు ధార్మిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -