Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాళేశ్వరం మోటార్లను తక్షణమే ఆన్‌ చేయండి

కాళేశ్వరం మోటార్లను తక్షణమే ఆన్‌ చేయండి

- Advertisement -

రైతుల ఇబ్బందులను పట్టించుకోండి
రాజకీయాలకతీతంగా నీటిని పంపింగ్‌ చేయాలి
మంత్రి ఉత్తమ్‌‌కు..హరీశ్‌‌రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‌రైతు ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం మోటార్లను తక్షణమే ఆన్ చేయాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌‌ చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవాలని కోరారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌కు మార్‌‌రెడ్డికి ఆయన సోమవారం లేఖ రాశారు. రాజకీయాలకు అతీతంగా వెంటనే నీటి పంపింగ్ చేయాలని సూచించారు. కాళేశ్వరం మోటార్లు ఆన్‌చేసి రిజర్వాయర్లు నింపా‌లని కోరారు. రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపక పోవడం వల్ల పంటల సాగు ముందుకు పోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి సుమారు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా మిడ్ మానేరు నుంచి మోటార్లను ఆన్‌చేసి నీటి పంపింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఒక వైపు ఎల్‌నినో వల్ల తక్కువ వర్షభావం, మరోవైపు ప్రాజెక్టుల్లో నీళ్లు లేక అన్నదాతలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. వానాకాలం పంట సాగుకు నీటికోసం రైతాంగం ఎదురు చూస్తున్నదని పేర్కొన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం అయిన మిడ్ మానేరు రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 27 టీఎంసీలు, ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల నీటి లభ్యత ఉందని తెలిపారు. అదేరకంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలోని వరద నీటి లభ్యత కూడా ఏర్పడనుందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మిడ్ మానేరు నుంచి మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని సూచించారు. తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నపూర్ణ (అంతగిరి), రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, నృసింహ (బస్వాపూర్) తదితర రిజర్వాయర్లను, వాటి పరిధిలోని చెరువులను, చెక్ డ్యామ్‌‌లన్నింటినీ నింపి నాలుగు లక్షల ఎకరాలకు నీరందించేలా చర్యలు చేపట్టలని కోరారు.
లోయర్ మానేరు డ్యామ్ (ఎల్‌ఎండీ) పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు, ప్రస్తుత నీటి లభ్యత 6.9 టీఎంసీలు ఉన్నాయని తెలిపారు. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటిని నింపి ఎస్‌ఆర్‌ఎస్‌‌పీ స్టేజ్‌-2లోని అవసరమైన ఆయకట్టుకు నీరందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -