Tuesday, August 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసమృద్ధిగా వర్షాలు కురవాలని.. సీఎం రేవంత్‌‌రెడ్డి మహావరుణయాగం

సమృద్ధిగా వర్షాలు కురవాలని.. సీఎం రేవంత్‌‌రెడ్డి మహావరుణయాగం

- Advertisement -

​సతీసమేతంగా సాగర్‌‌లో పూజలు
అన్ని ప్రాజెక్టులు, చెరువులూ జలకళతో ఉండాలని ప్రార్థనలు
​108 మంది వేద పండితులతో.. 11 హోమగుండాలు
మంత్రి ఉత్తమ్ పర్యవేక్షణ.. మంత్రుల హాజరు

​నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి/నాగార్జునసాగర్‌
తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా–గోదావరి పరీవాహక ప్రాంతాలు జలకళను సంతరించుకోవాలని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో సోమవారం ‘మహా వరుణ యాగం’ నిర్వహించింది. కృష్ణా నది తీరంలోని విజయ్ విహార్ పర్యాటక అతిథి గృహ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో తెల్లవారుజామున నాలుగు గంటలకు యాగం ప్రారంభమైంది. ఆ తర్వాత మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సతీసమేతంగా పూర్ణాహుతి సమర్పించడంతో యాగం ముగిసింది. ఈ యాగంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు.

​​108 మంది వేద పండితులతో..11 హోమగుండాలు
​యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అర్చకులు, సిద్ధాంతులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం యాగాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు చెందిన 108 మంది వేద పండితులు, రుత్వికులు, అర్చకులు యాగ క్రతువులో పాల్గొన్నారు. ఇందుకోసం 11 ప్రత్యేక హోమగుండాలను ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు మంత్రోచ్ఛారణలు, సంకల్పంతో ప్రారంభమైన యాగంలో వరుణ జపాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​​సాగర్‌కు సీఎం.. పూర్ణాహుతి సమర్పణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.45 గంటలకు నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దంపతులకు యాగశాల వద్దకు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. యాగ ప్రాంగణానికి చేరుకున్న సీఎం దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నిర్ణయించిన శుభ ముహూర్తం ప్రకారం సాయంత్రం 3.20 నుంచి 3.24 గంటల మధ్య వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హోమగుండంలో పూర్ణాహుతిని సమర్పించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహాక్రతువు ఏర్పాట్లను నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.

​​రైతు సంక్షేమమే ప్రధాన సంకల్పం
​ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా యాగం నిర్వహించినట్టు మంత్రులు తెలిపారు. జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగి రైతులకు సాగునీరు అందుబాటులోకి రావాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలకు తాగునీటి కొరత లేకుండా ప్రకృతి అనుకూలించాలని ప్రార్థనలు చేసినట్టు తెలిపారు.

​​ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
​సాగర్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ‌బీసీ సంక్షేమ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, పలువురు. ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ లు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ యాగంలో రాష్ట్ర శాసనమండలి చైర్మెన్‌గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మెన్‌ కోదండ రెడ్డి, ప్రభుత్వ విప్ ‌బీర్ల ఐలయ్య, మరో విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు శంకర్ నాయక్,రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మెన్‌ గుత్త అమిత్ రెడ్డి ,ప్రభుత్వ సలహాదారు లు కే కేశవ రావు ,సుదర్శన్ రెడ్డి ,మాజీ మంత్రి జనా రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్,ఎస్ పి శరత్ చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎం ఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, మిర్యాలగూడ, దేవరకొండ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి , బాలునాయక్, కార్పొరేషన్ చైర్మెన్లు, మున్సిపల్ చైర్మెన్లు, పలువురు ప్రజాప్రతినిధులు, మిర్యాలగూడ ఆర్ డి ఓ రమణా రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -