ఎస్కేఎం, కేంద్ర కార్మిక సంఘాల జైల్‌భరో సక్సెస్
ఎక్కడికక్కడ ధర్నాలు, ప్రదర్శనలు, రైల్‌రోకోలు, సామూహిక కోర్టు అరెస్టులు
దేశంలోని వెయ్యికి పైగా ప్రాంతాల్లో భారీ ఆందోళనలు
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద బైఠాయించిన కార్మికులు
కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు వీడాలంటూ కేంద్రానికి హెచ్చరికలు
మోడీకో హఠావ్…దేశ్ కో బచావ్ అంటూ నినాదాలు
దేశం అట్టుడికింది. 10 లక్షల మందికి పైగా అరెస్టులు అయ్యారు. వెయ్యికిపైగా ప్రాంతాల్లో భారీ ఆందోళనలు జరిగాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ శ్రామికవర్గం రోడ్లెక్కింది. మోడీకో హఠావ్…దేశ్ కో బచావ్ నినాదాలతో ఎక్కడికక్కడ ధర్నాలు, ప్రదర్శనలు, రైల్‌రోకోలు, రాస్తారోకోలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు గులాంగిరీ చేస్తూ, వారికి అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన ‘జైల్‌భరో’ పిలుపు సక్సెస్ అయ్యింది. అన్ని రాష్ట్రాల్లోనూ కార్మికులు, కర్షకులు సంయుక్తంగా ఈ ఆందోళనల్లో భాగస్వాములు అయ్యారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్న మోడీ సర్కార్‌ను రైతులు, కార్మికులు తమ ఆందోళనతో హెచ్చరించారు. కార్పొరేట్లకు ఊడిగం చేసే విధానాలకు ముగింపు పలికి, ప్రజలకు మేలు చేసే విధానాలకు కార్యరూపం దాల్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము ఐక్యమై మోడీ సర్కార్‌ను గద్దెదించుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే తీవ్ర ఆందోళనలకు దిగుతామని స్పష్టం చేశారు. 1942 క్విట్ ఇండియా పోరాట 84వ వార్షికోత్సవం సందర్భంగా అమెరికా సామ్రాజ్యవాదం, కార్పొరేట్ ప్రపంచ వాణిజ్య వ్యవస్థ ఎదుట బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం లొంగిపోవడానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించిన జైలు భరో విజయవంతమైంది. దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా ప్రాంతాల్లో పది లక్షల మంది అరెస్టయ్యారు. రైతులు, కార్మికులతో పాటు వ్యవసాయ కార్మికులు, అంగన్‌వాడీ-ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, యువత, మహిళలు అందరూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధించి, రోడ్లపైనే కూర్చుని ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు, ప్రదర్శనలు మొదలుకుని రైల్‌రోకో, రాస్తారోకో, సామూహిక కోర్టు అరెస్టుల వరకు జరిగిన ప్రతిఘటన చర్యలు ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహానికి, తీవ్ర వేదనకు అద్దం పట్టాయి. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, త్రిపుర, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, తమిళనాడు, బీహార్, అసోం వంటి రాష్ట్రాల్లో రైతులు, కార్మికులు రోడ్లు, రైళ్లను దిగ్బంధించారు. కేరళంలోని 14 జిల్లాల్లో పదివేల మంది కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలను అడ్డుకున్నారు. అక్కడ కార్మికులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోజికోడ్‌లో సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీంను అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో పలుచోట్ల నిరసనకారులపై పోలీసులు దాడి చేశారు. హుగ్లీ జిల్లాలో ఆయుధాలతో కూడిన బీజేపీ గూండాలు శాంతియుత నిరసనకారులపై దాడి చేశారు. అసోంలోని ధేమాంచిలో రహదారిని గంటల తరబడి దిగ్బంధించారు. 26 జిల్లాల్లోని 31 ప్రదేశాలలో 21 వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. గౌహతిలో నిరసనకారులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. మహిళలతో సహా పలువురిని రోడ్డుపై ఈడ్చిపారేశారు. తెలంగాణలోని వందలాది మందిని అరెస్టు చేశారు. ఏపీలో వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలో జరిగిన నిరసనలో వేలాది మంది పాల్గొన్నారు. భివానీ, నుహ్‌లలో వందలాది మంది మహిళలను అరెస్టు చేశారు.
కర్నాల్, సోనిపత్, పల్వాల్, జింద్‌లలో కూడా ఆందోళనలు జరిగాయి. హర్యానాలోని భివానీలో కిసాన్ సభ ఆర్థిక కార్యదర్శి పి. కృష్ణ ప్రసాద్, హిసార్‌లో ఉపాధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్‌ను, కర్నాల్‌లో సీఐటీయూ అధ్యక్షుడు సుదీప్ దత్తా అరెస్టు చేశారు. రాజస్తాన్‌లోని గంగానగర్‌లో రైతులు, కార్మికులు రహదారిని దిగ్బంధించారు. దీంతో పోలీసులు రైతులు, కార్మికులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో వందలాది మంది నిరసన చేపట్టారు. త్రిపురలోని అగర్తలాలో వేలాది మంది బారికేడ్లను పడగొట్టారు. పంజాబ్‌లోని బఠిండాలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎర్ర జెండాలతో నిండిపోయింది. లుధియానాలో రహదారిని దిగ్బంధించారు. హిమా చల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో వందలాది మంది వీధుల్లోకి వచ్చారు. తమిళనాడులో 142 కేంద్రాల్లో 31 వేల మంది కార్మికులు కార్యకలాపాలను మూసివేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ తదితర ప్రాంతాల్లో భారీ ఆందోళనలు జరిగాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి ఏఆర్ సింధు, రాజ్యసభ సభ్యుడు వి. శివదాసన్ పాల్గొన్నారు. ఎస్కేఎం, సీఐటీయూ నేతలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మైసూర్‌లో నిరసనకారులు బారికేడ్లను బద్దలు కొట్టారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్, నాసిక్, ధూలే, పర్భానీ, బీడ్, పాల్ఘర్, షోలాపూర్, సాంగ్లీ, సంభాజీనగర్, బుల్దానా తదితర ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. మహారాష్ట్రలోని దహనులో వేలాది మంది రైతులు, కార్మికులతో పాటు కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దావలేను అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలో ఆందోళనలు భారీగా జరిగాయి. మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో సహాయ కార్యదర్శి బాదల్ సరోజ్‌ను అరెస్టు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తే నవంబర్ 26 నుంచి నిరవధిక ఆందోళన చేస్తామని రైతు, కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. రాష్ట్రపతికి డిమాండ్ల పత్రాన్ని సమర్పించినట్టు ఎస్కేఎం ప్రకటనలో తెలిపింది.
కార్మికులకు, రైతులకు సీపీఐ(ఎం) అభినందనలు
సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సమాఖ్యల సంయుక్త వేదిక ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగిన లక్షలాది మంది కార్మికులకు, రైతులకు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఇచ్చిన ఈ పిలుపు ముఖ్య ఉద్దేశం.. ‘‘నాలుగు కఠినమైన కార్మిక కోడ్‌లను రద్దు చేయడం, పటిష్టమైన ఉపాధి హామీని పునరుద్ధరించడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయ డం, స్వామినాథం కమిషన్ సిఫారసుల ఆధారంగా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), కనీస వేతనం వంటి డిమాండ్లను అమలు చేయడం’’ అని తెలిపింది. జైలు భరో విజయం, ఈ డిమాండ్లు ప్రజానీకంలో బలంగా నాటుకుపోయాయని నిరూపిస్తోందని పేర్కొంది. ఇది మోడీ ప్రభుత్వం తన కార్మిక-రైతు వ్యతిరేక విధానాలను విడనా డాలని హెచ్చరిస్తోందని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న హెచ్చరికలను మోడీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, దేశ కార్మికులు, రైతులు లేవనెత్తిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తోందని తెలిపింది.
10 లక్షల మంది అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



