Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి యశోద ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

కామారెడ్డి యశోద ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
అన్నం, నీరు మింగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 40 ఏళ్ల వ్యక్తికి అరుదైన, అధునాతన వైద్య విధానమైన పెరొరల్ ఎండోస్కోపిక్ మయోటమీ (పి.ఓ.ఈ.ఎం.) చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు యశోద హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. కామారెడ్డి యశోద మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్యులు డా. బి. శృతి సాగర్, ఎం.డి., డి.ఎం. చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చాలా కాలంగా సదరు రోగి ఆహారం, నీరు మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలిపారు. తిన్న ఆహారం సరిగ్గా కిందికి వెళ్లకపోవడం, నీరు మింగడంలో కూడా ఇబ్బందులు తలెత్తడం వంటి లక్షణాలతో ఆస్పత్రిని సంప్రదించినట్లు చెప్పారు.

వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సమస్యను గుర్తించి, ఆధునిక ఎండోస్కోపిక్ విధానమైన పి.ఓ.ఈ.ఎం. ద్వారా చికిత్స అందించినట్లు వివరించారు. పెరొరల్ ఎండోస్కోపిక్ మయోటమీ విధానంలో పెద్దగా కోతలు పెట్టకుండా ఎండోస్కోపీ ద్వారా అవసరమైన ప్రాంతానికి చేరుకుని, ఆహారం కిందికి వెళ్లేందుకు అడ్డంకిగా మారుతున్న కండరాలను సడలించే విధంగా చికిత్స నిర్వహిస్తారు. తద్వారా రోగికి మింగడంలో ఉన్న ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. సాధారణ శస్త్రచికిత్సా విధానాలతో పోలిస్తే పి.ఓ.ఈ.ఎం. చికిత్సలో శరీరంపై గాయం తక్కువగా ఉండటంతో పాటు, కోలుకునే సమయం కూడా తక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. సరైన రోగ నిర్ధారణ, నిపుణుల పర్యవేక్షణతో ఈ విధానం ద్వారా మింగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులకు మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్‌కు చెందిన డా. బి. శృతి సాగర్, ఎం.డి., డి.ఎం. (గ్యాస్ట్రో), కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ వెల్లడించారు. డా. శృతి సాగర్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్నారని తెలిపారు. డయాగ్నస్టిక్, థెరప్యూటిక్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, మ్యానోమెట్రీతో పాటు అధునాతన ఎండోస్కోపీ విధానాలైన ఈ.ఆర్.సి.పి., ఈ.యు.ఎస్. వంటి చికిత్సా విధానాల్లో ఆమెకు ప్రత్యేక నైపుణ్యం ఉందని వివరించారు. అలాగే హెపటోబిలియరీ, ప్యాంక్రియాటిక్ వ్యాధులకు సంబంధించిన చికిత్సలోనూ ఆమె ప్రత్యేక అనుభవం కలిగి ఉన్నారని వైద్యులు తెలిపారు.

కామారెడ్డి ప్రాంతంలోనే అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల క్లిష్టమైన గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యలకు చికిత్స కోసం ప్రతిసారీ హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చి, స్థానికంగానే నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా యశోద మెడికల్ సెంటర్ పనిచేస్తోందని వైద్యులు వెల్లడించారు. పి.ఓ.ఈ.ఎం. వంటి ఆధునిక చికిత్సా విధానాలతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -