రాయదుర్గంలో హెరిటేజ్ భూముల విక్రయాన్ని ఉపసంహరించాలి
వేలంపాటలో కొనుగోలు చేస్తే న్యాయపరమైన సమస్యలు తప్పవు
సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా? అని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు ప్రశ్నించారు. నాడు ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన జాతి సంపద అని ఉపన్యాసాలు ఇచ్చి ఇప్పుడు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ వేలం వేస్తూ, ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డికి గురువారం ఆయన బహిరంగలేఖ రాశారు. గతంలో కంచ గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఇప్పుడు రాయదుర్గం ఇలా ఎక్కడికక్కడ భూములు అమ్మే కుట్రలు చేస్తుండటం సిగ్గుచేటని విమర్శించారు. రాయదుర్గం పన్మక్త గ్రామంలోని సర్వే నెంబర్ 83/1లో 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఈనెల 17, 21 తేదీల్లో టీజీఐఐసీ వేలం వేయడానికి సిద్ధం కావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 2020లో ఇదే భూములపై రక్షణ కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అదే భూమిపై థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వచ్చాక మరో మాటనా? అని పేర్కొన్నారు. జీవో నెంబర్ నాలుగు, సర్వే నెంబర్ 83ను హెరిటేజ్ భూమిగా గుర్తించినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. హెరిటేజ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం వాటినే వేలం వేసి అమ్మేందుకు ఎందుకు తొందరపడుతోందని అడిగారు. సీఎం అనుయాయులకు మేలు చేసేందుకేనా? అని ప్రశ్నించారు. ఇదే సర్వే నెంబర్లో గతంలో 6.2 ఎకరాలను ఎకరాకు రూ.237 కోట్ల చొప్పున వేలం వేస్తే, ఎస్బీఐ కోర్టుకు ఎక్కిందని గుర్తు చేశారు. దీంతో కోర్టు అంక్షితలు వేసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. అయినా అదే సర్వే నెంబర్లో మరో 10.63 ఎకరాలను వేలం వేయడం వెనుక ఆంతర్యం ఏంటని? ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదా?అని అడిగారు.
భూమిపై యాజమాన్య వివాదాలు
ఈ భూమిపై యాజమాన్య వివాదాలు ఉన్నాయని హరీశ్‌రావు తెలిపారు. హెరిటేజ్ అంశం, వక్ఫ్ హక్కుల అంశం కూడా ఉన్నాయని వివరించారు. అనేక కోర్టు వివాదాలున్నాయని పేర్కొన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు భూమి ఎవరిదో తేల్చకుండా వేలం వేయడం ఎందుకని ప్రశ్నించారు. రూ.రెండు వేల కోట్ల విలువైన హెరిటేజ్ భూములను అమ్మే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని అడిగారు. ఈనెల 17, 21 తేదీల్లో జరగనున్న టీజీఐఐసీ వేలాలను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 83కి సంబంధించిన హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులన్నింటినీ బయటకు తీసి సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలు నిగ్గు తేల్చాలని కోరారు. హక్కులు, వివాదాలు తేలకముందే ఈ భూములను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాకుండా ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని సూచించారు.



