Friday, August 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపోక్సో కేసులో నిందితుడికి 25 ఏండ్ల శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి 25 ఏండ్ల శిక్ష

- Advertisement -


 లైంగికదాడి, అపహరణ కేసులో కోర్టు తీర్పు
రూ.7 వేల జరిమానా.. 
బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం


​నవతెలంగాణ-నల్లగొండప్రాంతీయ ప్రతినిధి

బాలికను అపహరించి లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితునికి గురువారం నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 25 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు రూ.7 వేల జరిమానా చెల్లించాలని, బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. 2020లో మిర్యాలగూడ-2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై లైంగికదాడి జరిగింది. ఈ మేరకు క్రైమ్ నంబర్ 97/2020, ఎస్సీ నెబర్ 198/2020గా కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన మహమ్మద్ జాఖీర్ బాబా (20)పై ఐపీసీ సెక్షన్లు 448, 366, 376(2)(i), పోక్సో చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి ఆధారాలను సేకరించి నిందితుడిపై న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని ఐపీసీ 366, పోక్సో చట్టం 3, 4 సెక్షన్ల కింద దోషిగా నిర్దారించింది. ఐపీసీ 366 కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా, జరిమానా చెల్లించకపోతే అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం 3, 4 సెక్షన్ల కింద 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా, జరిమానా చెల్లించకపోతే అదనంగా ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే పోక్సో చట్టంలోని సెక్షన్ 42 ప్రకారం వర్తించే శిక్షల్లో అధికమైన శిక్షను అమలు చేయాల్సి ఉండటంతో అన్ని శిక్షలూ ఏకకాలంలో అమలు కానున్నాయి.

​పోలీసు అధికారులకు ఎస్పీ అభినందన
​కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన అప్పటి మిర్యాలగూడ-2 టౌన్ ఎస్‌హెచ్‌ఓ డి. శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్, ఇన్‌స్పెక్టర్ జె. సోమనర్సయ్య, డీసీఆర్‌బీ సీఐ శ్రీనునాయక్, సీడీఓ బుర్రి అఖిల్, డి.రాగ్యానాయక్, లైజన్ అధికారులు పి.నరేందర్, ఎన్. మల్లికార్జున్‌ను ఎస్పీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -