రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై ఉద్యోగుల్లో టెన్షన్
ఈ ఏడాది 9,719 మంది ఉద్యోగ విరమణ
ఇప్పటికే రిటైర్ అయిన వారికి ప్రభుత్వ బకాయిలు రూ.6 వేలకోట్లు
సకాలంలో అందని గ్రాట్యూటీ, కమ్యూటేషన్ పెన్షన్లు
దశలవారీ చెల్లింపులకే సర్కారు మొగ్గు!
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9,719 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. గతంలో రిటైర్ అయిన ఉద్యోగులకు సంబందించిన రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇప్పటికే సుమారు రూ.ఆరు వేల కోట్లు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. గ్రాట్యూటీ, కమ్యూటేషన్ పెన్షన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, టీజీఎల్ఐతోపాటు వివిధ రకాల బిల్లుల్ని కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. వీరితోపాటే రెగ్యులర్ ఉద్యోగులకూ పెండింగ్ బిల్లులున్నాయి. రిటైర్ అయిన ఒక్కో ఉద్యోగికి రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో రిటైర్ అయిన ప్రభుత్వోద్యోగుల బెనిఫిట్స్‌ను అందచేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మే, జూన్, జులై మాసాల్లో వరుసగా నెలకు రూ.2వేల కోట్లు చొప్పున ఇప్పటివరకు రూ.6 వేల కోట్ల నిధులు విడుదల చేసింది. అయినా ఇంకా రూ.6వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరి ఈ ఏడాది రిటైర్ అయ్యే 9,719 మంది ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీని కూడా ప్రకటించడం లేదు.
గతేడాది రూ.19,371 కోట్లు చెల్లింపు
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఉద్యోగుల జీతాలకు రూ.44,478.87 కోట్లు, పెన్షన్ల కోసం రూ.13,109.67 కోట్లు ఖర్చవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జీతాల కోసం రూ.47,400.10 కోట్లు, పెన్షన్ల కోసం రూ.19,371.21 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీతాల కోసం రూ.48,358.21 కోట్లు, పెన్షన్ల కోసం రూ.14,736.56 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. జూన్ నాటికి జీతాలకు రూ.13,063.52 కోట్లు, పెన్షన్ల కోసం రూ.7,309.49 కోట్లు విడుదల చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్లకు కేటాయించిన నిధులు సరిపోయే అవకాశం లేదు. పెండింగ్ బిల్లులు, రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.21 వేల కోట్లకుపైగా ఖర్చయ్యే అవకాశముందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు.
రిటైర్డ్ ఉద్యోగులు 2.77.413 మంది
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలంటే ఖజానాపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశ్యంతోనే ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏండ్లకు పెంచా రనే ప్రచారం జరిగింది. ఆ 61 ఏండ్ల గడువు కూడా తీరిపోవడంతో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించే బాధ్యత పడింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,77,413 మంది రిటైర్డ్ ఉద్యోగులున్నారు. 2024-25లో 7,995 మంది, 2025-26లో 9,630 మంది ఉద్యోగ విరమణ పొం దారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9,719 మంది, 2026-27లో 9,443 మంది, 2027-28లో 8,778 మంది ఉద్యోగ విరమణ పొందుతారని ఆర్థిక శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2014 నుంచి ఇప్ప టివరకు రాష్ట్రంలో సుమారు 85 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. 2014-15లో 2,44,723 మంది పింఛనుదారులకు రూ.7,046 కోట్లు చెల్లించారు. 2017-18లో 2,57,604 మంది పింఛనుదారులకు ₹11,417 కోట్లు ఖర్చు చేశారు. 2023-24లో 2,59,788 మంది పింఛన్‌దారులకు పింఛన్ల కోసం రూ.16,841.39 కోట్లు ఖర్చయ్యాయి.
ఉద్యోగుల మానసికవేదన
రాష్ట్రంలో 30 ఏండ్లకుపైగా ప్రజలకు వివిధ రకాలుగా సేవ చేసిన ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందితే సకాలంలో గ్రాట్యూటీ, కమ్యూటేషన్ పెన్షన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అందడం లేదు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. సొం తింటి కోసం, పిల్లల పెండ్లిండ్ల కోసం లేదంటే పిల్లల ఉన్నత చదువులు, ఆరోగ్యం ఇలా ఎన్నో అవస రాలుంటాయి. కానీ ప్రభుత్వం సొమ్మును సకాలంలో ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఆర్థిక నిర్వహణ సక్రమంగా ఉండాలి :
చావ రవి, అధ్యక్షులు, టీఎస్‌యూటీఎఫ్
ఉద్యోగులు ప్రతినెలా రిటైర్ అవుతూనే ఉంటారు. ఆర్థిక వనరులను పెంచుకుని నిర్వహణ సక్రమంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ విరమణ వల్ల అదనపు భారం పడుతుందన్న అభిప్రాయం ప్రభుత్వానికి ఉండొద్దు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. అక్కడ మిగిలిన జీతాల సొమ్మును ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాలి.
ఇంకా రూ.6 వేల కోట్లపైనే కావాలి :
పి వెంకట్‌రెడ్డి, అధ్యక్షులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఇంకా రూ.ఆరు వేల కోట్లపైనే ఇవ్వాలి. రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య ప్రతినెలా పెరుగుతుంది. వారికి చెల్లించాల్సిన రిటైర్మెంటు బెనిఫిట్లను ప్రణాళిక ప్రకారం చెల్లించాలి.



