Friday, August 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురాష్ట్రంలోనూ బీజేపీ కుట్ర

రాష్ట్రంలోనూ బీజేపీ కుట్ర

- Advertisement -

​సర్‌ ‌పేర లక్షలాది ఓట్ల తొలగింపునకు యత్నం
గుజరాత్ నుంచి వచ్చే వారికి చోటే లేదని చెప్పాలి
విద్యావంతులు 10 రోజులు ఓటర్లకు
సహకరించాలి : సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఓట్ల తొలగింపుతో పశ్చిమబెంగాల్ లో అధికారంలోకి వచ్చిన తరహాలోనే తెలంగాణలోనూ పాగా వేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బెంగాల్ ను దీదీ వదులుకున్నారేమో గానీ, తెలంగాణను వదులుకునేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరని ఆయన హెచ్చరించారు. ఈడీ, సీబీఐ, ఈసీ తదితర సంస్థలెన్నిం టినీ ఉపయోగించినా… తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఇక్కడకు రానీయ్యబోరని తేల్చిచెప్పారు. ఎవరి వద్ద ప్రేమ ఉందో, ఎవరి వద్ద విషం చిమ్మే రాజకీయాలున్నాయో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసునని వ్యాఖ్యానించా రు. సర్ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో 60 లక్షల నుంచి 70 లక్షల ఓట్లను తొలగించారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చిన్న తప్పులను కూడా కంప్యూటర్ ఆధారంగా చూపించి ఓటు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాలను తాము తిప్పి కొడుతున్నామనీ, అయితే తమ శక్తి మాత్రమే సరిపోదని అన్నారు. రాష్ట్రంలో చదువుకున్న వారంతా రాబోయే 10 రోజులు ఓటర్ల హక్కులను కాపాడేందుకు ముందుకొచ్చి సహకరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గుజరాత్ నుంచి రాష్ట్రానికి అధికారం కోసం వచ్చే వారికి చోటు లేదని చాటిచెప్పాలంటూ కోరారు. అలాంటి విషం చిమ్మే రాజకీయాలకు చెక్ పెట్టాలన్నారు.

ప్రతి ఇంటికీ తిరిగి ఓటర్ల వివరాలను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కునూ కాపాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కొమురం భీం ఆదివాసీ భవన్ లో నిర్వహించిన ‘మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉన్నంతకాలం దేశంలో సెక్యులర్‌ వర్గాలకు ఎలాంటి ఢోకా ఉండదని ఆయన భరోసానిచ్చారు. హిందువులు, ముస్లీంలు తమ పార్టీకి రెండు కండ్లలాంటి వారని వ్యాఖ్యానించారు. హిందువులతో సమానంగా ముస్లీంలకు అన్ని అవకాశాలు దక్కాల్సిందేనని చెప్పారు. రాష్ట్రంలో ముస్లీం మైనారిటీల కోసం నాలుగు శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ ఇస్తే, వాటి రద్దు కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారని గుర్తు చేశారు. ఇందుకోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యతిరేకించినవారు (బీజేపీ నేతలు) రాష్ట్రంలోనే కాదు గుజరాత్‌ ‌లోనూ మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ‌దేశవ్యాప్తంగా పోరాడుతోందని హామీనిచ్చారు. తమ పార్టీ ఎల్లప్పుడూ సామాజిక న్యాయం కోసమే నిలబడిందని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం కూడా మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉందని తెలిపారు.

ప్రభుత్వ సంస్థల్లో మైనారిటీలకు తగిన ప్రాతినిథ్యం కల్పించామనీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సైతం మైనారిటీ ప్రతినిధిని నియమించామని వివరించారు. ఫిరోజ్ ఖాన్, మహమ్మద్ అజహరుద్దీన్, షబ్బీర్ అలీలను ఎన్నికల్లో ప్రజలు గెలిపించకపోయినా, మంత్రిత్వ శాఖను వారి కోసం ఖాళీగా ఉంచి వారితోనే భర్తీ చేశామని సీఎం గుర్తుచేశారు. విద్యతో పాటు నైపుణ్యాలను సాధించటంపై దృష్టి సారించాలని సీఎం ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. సర్టిఫికెట్ల కన్నా పనితనానికి, నైపుణ్యానికే పట్టం కట్టే రోజులు వచ్చాయని తెలిపారు. యువతకు అవకాశాలు పెంచేందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చామని చెప్పారు. చదువు తగ్గ ఉద్యోగాలు లభించినప్పుడే ఆ చదువుకు సార్థకత లభిస్తుందని చెప్పారు. ఆ భావనకు తగ్గట్టు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూనే, ప్రయివేటు ఉద్యోగాలకు పోటీ పడేలా నైపుణ్య శిక్షణను అందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామని అన్నారు.

! గ్రూప్ -1 నియామకాలను తాము చేపడుతుంటే అడ్డుకునేందుకు కొందరు కోర్టు కెళ్లారనీ, కోర్టులోనూ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందని తెలిపారు. రాజకీయ నాయకులు ఐదేండ్లకు ఒకసారి పరీక్ష రాయాలనీ, అయితే వారు పాస్ అవుతారో? లేదో? అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లోకి కొత్తగా వచ్చిన వారు రాష్ట్రానికి దశాబ్దాల పాటు సేవలందించాల్సి ఉంటుందని తెలిపారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైజింగ్ కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఐఐటీ, నీట్ తదితర పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారితో పాటు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో పదవ తరగతి, ఇంటర్ లో ర్యాంకులు సాధించిన వారిని సీఎం సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, రాష్ట్ర సమాచార పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -