Sunday, August 16, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్చిన్న రైతులకు అధిక ఆదాయం

చిన్న రైతులకు అధిక ఆదాయం

- Advertisement -

సుమీత్ కౌర్… స్థాపించిన ‘స్పుడ్నిక్ ఫార్మ్స్’, సబ్‌స్క్రిప్షన్ పద్ధతి ద్వారా పట్టణ వినియోగదారులను స్థానిక రైతులతో అనుసంధానిస్తుంది. ఈ సంస్థ కర్ణాటక వ్యాప్తంగా 250 మంది రైతులతో కలిసి పనిచేస్తుంది. వారికి అధిక ఆదాయాన్ని అందించడంతో పాటు, కాలానుగుణంగా, దేశీయంగా, సుస్థిర పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది. దేశంలోని చిన్నరైతులకు అందునా మహిళా రైతులకు అధిక ఆదాయం వచ్చేలా సహకరిస్తున్న ఈ మహిళా పారిశ్రామికవేత్త కృషి గురించి నేటి మానవిలో….

2012లో సుమీత్‌ ‌తన కార్పొరేట్ జీవితాన్ని వదిలి అంతకంటే ముఖ్యమైనది ఏదో వెతుక్కుంటూ బయటకు వచ్చింది. ‘నేను ఢిల్లీలో పెరిగినప్పటికీ, మా కుటుంబానికి పంజాబ్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. నేను ఆ వాతావరణంలో పెరగకపోయినా గ్రామీణ జీవితానికి ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాను. ఒకానొక సమయంలో నా ఆహారాన్ని నేనే పండించుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఆ విషయం నాకు చాలా ఆసక్తిని కలిగించింది’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. అది తెలిసి స్నేహితుడి తండ్రి ఆమెకు బెంగళూరు శివార్లలోని హోస్కోట్‌లో ఉన్న తన ఖాళీ స్థలాన్ని ఇచ్చారు. వాస్తవానికి ఇది ఒక ప్రయోగంగా మొదలైంది. చివరికి ఆహారం, వ్యవసాయం, వ్యవసాయంలోని అవకాశాలతో ఆమెకున్న సంబంధాన్ని పునర్నిర్వచించే ఒక ప్రయాణంగా రూపుదిద్దుకుంది.

అతి తక్కువ కాలంలోనే…
మొదటి ఏడాది అంటే 2013 మొత్తం భూమిలోని బండరాళ్లను తొలగించి సాగుకు అనువుగా మార్చడానికే సరిపోయింది. ఆ తర్వాతి ఏడాది వర్క్‌షాప్‌లు, యూట్యూబ్ వీడియోల నుండి నేర్చుకుంటూ, సహజ వ్యవసాయ సూత్రాలను పాటిస్తూ, ఆమె నేలను దున్ని, విత్తనాలు నాటి, నీరు పోసింది. ఆ ప్రయోగం అతి తక్కువ కాలంలో కూరగాయలను పండించింది. సుమీత్ ఆ మిగులును స్నేహితులకు, పరిచయస్తులకు అమ్మడం ప్రారంభించింది. ‘నేను పండించిన వాటి రుచి సాధారణంగా దొరికే వాటికంటే భిన్నంగా చాలా బాగుండేది. అందుకే ప్రజలు నన్ను మరిన్ని అడగడం మొదలుపెట్టారు. అప్పుడే నాకు ఒక సమస్య ఎదురైంది.. అని ఆమె అంటుంది.

ఒక సుస్థిర వ్యవసాయ నమూనా
ఒక ప్రత్యామ్నాయం కోసం అన్వేషణలో సుమీత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ నమూనాలను అధ్యయనం చేసింది. అప్పుడే ఆమె కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ (సీఎస్‌ఏ) గురించి తెలుసుకుంది. ఇది అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాలలో విస్తృతంగా ఆచరించబడుతున్న ఒక విధానం. అయితే, ఆమె చదివిన సీఎస్‌ఏ నమూనాలు చాలా వరకు పాశ్చాత్య దేశాలవి. వాటిలో వందల ఎకరాల భూమి ఉండగా, కేవలం సీఎస్‌ఏ ఉత్పత్తుల కోసమే ఐదు నుండి పది ఎకరాలు కేటాయించబడతాయి. భారతదేశంలో చాలా వరకు తాజా ఉత్పత్తులు చిన్న, సన్నకారు రైతుల నుండి వస్తాయి. వీరు తరచుగా ఐదు ఎకరాలు లేదా అంతకంటే తక్కువ భూమిలో పనిచేస్తారు. దాంతో పెద్ద వ్యవసాయ క్షేత్రాల కోసం నిర్మించిన ఒక నమూనాను భారతీయ వ్యవసాయ వ్యవస్థకు ఎలా అనుగుణంగా మార్చుకోవాలనేది ప్రశ్నగా మారింది.

కరోనా కాలంలోనూ…
నెలల తరబడి పునఃసమీక్షించిన తర్వాత స్పుడ్నిక్ ఫార్మ్స్ నవంబర్ 2019లో అధికారికంగా దాని ప్రస్తుత రూపంలో ప్రారంభించబడింది. కానీ కోవిడ్-19 మహమ్మారి వ్యాపించడంతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ సమయంలో బెంగళూరులో ఎలాంటి అంతరాయం లేకుండా తాజా ఉత్పత్తులను సరఫరా చేయగలిగిన కొద్దిమందిలో స్పుడ్నిక్ ఒకటి. రెండు క్లస్టర్‌లలోని రైతులతో కలిసి పనిచేసింది. ప్రస్తుతం స్పుడ్నిక్ ఫార్మ్స్ కర్ణాటకలోని రెండు క్లస్టర్‌లలో సుమారు 250 మంది రైతులతో కలిసి పనిచేస్తోంది. వాటిలో ఒకటి బెంగళూరు శివార్లలోని నీలమంగళ సమీపంలో ఉండగా, మరొకటి ఉత్తర కన్నడలో ఉంది. ఇది రెతుల ఆదాయాన్ని నెలకు రూ. 30,000 పెంచడంలో సహాయపడింది.

తాజా ఉత్పత్తులకు మించి
‘మేము ఒకే రైతు నుండి అనేక పంటలను కొనగలుగుతున్నాము. ఒక వారం దోసకాయలు, తర్వాతి వారం బెండకాయలు, ఆపై ఏది సిద్ధంగా ఉంటే అది. ఇవన్నీ దాదాపు ఒకే భూమి నుండి వచ్చే నాలుగైదు వేర్వేరు పంటల నుండి వచ్చినవి’ అని ఆమె అన్నారు. స్పుడ్నిక్ ఫార్మ్స్ ఇప్పుడు తాజా ఉత్పత్తులకు మించి ఇంకా చేయాలని యోచిస్తుంది. ఉత్తర కన్నడలో రైతులు మోరంగడ్డ, కంద, చేమదుంప వంటి దేశీయ దుంప కూరగాయలను పండిస్తారు. అక్కడ మోరంగడ్డ పాపర్స్, చిప్స్‌, చేమదుంప చిప్స్‌ ఉత్పత్తి చేస్తూ, రైతులకు మరింత విలువను చేకూర్చే విలువ జోడింపు వ్యాపారాన్ని ఇది నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులతో పనిచేస్తున్నప్పటికీ, మరింత మంది రైతులు సేంద్రియ పద్ధతులకు మారేలా సహాయం చేయడమే దీర్ఘకాలిక లక్ష్యంగా పెటుట్కుంది.

​సవాళ్లు-భవిష్యత్ కార్యాచరణ
మారుతున్న వినియోగదారుల అలవాట్లు స్పుడ్నిక్ ఫార్మ్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ‘ప్రజలు ఏడాది పొడవునా అవే కూరగాయలు అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నారు. నేను మొదట నా సొంత ఆహారాన్ని పండించడం ప్రారంభించడానికి అది కూడా ఒక కారణం. స్థానికంగా, కాలానుగుణంగా లభించే వాటిని తినడంతోనే సుస్థిరంగా తినడం మొదలవుతుంది. ఉదాహరణకు, బఠానీలకు బదులుగా, బెంగళూరు వాతావరణం అవేకకాయలకు (బ్రాడ్ బీన్స్) బాగా సరిపోతుంది, ఇది కూడా అంతే పోషక విలువలు, రుచి కలిగిన ప్రత్యామ్నాయం’ అని ఆమె అంటారు.

మూడు అంశాల ఆధారంగా
స్పుడ్నిక్ ఫార్మ్స్‌కు 1,200 మందికి పైగా చందాదారులు ఉన్నారు. వీరు గూగుల్ ఫార్మ్స్ ద్వారా ఆర్డర్లు ఇస్తారు. చందాదారులు కాని వారు కూడా ఆర్డర్ చేయగలిగేలా ఇది తన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను కూడా నిర్మిస్తోంది. ఉత్పత్తిని వినియోగదారుడికి చేరవేయడానికి వారికి ఎంత ఖర్చు అవుతుంది, రైతులకు చెల్లించాల్సిన సరసమైన ధర, వినియోగదారులు వాస్తవంగా ఎంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అనే మూడు అంశాల ఆధారంగా ధర నిర్ణయించబడుతుంది. స్పుడ్నిక్ ఫార్మ్స్ స్వయం సమృద్ధితో నడుస్తోంది. లాభనష్టాలు లేకుండా నడిచే స్థితికి దగ్గరలో ఉంది.

​మూడు నెలల్లోనే
స్పుడ్నిక్ ఫార్మ్స్‌లో చేరిన మొదటి రైతు గౌరమ్మ. 2019లో ఆమె కేవలం 0.25 ఎకరాల్లో సేంద్రియ కూరగాయలను పండించింది. మూడు నెలల్లోనే ఆమె దాదాపు రూ. 50,000 సంపాదించారు. ఇది ఆమెను తన మొత్తం 1.5 ఎకరాల పొలంలో సాగును విస్తరించడానికి ప్రోత్సహించింది. నేడు ఆమె 10 రకాలకు పైగా కూరగాయలను పండిస్తూ నెలకు సుమారు రూ. 25,000 సంపాదిస్తున్నారు. పెరిగిన ఆదాయం ఆమె కుటుంబాన్ని ఒక సాదాసీదా కచ్చా ఇంటి నుండి మూడు పడకగదుల పక్కా ఇంటికి మారేలా చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -