Sunday, August 16, 2026
E-PAPER
Homeకథఈసారి ఆపాలి..

ఈసారి ఆపాలి..

- Advertisement -

”టక్‌…”
ఆ శబ్దం చిన్నదే. కానీ ఆ రాత్రి అది ఐదుగురి గుండెలని ఒక్కసారిగా తాకి జీవితాలను రెండు ముక్కలుగా కోసింది. అంతకు ముందు.. సాయంత్రం.. కాస్త చీకటిలోకి జారుతోంది. ఆకాశం బూడిద రంగులోకి మారిపోయింది. వర్షం పడే ముందు వచ్చే మట్టి వాసన గాలిలో తేలుతోంది. అర్జున్‌ తన సెల్‌ఫోన్‌ షాప్‌ ముందు నిలబడి ఉన్నాడు. షట్టర్‌ సగందిగింది.
”నాన్న.. ఇంకో కస్టమర్‌ వస్తాడు. ఐదు నిమిషాలు వెయిట్‌ చేద్దాం”
రామయ్య కొడుకుని ఎగాదిగా చూశాడు.
హొ”ఐదు నిమిషాలు.. చాలా సార్లు జీవితాన్ని తిప్పేస్తాయిరా” అన్నాడు రామయ్య. ”అంత పెద్దగా కాదు నాన్న..” అర్జున్‌ నవ్వాడు.
హొఅంతలోనే ఒక పోలీస్‌ జీప్‌ వచ్చి షాప్‌ ముందు ఆగింది. రోడ్డుని చీల్చుకుంటూ కీచుమని బ్రేక్‌ వేసిన శబ్దం తండ్రి–కొడుకులిద్దరినీ ఒక్కసారిగా
ఉలిక్కిపడేలా చేసింది. జీప్‌ నుంచి ఎస్సై మధు దిగాడు. కళ్ళు ప్రశాంతంగా లేవు. కోపం మాత్రం ఉంది. ఇంట్లోంచి స్టేషన్‌కి బయలుదేరినప్పటి నుంచి ఫోన్‌ మాత్రం ఆగలేదు.
హొ”ప్రతి కాల్‌లో అదే మాట.. ‘మాటలు కాదు.. రిజల్ట్‌ కావాలి!” ఫోన్‌ సైలెంట్‌లో పెట్టినా ఆ గొంతులు అతని లోపల ఆగలేదు.”
”యాక్షన్‌ తీసుకోండి..” ఎవరిమీదో ఎవరూ చెప్పరు. కానీ యాక్షన్‌ మాత్రం కావాలి. ఆ గందరగోళం, ఆ ఒత్తిడి.. ఎక్కడో ఒకచోట బయటకు రావాలి. ఆ క్షణంలో అతనికి దగ్గరగా ఉన్నవాళ్లు రామయ్య, అర్జున్‌. ”ఇంకా ఓపెన్‌ ఎందుకు ఉంది?” ఎస్సై మధు అడిగాడు.
అర్జున్‌ హొచెప్పాడు హొ”సార్‌… మూసేస్తున్నాం ఇంకో 5 నిమిషాలు”
హొ”రూల్‌ అంటే రూలే, హొటైమ్‌కి మూసేయాలి. ఇంకా ఐదు నిమిషాలు అంటే ఏంటి నీ ఉద్దేశ్యం ?” ఎస్సై గొంతు గట్టిగా పడింది.
”సార్‌.. చిన్న షాప్‌, కొంచెం లేటయ్యింది” రామయ్య చేతులు జోడించాడు. ఎస్సై మధు కళ్లలో ఒక్కసారిగా కోపం. ”స్టేషన్‌కి పదండి, అక్కడ
మాట్లాడుకుందాం” అది ఎస్సై ఆహ్వానం కాదు, ఆజ్ఞ. ఎంత బతిమాలినా కానిస్టేబుళ్లు ఖాతరు కాలేదు. తండ్రి–కొడుకులిద్దరినీ జీపులోకి ఎక్కించారు. ఖాళీ రోడ్డు మీద జీప్‌ దూసుకుపోతోంది. సైరన్‌ ఆన్‌ చేయలేదు. అవసరం లేదన్నట్టుంది. రోడ్డు మీద ఎవరూ లేరు. జీప్‌ వెనుక సీట్లో రామయ్య, అర్జున్‌. ఎదురుగా ఇద్దరు పోలీసులు. భయం రామయ్య గొంతును బిగించి పట్టుకుంది. మాటలు ఉన్నాయి. కానీ బయటకు రావడం లేదు.
హొ—
రన్నింగ్‌ జీప్‌లో ఎస్సై మధు వెనకే ఉన్న రామయ్య నెమ్మదిగా ముందుకు వంగాడు. ”సర్‌.. మమ్మల్ని వదిలేయండి, చిన్న విషయం సర్‌.. షాప్‌
మూసేయడానికి ఆలస్యం అయింది అంతే” బతిమాలుతున్నాడు. ఎస్సై మధు వెనక్కి తిరిగి చూడలేదు. కొంచెం సేపు గ్యాప్‌ ”చెప్పాను కదా.. స్టేషన్‌కి వెళ్లి మాట్లాడుకుందాం” ఎస్సై చిరాగ్గా అన్నాడు. వినడానికి నార్మల్‌గా ఉన్నా ఆ మాట ఏమంత మంచిగా లేదు. ఆ శబ్దంలో ఓదార్పుకంటే వార్నింగ్‌ మోతాదు ఎక్కువ ఉంది. తండ్రిని ఎస్సై చిరాకుపడ్డంతో అర్జున్‌ ఆగలేకపోయాడు ‘చీకటి పడింది, ఇంట్లో అమ్మ ఎదురు చూస్తుంది, మమ్మల్ని విడిచిపెట్టండి సర్‌”.
ఫ్రంట్‌ సీట్లో డ్రైవర్‌ పక్కన ఉన్న ఎస్సై బ్యాక్‌ మిర్రర్‌లోకి చూసి ”అయితే నువ్వు తప్పు చేయలేదంటావ్‌ అంతేగా’ గట్టిగా అరిచాడు. ”అంటే నిన్ను నేను సరదాగా పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్తున్నానా నీ ఉద్దేశ్యం?” ఎస్సై మధు టోన్‌ ఈసారి ఇంకా గట్టిగా పడింది. అర్జున్‌ సైలెంటైపోయాడు, కానీ అతడి కళ్లలో ఆ ప్రశ్న ఇంకా తిరుగుతూనే ఉంది. తను తప్పు చేయలేదు, మరి పోలీస్‌ స్టేషన్‌కి ఎందుకు తీసుకెళ్తున్నారు.
రామయ్య వెంటనే ఆ మాట పట్టుకున్నాడు ”చిన్నోడు సర్‌, ఏమీ తెలీదు.. తమరు పెద్దవారు క్షమించాలి సర్‌..” బతిమాలుతున్నాడు.
జీప్‌లో కూర్చున్న కానిస్టేబుళ్ళలో ఒకడు గట్టిగా నవ్వాడు ”తప్పు చేయలేదు మరి స్టేషన్‌కి వెళదామంటే ఎందుకురా అంత భయం?”.
”ఏమీ చేయలేదన్నది ఉన్న మాటే కదా సార్‌..” రామయ్య గొంతు సన్నగా వణికింది.
జీప్‌ స్పీడ్‌ పెరిగింది. రోడ్డు మీద లైట్లు వరుసగా వెనక్కి పారిపోతున్నాయి. అర్జున్‌ కళ్ళలో ఆ లైట్లు మెరుస్తున్నాయి, ఆరిపోతున్నాయి.
హొ”నాన్నా..” ఆర్జున్‌ నెమ్మదిగా పిలిచాడు. రామయ్య అతని చేతిని పట్టుకున్నాడు. ”ఏమీ అవ్వదు రా..” రామయ్య. అతని మాటల్లో నమ్మకం కంటే
ప్రార్థన ఎక్కువగా ఉంది.
”షాప్‌ దగ్గర ఏం మాట్లాడావ్‌, చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? ఇప్పుడు ఎందుకు సైలెంటయ్యావ్‌ ?” ఎస్సై మధు, అర్జున్‌తో మళ్ళీ మాట కలిపాడు. అర్జున్‌ ఓ క్షణం ఆలోచించాడు, తర్వాత నెమ్మదిగా ”సార్‌.. నిజమే చెప్పాను అంతే..” ఆ మాట జీప్‌లో ఉన్న పోలీసులందరికీ గట్టిగా తగిలింది. ఎస్సై వెనక్కి తిరిగాడు ”నిజం…? మాకు నువ్వు నిజం నేర్పించాలా?” అతని కళ్ళలో ఇగో హార్ట్‌ అయిన కోపం స్పష్టంగా కనిపిస్తోంది.
హొకంగారుగా రామయ్య ”సార్‌.. ప్లీజ్‌ సార్‌.. చిన్నోడు.. ఏమీ తెలియదు.. తప్పయ్యింది సార్‌..” తండ్రి తన కొడుకుని కాపాడుకోవడానికి ఇచ్చిన
సంజాయిషీ. జీప్‌ కొంచెం స్పీడ్‌ పెరిగింది. అర్జున్‌ బయటకి చూశాడు. ఇంటి దారులు కనిపించట్లేదు. తెలిసిన ప్రపంచం దూరమవుతోంది.
హొ”సార్‌.. ఇంటికి ఒక్క కాల్‌ చేయొచ్చా?” నెమ్మదిగా అడిగాడు అర్జున్‌. ఎవరూ స్పందించలేదు, మరోసారి అడిగాడు. ”సార్‌.. అమ్మకి చెప్పాలి” అర్జున్‌. ”స్టేషన్‌కి వెళ్ళాక చూసుకుందామన్నాకదా! సైలెంట్‌గా కూర్చో!” అర్జున్‌ ముందున్న కానిస్టేబుల్‌ గట్టిగా అన్నాడు. జీప్‌లో మళ్లీ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో భయం ఉంది, అనుమానం ఉంది, కనిపించని ప్రమాదం ఉంది.
రామయ్య కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా తనలో తను ”ఏదైనా బాగానే ముగియాలి..” అది దేవుడికి కాదు, అప్పుడున్న పరిస్థితికి రామయ్య చేసిన
విన్నపం.
హొహొ—
”నాన్నా.. మనం తిరిగి వెళతామా?” నెమ్మదిగా అడిగాడు. రామయ్య దగ్గర నుంచి రిప్లై లేదు. కొడుకు చేతిని గట్టిగా పట్టుకున్నాడు. జీప్‌ స్టేషన్‌ చేరగానే కానీస్టేబుల్స్‌ అర్జున్‌, రామయ్యలని కిందికి దింపి రైటర్‌కి అప్పగించి సివిల్లోకి మారిపోయారు. వెళ్తూ అర్జున్‌, రామయ్యలని చూపించి ఎస్సై సార్‌ని అడిగి ఎలా చెబితే అలా చేయమని డ్యూటీ దిగిపోయారు. అర్జున్‌, రామయ్య అక్కడే రాతి శిల్పాల్లా చేతులు కట్టుకుని మౌనంగా
రైటర్‌ మొహం చూస్తున్నారు. క్షణాలు, నిమిషాలు గడిచి దాదాపు గంటైంది. అప్పటిదాకా కంప్యూటర్లో ఎదో సీరియస్‌గా టైపుచేసే పనిలోఉన్న రైటర్‌ పని అయిపోయినట్లు తలెత్తి ”ఏరా ఏంటి కేసు, ఏమ్‌ చేశారేంటి?” ఆ మాటలో దురహంకారం తప్ప మనుషులతో మాట్లాడినట్లు ఇసుమంత కూడా లేదు.
”అయ్యా ! మాది సెల్‌ ఫోన్‌ రిపేరింగ్‌ షాపయ్యా” రామయ్య భయంగా… ”అయితే ఏంటి దొంగ సెల్‌ఫోన్లు కొన్న కేసా?’ వెంటనే రైటర్‌ జడ్జిమెంట్‌
ఇచ్చి పారేసాడు. ”అయ్యా! అదికాదు, మేము మా షాపు ఐదు నిమిషాల ఆలస్యంగా క్లోజ్‌ చేసి..” ఇంకా రామయ్య మాట పూర్తికానేలేదు, అంతలోపే ఫోన్లో ఏదో మాట్లాడుతూ రైటర్‌ పక్కకొచ్చి నిలబడ్డాడు ఎస్సై. కాల్‌ వ¶్యట్‌ చేసి ”ఏరా షాపు దగ్గర చెప్పిన నిజాలే మళ్లీ, మళ్లీ చెబుతున్నావా… తప్పులేకుండానే నేను నిన్ను పట్టుకొచ్చానంటావ్‌ అంతేగా” బూతుల్ని రంగరించి గట్టిగా అరిచేసాడు.
”ముందు వీళ్ళిద్దరిని ఇద్దరినీ లోపలేయండిరా” రైటర్‌కి ఆర్డర్‌ వేసాడు.
ఈ ఇద్దరూ ఎవరో తెలియదు, ఏ కేసులో తీసుకొచ్చారో తెలీదు ఎస్సై దొరగారు చెప్పిందే ఆలస్యం రైటర్‌ కానిస్టేబుల్‌ రవి, రేవతిలని కేకేశాడు. వెంటనే ఇద్దరినీ లోపలేసి లాకప్‌ తలుపు మూసేసారు.
”టక్‌” ఆ శబ్దం బయటకి వెళ్లే దారి మూసింది. లోపలికి చిక్కుకునే గాలి మొదలైంది.
హొ—
రవి ఈ మధ్యనే ట్రైనింగ్‌ కంప్లీట్‌ చేసి కొత్తగా వచ్చిన కానిస్టేబుల్‌. రవికి రేవతి వన్‌ ఇయర్‌ సీనియర్‌. ఈ స్టేషన్‌కి వచ్చి ఆర్నెళ్ళయ్యింది.
హొ”పోలీస్‌ అంటే భరోసా” అని ట్రైనింగ్‌లో నేర్పించారు. కానీ రవికి ఈ పోలీస్‌ డ్యూటీలో ఎక్కడా భరోసా కనిపించట్లేదు.
”సార్‌.. చిన్న విషయం అనుకుంటా..” ఆ నిశ్శబ్దంలో కూడా రవి ఎస్సైకి చెప్పేసాడు. ఎస్సై రవిని ఒక్క చూపు చూశాడు, ఆ చూపులో ఒకే మాట. ”నువ్వింకా ఏమీ నేర్చుకోలేదు”. రవి మౌనమయ్యాడు. కానీ ఆ మౌనం రవికి ఎందుకో జీవితానికి సరిపడా శిక్ష అవుతుందనిపించింది.
స్టేషన్లో ఫైళ్ల దగ్గర కూర్చుని ఇదంతా సైలెంట్‌గా చూస్తోంది రేవతి. ఆమె సంపాదనే కుటుంబానికి ఆధారం. ఎదో చేయాలని కసిగా
పోలీసు ఉద్యోగంలోకి వచ్చింది. సంపాదన అవసరమే కానీ అది చట్టబద్దంగా ఉండాలని రేవతి ఉద్దేశ్యం. చేసే పోలీసు ఉద్యోగం మీద ఎనలేని గౌరవం. అయినాసరే ”మనమేం స్పెషల్‌ కాదు అందరిలానే, ప్రజల్లో భాగమే..” అనే నిబద్దతని మాత్రం ఎన్నడూ ఆమె దాటలేదు. పోలీసు ఉద్యోగానికి రాకముందు ఊహించుకున్నదానికికి, ట్రైనింగ్‌లో నేర్పినదానికి వాస్తవం చాలాదూరంలో ఉందని రేవతికి అర్థమవుతోంది.

మూసిన లాకప్‌లో చీకటి త్వరగా దిగింది. రామయ్య గోడకి ఆనుకుని కూర్చున్నాడు. అర్జున్‌ నిలబడి ఉన్నాడు. ”నాన్నా.. ఏమీ అవ్వదు” అర్జున్‌. ”ఏమీ అవ్వదు అని పదేపదే అనకురా, అప్పుడు ఏదో అవుతుంది” నెమ్మదిగా అన్నాడు రామయ్య.
”అసలు మనల్ని ఎందుకు తీసుకొచ్చారు, మనమేం తప్పు చేసాం నాన్నా?” అర్జున్‌.
”వాళ్ళు పెద్ద వాళ్ళు… వాళ్ళమాటకి ఎదురెళ్ళద్దురా..” రామయ్య ఇంకా ఎదో చెప్పబోతున్నాడు…
”ఆపు నాన్న ! పెద్దా చిన్నా ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ…” నిలదీసినట్లే గట్టిగా అరుస్తున్నాడు అర్జున్‌.
సరిగ్గా అప్పుడొచ్చాడు ఎస్సై సెల్‌లోకి. ”నీకు రూల్స్‌ తెలుసా?” అర్జున్‌ కళ్లలోకి నేరుగా చూసి అడిగాడు.
”సార్‌.. మేము ఏ తప్పూ చేయలేదు” అర్జున్‌ ఎంత బలంగా చెప్పినా లాకప్‌ గదిలో ఆ గొంతు బలహీనంగా వినబడుతోంది
”అది నేను చెప్పాలి” దబాయించాడు ఎస్సై.
హొఅంతలోనే అర్జున్‌ మీద మొదటి దెబ్బ, శబ్దం చిన్నదే. ఆ తర్వాత రెండు, మూడు… ప్రతి దెబ్బ తర్వాత లోపల శబ్దాలు పెరిగాయి. అడ్డొచ్చిన రామయ్య మీద పడ్డాయి వరుసగా…”నాన్నను వదిలేయండి సార్‌!” అర్జున్‌ కేక. ఎస్సై ఇంకా రెచ్చిపోయాడు. రామయ్య గొంతు మరింత తగ్గిపోయింది. ”సార్‌.. ప్లీజ్‌..” రామయ్య బతిమాలుతున్నాడు. దెబ్బలు ఆగలేదు. వెంట వెంటనే ఇంకో దెబ్బ… ఇంకో కేక…. లాకప్‌ బయట కానిస్టేబుల్‌ రవి నిలబడి ఉన్నాడు. మొదటి కేక రవికి వినిపించినపుడు రవి గుండె గట్టిగా కొట్టుకుంది. ”లోపలికి వెళ్లాలా?” అతని మనసు అడిగింది. ”వద్దు..” భయం జవాబు చెప్పింది.
రవి కళ్ళు మూసుకున్నాడు. ”ఇది నా పని కాదు..” రవి లోపల మరో గొంతు మాట్లాడుతోంది ”అయితే నీ పని ఏమిటి?” రవి దగ్గర జవాబు లేదు. రేవతి కాళ్లు కదిలాయి. తలుపు వైపు నడిచింది. ”ఇది తప్పు..” ఆమె మనసు అరిచింది. అప్పుడే లోపల నుంచి ఎస్సై గట్టిగా ”ఎవరూ లోపలికి రాకూడదు!”. అంతే, రేవతి ఆగిపోయింది. ఆ క్షణానికైతే ఆమెని ఆపింది భయమే. కొద్దీ సేపటికి ఎస్సై లాకప్‌లోంచి విసురుగా తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిగా ధైర్యం తెచ్చుకుని లాకప్‌ దగ్గరకి నడిచింది రేవతి.
”అమ్మా.. నీళ్లు..” అన్నాడు రామయ్య. ఆ ఒక్క మాట ఆమె గుండెని తాకింది. నీళ్ల గ్లాస్‌ ఇచ్చింది. ”థాంక్స్‌ అక్క” అన్నాడు అర్జున్‌. ఒక్కసారిగా కంపించిపోయింది రేవతి. అప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది. బయట రామయ్య భార్య సీత నిలబడి ఉంది. చేతిలో భోజనం ప్యాకెట్‌. ”అక్కా.. ఒక్కసారి చూపిస్తారా?” రేవతి, సీత కళ్లలోకి చూసింది. ఆ కళ్లలో భయం ఉంది. ఆశ ఉంది. ”ఏమీ లేదు.. రేపు రండి” రేవతి.
ఆ మాట అబద్ధం, అయినా సీత నమ్మింది. నమ్మడం తప్ప సీత దగ్గర వేరేదారి లేదు. కొన్ని గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. రాత్రి వినిపించిన కేకలు.. పొద్దుటికి నిశ్శబ్దంగా మారిపోయాయి.
హడావుడిగా తండ్రీకొడుకులను జీప్‌లోకి ఎక్కించారు. ఈసారి రవి డ్రైవ్‌ చేస్తున్నాడు. నిన్న వాళ్ళని స్టేషన్‌కి తీసుకువచ్చిన జీప్‌ అదే. ఇప్పుడు అదే జీప్‌ వాళ్ళని హాస్పిటల్‌కి మోసుకెళ్తోంది. తేడా ఒక్కటే అప్పుడు వాళ్లు మాట్లాడుతున్నారు.. ఇప్పుడు మాంసపు ముద్దగా మారి ఉన్నారు. కానిస్టేబుల్‌ రవి చేతులు స్టీరింగ్‌ మీద వణుకుతున్నాయి. రియర్‌ వ్యూ మిర్రర్‌లో చూసాడు. నిన్న రాత్రి కళ్లలో భయం కనిపించిన చోట ఇప్పుడు కదలిక లేదు.
”ఇంకా బతికే ఉంటారు..” రవి తనను తాను నమ్మించుకున్నాడు. కానీ అతని గుండె మాత్రం నిజం తెలుసుకుంది. జీప్‌ హాస్పిటల్‌ రీచ్‌ కాగానే స్ట్రెచర్‌లు పరుగెత్తాయి. డాక్టర్లు వచ్చారు. కొన్ని క్షణాలే, చాలా పెద్ద సమయంలా అనిపించాయి. తర్వాత డాక్టర్‌ ఫైల్‌ మూసేశాడు. ”బ్రాట్‌ డెడ్‌” ఆ మాట గదిలో పడలేదు. మనుషుల మీద పడింది. అంతా ముగిసిన తర్వాత కానీ సీతకి పిలుపు వెళ్ళలేదు. ఆమెకు ఇంకా ఏమీ తెలియదు. సీత స్టేషన్‌ నుంచి పిలుస్తున్నారని, ”వదిలేస్తారుగా?” కానిస్టేబుల్‌ రేవతిని ఆశగా అడిగింది. రేవతి ఓ క్షణం సీత కళ్లలోకి చూసింది. ఆ కళ్లలో నమ్మకం ఉంది. తాను చెప్పాల్సిన నిజం మాత్రం, ఆ నమ్మకాన్ని బద్దలుకొట్టేదే. రేవతి నిశ్శబ్దంగా తల తిప్పి ”వెళ్దాం..” అంది. అది సమాధానం కాదు, దాచిన నిజం. హాస్పిటల్‌కి బయలుదేరేలోపే సీత ఒక్కసారిగా ఆగింది. ”తినడానికి ఏమైనా ఇవ్వొచ్చా?” అంది.
ఆ పరిస్థితిలో కూడా ఆమెకు గుర్తొచ్చింది భర్త, కొడుకు ఆకలి. హడావుడిగా దగ్గరలోని హోటల్‌కి వెళ్లి వేడివేడి అన్నం పార్సిల్‌ కట్టుకుంది. ఆమెకు
తెలియదు ఆ అన్నం ఎప్పటికీ వాళ్లకు చేరదని. హాస్పిటల్‌ ముందు పోలీసుల హడావుడి. పోస్ట్‌మార్టం మాటలు. రేవతి, సీతని లోపలికి తీసుకెళ్లింది. అది ఎమర్జెన్సీ వార్డు. అక్కడ అన్నీ ఆయిపోయి, రామయ్య, అర్జున్‌ శరీరాలు మాత్రమే ఉన్నాయి.
సీత ఒక్కసారి కానిస్టేబుల్‌ రేవతిని చూసింది. ఆమె కళ్లలో షాక్‌ లేదు. నమ్మకం ఇంకా ఉంది. ”అదేంటి..?” ఆమె నవ్వే ప్రయత్నం చేసింది. ”లేస్తారు కదా..” ఆ మాట గదిలో చెల్లాచెదురైంది.
ఎవరూ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే సమాధానం అంటే నిజం. ఆ నిజం చెప్పడానికి అక్కడ ఎవరికీ ధైర్యం లేదు. సీత చేతిలోని భోజనం ప్యాకెట్‌ జారిపోయింది. ఆమె స్తంభించిపోయింది. ఏడుపు రాలేదు. అరుపు రాలేదు. కేవలం ఒక శూన్యం. ఎందుకంటే కొన్ని నష్టాలు కన్నీళ్లకీ అందవు.

రామయ్య, అర్జున్‌ లాకప్‌ డెత్‌ ప్రకంపనలు రేపింది. ప్రజల ఆగ్రహం కట్టలు తెగింది. న్యాయంకోసం ఉద్యమాలు జరిగాయి, ఆ తర్వాత ఎంక్వైరీలు వచ్చాయి. ఫైళ్లు తెరుచుకున్నాయి. మీడియా కెమెరాలు వెలిగాయి. ప్రశ్నలు వరుసగా నిలబడ్డాయి.
”మీరు ఏం చూశారు?” కానిస్టేబుల్‌ రవి కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఆ రాత్రి మళ్లీ అతని చెవుల్లో వినిపించింది దెబ్బల శబ్దం.. కేకలు.. ఆ తర్వాత వచ్చిన భారమైన నిశ్శబ్దం.
”నేను.. విన్నాను అంతే…” రవి ఏదో చెబుతున్నాడు. ఒక్క క్షణం ఆగాడు. ఆ గ్యాప్‌లో అతని భయం, నిస్సహాయత, పశ్చాత్తాపం అన్నీ నిలిచిపోయాయి.
”నేను ఆపలేదు” ఆ మాట కోర్టులో కాదు. రవి మనసులో మార్మోగింది.
కానిస్టేబుల్‌ రేవతి వంతు వచ్చింది. ఆమె కళ్ళలో కన్నీళ్లు లేవు. కానీ నిద్రలేని రాత్రులు కనిపిస్తున్నాయి.
”నేను ఆపగలిగేదాన్ని..” రేవతి అంది. ఒక క్షణం ఆమె గొంతు బరువైంది ”కానీ.. ఆపలేదు”
అది సాక్ష్యం కాదు. ఒక మనసు వేసుకున్న శిక్ష. తీర్పు వచ్చింది. దోషులకు శిక్ష పడింది. సీత మాత్రం అదే చోట కూర్చుంది. చాలాసేపటి తర్వాత నెమ్మదిగా అడిగింది.. ”వాళ్లు తిరిగి వస్తారా?” ఎవరూ సమాధానం చెప్పలేదు.
తర్వాత కొన్ని రోజులకి మళ్లీ రోజులాగానే రాత్రి వచ్చింది. మళ్లీ అదే స్టేషన్‌… లేదా మరో స్టేషన్‌. మళ్లీ అదే లాకప్‌ గోడలు, అదే తలుపు. కాలం
మారింది. మనుషులు మారారు. కానీ ఆ తలుపు మారలేదు. లాకప్‌ దగ్గర ఎవరో నిలబడ్డాడు. కొత్తగా రవి స్థానంలో వచ్చిన కానిస్టేబుల్‌. కొత్త భయం. ”ఈ రోజు నేను తలుపు తెరవాలి..” అని తనలో తాను అన్నాడు. పక్కనే మరో మహిళ నిలబడి ఉంది. రేవతి స్థానంలో వచ్చిన కానిస్టేబుల్‌. కళ్ళలో అదే సందేహం, అదే బాధ్యత. బయట మళ్లీ జీప్‌ ఆగింది, మరో అరెస్ట్‌. మళ్లీ కథ మొదలు.
”ముందు మాట్లాడుకుందాం..” ఆమె గొంతు మదువుగా ఉంది. ఈసారి ఆ మాటలో ఓదార్పు ఉంది. తలుపు దగ్గర ఉన్న ఆ వ్యక్తి చేయి ఈ సారి లాకప్‌ తాళం మీద కాదు.. హ్యాండిల్‌ మీద ఉంది. ఆ పోలీసు ఒక్కసారి వెనక్కి చూసాడు. ఆ కళ్లలో ఒక నిర్ణయం ”ఈసారి ఆపాలి.”

– పండరినాథ్‌ ప్రభల
[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -