Sunday, August 16, 2026
E-PAPER
Homeకవితదువా పూర్తికాని చేతులు

దువా పూర్తికాని చేతులు

- Advertisement -

గుమ్మం దగ్గర వేలాడే దీపానికి
ఎవడు పేరు అడుగుతాడు?
వెలుగు కావాలంతే…
గాలి దెబ్బలు
దాని గుండె మీద పడతాయా,
మంట మీద పడతాయా అని
ఎవరూ లెక్క పెట్టరు.
అలమార మూలన
మడతపడ్డ చీరలు లెక్కపెడతారు…
మడతపడ్డ కలలను
లెక్కపెట్టే హిసాబ్‌
ఏ దఫ్తర్‌లోనూ ఉండదు.
ఒక నవ్వు…
గోడలోని పగుళ్ల మీద
సున్నం పూసినట్టే.
దగ్గరగా చూస్తేనే తెలుస్తుంది…
ఇల్లు ఇంకా కంపిస్తోందని.
గుండె లోపల
ఎంత ఉప్పు పేరుకుందో…
సముద్రానికైనా తెలీదు.
కళ్ల దాకా వచ్చి
తిరిగి వెళ్లిపోయిన కన్నీళ్లు
దువా పూర్తికాని
చేతుల్లా ముడుచుకుని పడుంటాయి.
పొద్దున్నే కట్టుకునేది
అందాన్ని పెంచే చీర కాదు…
నిన్నటి అలసటకు
ఇవాళ్టి రంగు తొడిగిన ఓపిక.
అందరికీ కనిపించేది
చక్కని ఇల్లు.
కనిపించనిది…
ప్రతి గోడను
భుజాలతో మోసే
పునాది నొప్పి.
మౌనం అంటే…
ఖాళీ కాదు.
తాళం పడిన మసీదు.
అజాన్‌ వినిపిస్తుంది…
లోపలికి వెళ్లే తలుపు మాత్రం
ఎప్పుడో మూసుకుపోయింది.
ఎవరైనా అడుగుతారు…
”అంతా ఖైరియత్‌నా?”
పెదవులు చెబుతాయి…
”అల్హమ్దులిల్లాహ్…”
గుండె మాత్రం
తస్బీహ్ దాణాల్లా
ఒక్కో నిట్టూర్పును
వేళ్ల మధ్య తిప్పుకుంటూనే ఉంటుంది.
కొండలు
ఏడవాలని నిర్ణయించుకుంటే
నదులవుతాయి.
కొందరు స్త్రీలు కూడా అంతే…
వాళ్లు మాట్లాడాలని నిర్ణయించుకుంటే
కవితలు కావు…
చరిత్రలో దాచిపెట్టిన
అన్ని మౌనాలకూ
ఉహుద్‌ యుద్ధంలో
ఖడ్గం పట్టిన
నూసైబా బింత్‌ కాబ్‌
గొంతుకలవుతారు.

షేక్‌. నసీమాబేగం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -