బీఆర్ఎస్ వల్లే వాటిలో లొసుగులు
హైకోర్టు స్టే పై డివిజన్ బెంచ్ కు వెళతాం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కచ్చితంగా కొనసాగిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లోని సచివాలయంలో రాష్ట్ర మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆయా పథకాల్లో ఏవైనా లొసుగులుంటే వాటికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు. అప్పుడే సరైన ఉత్తర్వులు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ఆ రెండు పథకాలపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై డివిజన్ బెంచ్ కు వెళతామని స్పష్టం చేశారు. స్టే ఇవ్వడమంటే పూర్తిగా నిలిపివేయడం కాదని తెలిపారు. ఆ పథకాలను నిలిపివేస్తున్నారంటూ బీఆర్ఎస్ మొసలి కన్వీరు కారుస్తున్నదని ఆయన విమర్శించారు. డివిజన్ బెంచ్ అప్పీల్ పై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కౌంటర్ ఫైల్ చేయడంలో అధికారుల లోపమా? లేక న్యాయపరమైన అంశాలు చూసే వారి లోపమా? అనే దానిపై విచారణ చేయిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎవరి తప్పో తెలిసిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. పేదలకు అండగా నిలిచిన ఆ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. వివాహ సమయంలో కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గత ప్రభుత్వం తెచ్చిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కొనసాగిస్తోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఈబీసీల్లోని పేదలకు ఈ పథకం వర్తింపజేస్తున్నట్టు తెలిపారు.
ఈ పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి సోషల్ వెల్ఫేర్ ద్వారా రూ. 2,734.81 కోట్లను 2,73,164 మంది, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా రూ.1,801.48 కోట్లను 1,79,939 మందికి, బీసీ వెల్ఫేర్ ద్వారా రూ.7,803.05 కోట్లను 7,79,401 మందికి, ఈబీసీల సంక్షేమం కింద రూ.831.70 కోట్లను – 83,074 మందికి, మైనారిటీ వెల్ఫేర్ ద్వారా రూ.3,204.83 కోట్లను 3,62,769 మందికి మొత్తం: రూ.16,375.87 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఈ పథకాల కింద ఇప్పటివరకు రూ.16,375.87 కోట్లకు పైగా 16,78,347 మంది లబ్దిదారులు అందుకున్నారని తెలిపారు.
ఆ పథకాలు ఎటువంటి చట్టాన్ని అమలు చేయడానికి రూపొందించినవి కావని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కార్యనిర్వాహక అధికారంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని సంక్షేమ అంశాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా పథకాలు రూపొందించడానికి రాజ్యాంగబద్ధమైన అధికారం కలిగి ఉందని తెలిపారు.
దీనికి సుప్రీంకోర్ రాయ్ సాహిబ్ రామ్ జవాయ కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ తీర్పు కూడా ముఖ్యమైన న్యాయ ఆధారమని తెలిపారు.
పథకాల కోసం కేటాయించే నిధులకు రాష్ట్ర బడ్జెట్ ద్వారా శాసనసభ ఆమోదం ఉంటుందని వివరించారు. ట్రెజరీ రూల్స్, ఫైనాన్షియల్ కోడ్, ఇతర ఆర్థిక నిబంధనలకు అనుగుణంగానే నిధులు విడుదలవుతాయి. పథకాల్లో అర్హత, ఆదాయ పరిమితి, వయస్సు, ఆధార్, వివాహం తదితర అంశాలపై నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయని చెప్పారు. వివాహ సమయానికి వధువు 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండటం తప్పనిసరి అనీ, ఆర్డీవో, ఎమ్మార్వో స్థాయిలో లబ్ధిదారుల అర్హతను పరిశీలించే వెరిఫికేషన్ వ్యవస్థ ఉందన్నారు. ఎలాంటి నియంత్రణ లేకుండా ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వాస్తవానికి విరుద్ధం. కాగ్ నివేదికలోని అభ్యంతరాలు, సూచనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వివాహాన్ని ప్రయివేట్ ఈవెంట్ గా చూడటం సరికాదని ఆయన హితవు పలికారు. పేద కుటుంబాలకు వివాహం ఒక సామాజిక, ఆర్థిక బాధ్యత అని గుర్తుచేశారు. ఈ పథకాలు సామాజిక న్యాయం, బలహీన వర్గాల సంక్షేమం అనే రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు.
ఆర్టికల్ 46 బలహీన వర్గాల విద్యా, ఆర్థిక ప్రయోజనాల అభివృద్ధికి రాష్ట్రం కృషి చేయాలని సూచిస్తుందని గుర్తుచేశారు. స్టే ఇచ్చిన
కోర్టు ఆదేశాలను ప్రభుత్వం గౌరవిస్తుందనీ, అదే సమయంలో ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కౌంటర్ అఫిడవిట్ ద్వారా పథకాల చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత, ప్రజా ప్రయోజనాన్ని వివరించిందని తెలిపారు. పేదలకు నష్టం కలగకుండా న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం వినియోగించుకుంటుందని చెప్పారు.
గతంలో నిధులు కేటాయింపులకు సంబంధించిన ఇబ్బంది ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేసిందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీలకు ఎంత మందికి ఇండ్లు ఇచ్చారు? ఎంత మందికి ఉపాధి కల్పించారు ? చర్చ కు రావాలని ఆయన సవాల్ విసిరారు. బీసీ కులగణనలో భాగస్వామ్యం కాని వారు ధర్నా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కోర్టు స్టే విధిస్తూ అప్పీల్ కు వచ్చే నెల 9 వరకు అవకాశమిచ్చినప్పటికీ వేచి చూడకుండా స్టే తొలగింపునకు వెళుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పెండ్లయ్యాక పిల్లలను ఎత్తుకుని వచ్చి చెక్కులు తీసుకునే పరిస్థితి ఉండేదని విమర్శించారు.
నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణను మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, బలహీన వర్గాల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లను కొనసాగిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



