కారుపోతుల కాంతమ్మ, అంజన్న సేవలు స్ఫూర్తిదాయకం :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
తాటిపాములలో సంతాప సభ, వర్థంతి సభ
నవతెలంగాణ – తిరుమలగిరి
కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం కేవలం అధికార రాజకీయాలు చేయడం కాదని, పెట్టుబడిదారీ, కార్పొరేట్ దోపిడీని అంత మొందించి శ్రామిక వర్గ రాజ్యాన్ని స్థాపించడమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాములలో సోమవారం కారుపోతుల కాంతమ్మ సంతాప సభ, కారుపోతుల అంజన్న 31వ వర్థంతి సభలను సీపీఐ(ఎం) నాయకులు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. కాంతమ్మ, అంజన్న చిత్రపటాలకు జాన్వెస్లీ, హాజరైన నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంతమ్మ నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేశ్ అమ్మమ్మ. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జాన్వెస్లీ మాట్లాడుతూ కారుపోతుల కాంతమ్మ, కారుపోతుల అంజన్న కమ్యూనిస్టు ఉద్యమంలో అందించిన సేవలు, త్యాగాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కాంతమ్మ తన జీవిత కాలంలో కమ్యూనిస్టు పార్టీకి, ఉద్యమాలకు అండగా నిలిచారని చెప్పారు. కళాకారుల నుంచి భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు వెంకటరెడ్డి వంటి అగ్ర నాయకుల వరకు వారి ఇల్లు ఉద్యమ కేంద్రంగా సేవలందిం చిందన్నారు. భూస్వామ్య వ్యవస్థకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమ చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని గుర్తుచేశారు. దేశంలో కార్మికులు, రైతులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు, భూస్వాములకు మాత్రమే ప్రభుత్వాలు కొమ్ముగాస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. పేదరికం, నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దోపిడీ, అసమానతల వ్యవస్థపై శ్రామిక వర్గాలందరినీ ఏకం చేసి, హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాటాలు సాగించడమే కాంతమ్మ, అంజన్నకు నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
విప్లవోద్యమంలో వారి సేవలు
మరువలేనివి : మల్లు లక్ష్మి
విప్లవోద్యమంలో కాంతమ్మ, అంజన్న సేవలు మరువలేనివని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి అన్నారు. గతంలో గోడల మీద విప్లవ నినాదాలు, అక్షరాలు రాస్తున్నప్పుడు దొరల బెదిరింపులను సైతం లెక్కచేయకుండా, మల్లు స్వరాజ్యం చూపిన ధైర్యం, ఇతర నాయకులు చూపిన బాటలో ఈ ప్రాంతం ఉద్యమపథంలో రాణించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ పత్రిక ఎడిటర్ రాంపల్లి రమేశ్, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మది వెంకటేశ్వర్లు, కొండమడుగు నర్సింహ, ఆనందాచారి, తిరుమలగిరి మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లయ్య, మాజీ జెడ్పీటీసీ సూర్యాపేట జీడి భిక్షం, మాజీ ఎంపీపీ కరుణ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, సీపీఐ(ఎం) స్థానిక నాయకులు, సర్పంచ్ బోయపల్లి కిషన్, ప్రజానాట్యమండలి నాయకులు బూరుగుల ప్రభాకర్, కాంతయ్య, నవతెలంగాణ బోర్డు సభ్యులు సలీమా, మోహనకృష్ణ, అజయ్, తదితరులు పాల్గొన్నారు.
అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : జూలకంటి
తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వేలాది మంది అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సమాజంలో శోషిత వర్గాల హక్కుల కోసం, సామ్యవాద సమాజ స్థాపన కోసం ఎర్రజెండా నీడలో సాగిన పోరాటాలను కాంతమ్మ, అంజన్న తమ జీవితాంతం కొనసాగించిన తీరు ప్రశంసనీయమన్నారు.



