Tuesday, August 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు‌పేదల ఆరోగ్యం మా బాధ్యత

‌పేదల ఆరోగ్యం మా బాధ్యత

- Advertisement -

విద్యావైద్యరంగాలకు ప్రాధాన్యతిస్తున్నాం
ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌ కోసమే రూ.5,226 కోట్లు ఖర్చుచేశాం
వైద్యారోగ్య శాఖకు రూ.21,800 వెచ్చించాం
టెంకాయలు కొట్టి వదిలేసినోళ్లు టిమ్స్‌ కట్టామని గొప్ప‌లా
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అదనపు
సమయం పనిచేసే డాక్టర్లకు ప్రోత్సాహకాలివ్వండి
డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి టిమ్స్‌ ప్రారంభోతవ్సంలో సీఎం రేవంత్‌‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పేదల వైద్యానికి ప్రాధాన్యమిస్తున్నామనీ, వారి ఆరోగ్యం తమ బాధ్యత అని సీఎం రేవంత్‌‌రెడ్డి నొక్కి చెప్పారు. వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్యావైద్య రంగాల కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌‌లోని సనత్‌‌నగర్‌‌ లో నూతనంగా నిర్మించిన డాక్టర్‌ ‌మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌ ఆస్పత్రిని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రారంభిం చారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ఆరోగ్యదీపిక పాలిక్లినిక్‌లను ప్రారంభించారు. సురక్షితమైన ఆహారం, నాణ్యమైన మందులు అందించడమే లక్ష్యంగా టీసేఫ్‌ ‌వ్యవస్థను ప్రారంభించారు. పలువురు ‌డాక్టర్లను సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ బిడ్డలను ప్రపంచంలోనే గొప్ప స్థానాల్లో చూడాలని నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, జపాన్ దేశాల్లోనూ అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, ఆ భాషలను నేర్చుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. వైద్యం అత్యంత ఖరీదు కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు కార్పొరేట్‌ ‌స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించాలనే లక్ష్యంతోనే సనత్‌‌నగర్‌, అల్వాల్‌, ఎల్‌‌బీనగర్‌ టిమ్స్‌‌లను, వరంగల్‌, ఉస్మానియా ఆస్పత్రులను కడుతున్నా మని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కోసం రూ.2700 కోట్లు, సీఎంఆర్ఎఫ్ కోసం రూ. 2526 కోట్లు, మొత్తంగా ఆ రెండింటికీ రూ.5,226 కోట్లను ఖర్చుచేశామని వివరించారు. రెండేండ్లలో వైద్యారోగ్య శాఖ కోసం రూ.21,800 కోట్లు వెచ్చించామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాలను కట్టించాలనే సోయి గత ప్రభుత్వానికి ఎందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు.

టిమ్స్ ఆస్పత్రులకు, వరంగల్ దవాఖానాకు కేవలం టెంకాయలుకొట్టి వదిలేశారనీ, పదేండ్లలో వాటిని ఎందుకు కట్టలేదని అడిగారు. ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్‌‌లను, వరంగల్, ఉస్మానియా ఆస్పత్రులను 2027 డిసెంబర్‌ ‌తొమ్మిదో తేదీకల్లా పూర్తిచేసి ఒక్కో ఆస్పత్రికి ఒక్కో డైరెక్టర్‌‌ను నియమించి స్పెషాల్టీ వైద్యసేవలను అందజేస్తామనీ, వాటిని నిమ్స్‌ ‌తరహాలో తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. అవన్నీ పూర్తయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరో పదివేల బెడ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆస్పత్రికొచ్చే రోగుల సహాయకులు ఉండేదుకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. డాక్టర్‌ ఎమ్‌‌సీఆర్‌ ‌టిమ్స్‌‌లో సూపర్‌ ‌స్పెషాలిటీ పీజీ విద్య, నర్సింగ్‌ ‌కాలేజీ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో అదనంగా సమయం వెచ్చించి సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యసేవలందించే, సర్జరీలు చేసే వైద్యులకు ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను వేదిక నుంచే ఆదేశించారు. తాము సనత్‌‌నగర్‌ ‌టిమ్స్‌ ‌ప్రారంభిస్తామని ప్రకటించగానే కొందరు పగటివేషగాళ్లలా తిరిగి పోయారనీ, ఇది తామే కట్టామని కేటీఆర్‌ ‌చెప్పి పోయారని విమర్శించారు. వెనక ఉన్న ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రికి వెళ్లి మానసిక రోగిని టిమ్స్‌ కట్టిన తమను గుర్తుపపట్టట్లేదా? అని కేటీఆర్‌ అడిగితే…‘‘ఈడికొచ్చినప్పుడు చార్మినార్‌ నేనే గట్టిన. హైదరాబాద్‌‌ను నేనే నిర్మించిన అనుకునేటోన్ని. ఊకో బిడ్డా నేను కూడా మొదట్లో అలాగే మాట్లాడేటోన్ని. ఈడ డాక్టర్లు మంచిగ చూస్తరు. రానురాను పిచ్చి తగ్గిపోతది లే అన్నడంట’’ అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ ‌పాలనలో ఎర్రవెల్లి, జన్వాడ, మొయినాబాద్, శంకర్ పల్లి ఫామ్ హౌసులు నిర్మించుకునేందుకు సమయం ఉందిగానీ ప్రభుత్వ ఆస్పత్రులను కట్టించి ప్రారంభించేందుకు పదేండ్లలో సమయమే దొరలేదా? అని ప్రశ్నించారు. అబద్దాలు మానుకుని ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలనీ, నియోజకవర్గానికి పది నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చుచేసి ప్రజలకు సేవచేస్తే చేసిన పాపాలు కొంతైనా తగ్గుతాయని బీఆర్‌ఎస్‌ ‌నేతలకు సూచించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ 2034 వరకు మారకూడదనీ, ఇలా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. వాళ్లు అబద్ధాలు చెప్పడం మాననంత కాలం ప్రజలకు నిజాలు చెబుతూనే ఉంటానన్నారు.

బీఆర్‌ఎస్‌ ‌నేతల ప్రచారం పచ్చి అబద్ధం : 
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ…తాము కట్టిన వాటిని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రారంభిస్తోందని బీఆర్‌ఎస్‌ ‌నేతలు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని విమర్శించారు. ‌సనత్‌‌నగర్‌ టిమ్స్‌ ‌కోసం బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఖర్చుచేసింది రూ.70 కోట్లు మాత్రమేననీ, ఆ డబ్బులతో అది ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం కోసం తమ ప్రభుత్వం రెండున్నరేండ్లలో రూ.9 వేల దాకా ఖర్చుపెట్టిందనీ, ఆరు ప్రధాన ఆస్పత్రుల నిర్మాణాలపైనే రూ.3,800 ఖర్చుచేశామని గణాంకాలతో సహా వివరించారు. ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలను రూ.10 లక్షల సహాయాన్ని అందిస్తున్నామనీ, ప్రతి నెలా ఆరోగ్య శ్రీ పథకం కిందనే రూ.100 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు.

90 శాతం వైద్యసేవలు జిల్లాల్లోనే అందేలా కృషి : 
మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ
90 శాతం వైద్యసేవలు జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లోనే అందేలా కృషి చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ తెలిపారు. సనత్‌‌నగర్‌ ‌టిమ్స్‌‌లో గుండె సంబంధ, అవయమార్పిడి, కిడ్నీ…ఎల్‌‌బీనగర్‌ ‌టిమ్స్‌‌లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడీయాట్రిక్‌…అల్వాల్‌ ‌టిమ్స్‌‌లో న్యూరాలజీ, జెనిటిక్‌‌కు సంబంధించిన స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తామని మరోమారు చెప్పారు. టిమ్స్‌‌లో ఏర్పాటు చేసిన అత్యాధునికమైన రేడియాలజీ విభాగం గురించి వివరించారు. రాబోయే పదేండ్లలో తలసేమియా రహిత తెలంగాణగా మార్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. మహిళా సంక్షేమం, వైద్యం, విద్య, సంక్షేమం ప్రభుత్వానికి నాలుగు ఫిల్లర్ల లాంటివనీ, వాటిపైనే దృష్టి పెట్టి తమ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. ప్రతి టిమ్స్‌‌లో విదేశీ రోగులకు చికిత్సలు అందించేందుకు వంద పడకల చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు.

​దసరాకల్లా అల్వాల్‌ ‌టిమ్స్‌…డిసెంబర్‌ ‌నాటికి ఎల్‌‌బీనగర్‌ ‌టిమ్స్‌ ‌పూర్తిచేస్తాం : మంత్రి కోమటిరెడ్డి
దసరానాటికల్లా అల్వాల్‌ ‌టిమ్స్‌‌ను, డిసెంబర్‌ ‌నాటికి ఎల్‌‌బీనగర్‌ ‌టిమ్స్‌‌, వరంగల్‌ ఆస్పత్రుల నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి తెలిపారు. ఎల్‌ఓసీలు, సీఎంఆర్‌ఎఫ్‌ ‌నిధులను ఎప్పటికప్పుడు క్లియర్‌ ‌చేస్తున్నామని గణాంకాలతో వివరించారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం 20 శాతం పూర్తయిందని తెలిపారు. ఎల్‌‌బీఆర్‌ ‌టిమ్స్‌‌కు కొండా లక్ష్మణ్‌‌బాపూజీ, అల్వాల్‌ ఆస్పత్రికి మాజీ సీఎం టి.అంజయ్య, వరంగల్‌ ఆస్పత్రి ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌పేర్లను నామకరణం చేయాలని సీఎంకు సూచించారు.

రోగుల సేవల్లో 70 శాతం నర్సులదే : మంత్రి పొన్నం
తెలంగాణ కోసం కొట్లాడిన మర్రి చెన్నారెడ్డి పేరుమీద టిమ్స్‌ ‌ఆస్పత్రిని ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. డాక్టర్లు దేవుళ్లతో సమానమనీ, నర్సులు దైవదూతలని కొనియాడారు. రోగులకు వైద్య సేవలందించడంలో నర్సుల పాత్ర కీలకమనీ, డాక్టర్లు 30 శాతం సేవ చేస్తే 70 శాతం సేవ నర్సులదేనని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌‌యాదవ్‌, ఎంపీ అనిల్‌‌కుమార్‌ ‌యాదవ్‌, వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టియానా చోంగ్తూ, కమిషనర్‌ ‌సంగీతా సత్యనారాయణ, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, నిమ్స్‌ ‌డైరెక్టర్‌ ‌రాహుల్‌ ‌దేవరాజ్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -