Wednesday, August 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమెట్రో ఫేజ్‌-2 ఎన్‌వోసీల జారీ వేగవంతం

మెట్రో ఫేజ్‌-2 ఎన్‌వోసీల జారీ వేగవంతం

- Advertisement -

కేంద్ర, రాష్ట్ర శాఖలతో సచివాలయంలో సమన్వయ భేటీ
అనుమతులే ప్రాజెక్టుకు కీలకం : స్పెషల్‌ సీఎస్‌ జయేష్‌ రంజన్‌
122.9 కి.మీ.. 7 కారిడార్ల విస్తరణకు సన్నాహాలు
నవతెలంగాణ–సిటీ బ్యూరో

​హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఫేజ్‌-2 ప్రాజెక్టుకు సకాలంలో అనుమతులు సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరితగతిన అనుమతులు పొందేందుకు వీలుగా సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు నిరభ్యంతర పత్రాల(ఎన్‌వోసీల) జారీని వేగవంతం చేయాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌(ఎంఏయూడీ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తుది అనుమతులు సాధించడానికి, ఎలాంటి జాప్యం లేకుండా ప్రాజెక్టు పనులు ముందుకు సాగడానికి ఈ ఎన్‌వోసీలు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
​సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం
కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య శాఖ(డీపీఐఐటీ)కి చెందిన నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌(ఎన్‌‌పీజీ) నుంచి అనుమతులు పొందే ప్రక్రియలో భాగంగా మంగళవారం సచివాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) ఎండీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ జాయింట్‌ ఎండీ శివేంద్ర ప్రతాప్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని కీలక విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
​మెట్రో విస్తరణ నగరానికి అత్యవసరం
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించడంలో, పర్యావరణహిత రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో మెట్రో విస్తరణ ఎంతో ఆవశ్యకమని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ చెప్పారు. ఫేజ్‌-2 కారిడార్ల నిర్మాణానికి సంబంధించి అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేస్తూ, సాధ్యమైనంత త్వరగా ఎన్‌వోసీలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 122.9 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన 7 కారిడార్ల అలైన్‌మెంట్‌ వివరాలను అధికారులు వివరించారు. ఎన్‌హెచ్‌ఏఐ, రక్షణ శాఖ, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ పరిధిలోని భూసేకరణతో పాటు రైల్వే క్రాసింగ్‌లు, నాగోల్‌ వద్ద మూసీ నది దాటడం, గ్యాస్‌ పైప్‌లైన్లు, ఎయిర్‌పోర్టు సరిహద్దు ప్రాంతాల్లో నిర్మాణాలకు అవసరమైన ఎన్‌వోసీలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో రైల్వే, రక్షణ, రవాణా, హెచ్‌ఎండీఏ, జీఏఐఎల్, ఐవోసీఎల్ సహా పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -