స్మార్ట్ మీటర్లతో వినియోగదారులపై పెను భారం : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్
కరీంనగర్‌లో తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్యూనియన్ రాష్ట్ర సమావేశంవిద్యుత్ సవరణ బిల్లు-2025పైనిరవధిక సమ్మెకు పిలుపు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణ కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యోగులు, వినియోగ దారులను కలుపుకుని ఐక్యంగా దీర్ఘకాలిక పోరా టాలు నిర్మిస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు ఆర్.సుధాభాస్కర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్ర శివారులోని తీగలగుట్టపల్లి రంగినేని గార్డెన్స్‌లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధాభాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల పరిస్థితులు రోజు రోజుకూ దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పదేండ్లతో పోలిస్తే పనిభారం, ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగాయన్నారు. 2014లో కోటీ 25లక్షల విద్యుత్ సర్వీసులు ఉన్నప్పుడు 60వేల మంది ఉద్యోగులున్నారని చెప్పారు. 2026 నాటికి వినియోగదారుల సంఖ్య కోటీ 90 లక్షలకు పెరిగినా ఉద్యోగుల సంఖ్య 51 వేలకు పడిపోయిందని తెలి పారు.అధికారుల ఒత్తిడితో తగిన రక్షణచర్యల్లేక కార్మి కులు ప్రాణం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు డిస్కాం పేరుతో సబ్సిడీల ఎత్తివేతకు కుట్ర
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ చట్టం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని, దీనిలో భాగంగానే ‘రైతు డిస్కాం’ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలను తొలగించే ప్రయత్నం జరుగుతోందని సుధాభాస్కర్ ఆరోపించారు. ప్రభుత్వ శాఖల నుంచి డిస్కాంలకు రావాల్సిన రూ. 18,382 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వినియోగదారులపైనే భారం : పాలడుగు భాస్కర్
విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే చివరికి వినియోగదారు లపైనే భారం పడుతుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ వివరించారు. నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా జలాల ఆధారంగా నడుస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) స్టేజ్-1, స్టేజ్-2తో పాటు యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రయివేటీకరణ ప్రతిపాదన లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో విద్యుత్ సవరణ బిల్లు-2025 ప్రవేశపెడితే దేశ వ్యాప్తంగా 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లతో నిరవధిక సమ్మెకు వెళ్లేందుకు నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్‌సీసీఓఈఈఈ) సిద్ధంగా ఉందని, రాష్ట్రంలోని ఉద్యోగులంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావే శంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, రాష్ట్ర ఓబి సభ్యులు, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు జి.ఆంజనేయులు, కంపెనీ సెక్రటరీ వెంకట్ రాజం, ఎన్‌పీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ కె.సత్యం, అధ్యక్షులు చంద్రారెడ్డి, కరీంనగర్ జిల్లా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్ నాయక్, రాచకొండ శ్రీనివాస్, రాష్ట్ర ఓబి సభ్యులు రాచకొండ వెంకటేశ్వరరావు, సహా రాష్ట్ర నలుమూలలనుంచి యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.



