Wednesday, August 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదల కోసం భూలక్ష్మి పథకం

పేదల కోసం భూలక్ష్మి పథకం

- Advertisement -

ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తాం
పరిశ్రమల పేరుతో పేదల భూములు లాక్కుంటే ఊరుకోం : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పేదల కోసం భూలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని, ఒక్కో పేద కుటుంబానికి ఎకరం చొప్పున భూమిని పంపిణీ చేస్తామని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. పరిశ్రమల పేరుతో పేదల భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయమంటూ రాక్షస రాజ్యం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఒత్తిడితోనే ముఖ్యమంత్రి సామాజిక న్యాయం అంటూ మాట్లాడుతున్నారని తెలిపారు. నిజంగా సామాజిక న్యాయంపై చిత్తశుద్ధి ఉంటే 16 మంది మంత్రుల్లో ముగ్గురు మాత్రమే బీసీలు ఉంటారా?, మహిళలు ఇద్దరికి ఇస్తే అది 33 శాతం అవుతుందా?, ప్రభుత్వ సలహాదారుల్లో శివధర్ రెడ్డికి, వీహెచ్ లకిచ్చే జీతాలు, ర్యాంక్ లో వ్యత్యాసమెందుకు?, ఆర్టీఐ కమిషనర్ ఒక్క బీసీ కూడా లేరని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చెప్పేది సామాజిక న్యాయమైతే చేసేది ఆటవిక న్యాయమని విమర్శించారు.

గత రెండేళ్లలో రూ.5.96 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీల కోసం రూ.5.5 వేల కోట్లేనని, ఇది బడ్జెట్ లో ఒక్క శాతం మాత్రమేనని కవిత తెలిపారు. మహిళలంటే గౌరవం లేదన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను యాదగిరిగుట్టలో కింద కూర్చొబెట్టి అవమానించారనీ, పుష్కరాల ఆహ్వానాన్ని ఎంపీ వంశీకి ఇవ్వలేదనీ, బీసీ మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరిలను ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘోరంగా అవమానించారని కవిత విమర్శించారు. రెండేండ్లైనా మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదనీ, తమ పోరాటాల ఫలితంగానే మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల నిధుల్లో 40 శాతం కూడా వారి కోసం ఖర్చు చేయటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ క్రమశిక్షణలో అగ్రకులాలకు, బీసీలకు ఒక్కో రకంగా ఉంటున్నాయని కవిత తప్పుపట్టారు.

ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భూదోపిడీ దొంగలని కవిత విమర్శించారు. సీఎం ఏడుగురు సోదరులు భూమాతను చెరపట్టాలని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో 200 మంది రాజ్యాంగేతర శక్తుల ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పేదల 30 వేల ఎకరాలను సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చాక లాక్కున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం జరగాలంటే రాష్ట్రంలో మరొక్క మారు భూ పంపిణీ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 22 ఏ అనేది ఈ ప్రభుత్వం భూ దొంగతనం చేసేందుకు వేసుకుంటున్న రాచబాట అని కవిత విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -