40 ట్రిలియన్ డాలర్లకు చేరిన రుణం
కొండలా పెరుగుతున్న వడ్డీలు
భయపెడుతున్న ద్రవ్య లోటు
కీలక రంగాలకు నిధుల కొరత
సన్నగిల్లుతున్న ఇన్వెస్టర్ల విశ్వాసం
వాషింగ్టన్ : అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఆర్థిక శాఖ డేటా ప్రకారం ఫెడరల్ అప్పు మంగళవారం 40 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది అమెరికా ప్రజలకు ఎంతమాత్రం శుభవార్త కాదు. రుణభారం రాబోయే సంవత్సరాలలో ప్రజల పైన, వ్యాపారాల పైన తీవ్రంగా ప్రభావం చూపుతుంది. వాస్తవానికి అమెరికా చాలా కాలం నుంచే రుణభారాన్ని మోస్తోంది. అయితే ఇటీవలి కాలంలో వ్యక్తమవుతున్న అనేక ధోరణులు బడ్జెట్, ఆర్థిక మార్కెట్ల నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అప్పుల భారం వేగంగా పెరుగుతోంది. ఓ వైపు వడ్డీ రేట్లు, మరో వైపు రుణాలు పెరుగుతుండడంతో తీసుకున్న అప్పులపై చెల్లించాల్సిన వడ్డీ కొండలా పెరిగిపోతోంది.భారంగా మారుతున్న వృద్ధులు‘పరిస్థితి ఇలాగే కొనసాగితే కేవలం ఆరు సంవత్సరాల కాలంలోనే రుణభారం యాభై ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది. పది సంవత్సరాల క్రితం ఫెడరల్ అప్పులు కేవలం 20 ట్రిలియన్ డాలర్లే. ఇప్పుడు మనం నిజంగా మన ఆర్థిక వ్యవస్థను, దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాం’ అని పీటర్ జి.పీటర్సన్ ఫౌండేషన్ అనే ఫిస్కల్ వాచ్‌డాగ్ గ్రూప్ సీఈఓ మైకెల్ పీటర్సన్ తెలిపారు. అమెరికాలో వేగంగా పెరుగుతున్న రుణభారానికి చాలా కారణాలు కన్పిస్తున్నాయి.
వీటిలో ముఖ్యమైన కారణమేమంటే దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగడం. ప్రతి రోజూ దేశంలో పది వేల మంది బేబీ బూమర్లు (రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1946 – 1964 మధ్య జన్మించిన వారు) పదవీ విరమణ చేస్తున్నారు. మరోవైపు సీనియర్ సిటిజన్ల జీవితకాలం పెరుగుతోంది. ఫలితంగా సామాజిక భద్రత, మెడికేర్‌పై ఫెడరల్ ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ఈ మౌలిక సదుపాయాల పథకాల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంది.ఆదాయానికి మించిన వ్యయంఇక్కడ మరో కారణం కూడా కన్పిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా పన్నులను తగిస్తూ, ఖర్చుల్ని పెంచే ప్యాకేజీలను కాంగ్రెస్ ఆమోదిస్తోంది. 2017లో వచ్చిన పన్ను కోతలు – ఉద్యోగాల చట్టం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో గత సంవత్సరం వచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్, ట్రంప్‌తో పాటు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో ముందుకు తెచ్చిన అనేక కోవిడ్ – 19 మహమ్మారి సహాయక బిల్లులు ఈ కోవలోకే వస్తాయి. వీటి కారణంగా ఫెడరల్ రుణం కాలక్రమేణా అనేక ట్రిలియన్ డాలర్ల మేర పెరుగుతుందని అంచనా. కొన్ని సంవత్సరాల క్రితం ఊహించిన దాని కంటే ముందే రుణభారం 40 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకుంది. అప్పుల భారం 2028 నాటికి 40 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని 2023 మేలో కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా వేసింది.
అప్పుల పరిమాణం, అది పెరుగుతున్న వేగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక శాఖ డేటా ప్రకారం కేవలం గడచిన ఐదు నెలల కాలంలోనే జాతీయ అప్పు ఒక ట్రిలియన్ డాలర్లు పెరిగింది. ఫెడరల్ ప్రభుత్వ ఆదాయంతో పోలిస్తే ఖర్చే ఎక్కువగా ఉంటోంది. సెప్టెంబర్ 30తో ఈ ఆర్థిక సంవత్సరం ముగియాల్సి ఉండగా మొదటి పది నెలల కాలంలోనే ద్రవ్య లోటు 1.8 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది.బాండ్ మార్కెట్‌పై ప్రభావంపెరుగుతున్న రుణం బాండ్ మార్కెట్ పైన, వడ్డీ రేట్ల పైన ప్రభావం చూపుతోంది. 2007 తర్వాత ట్రెజరీ ఈల్డ్ (ప్రభుత్వం తన అవసరాల కోసం ప్రజలు లేదా సంస్థల నుంచి తీసుకునే అప్పుపై చెల్లించే వడ్డీ రేటు) మంగళవారం అత్యధిక స్థాయికి చేరుకుంది. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు, పెరుగుతున్న ద్రవ్య లోటు, కార్పొరేట్ బాండ్ల సరఫరా పెరగడం, వడ్డీ రేట్లకు సంబంధించి ఫెడరల్ రిజర్వ్ అనుసరిస్తున్న వైఖరిపై అనిశ్చితి వంటి అంశాలపై పెట్టుబడిదారుల అంచనాలే ఈల్డ్ పెరుగుదలకు కారణం. ఫెడరల్ రుణభారం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి అప్పులు ఇచ్చేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా అధిక వడ్డీ రేటును ఆశిస్తున్నారు. పెరిగిన వడ్డీ రేట్లు గృహ, వాహన, వ్యాపార రుణాల రేట్లను ప్రభావితం చేస్తున్నాయి. వినియోగదారులపై భారం పడడమే కాకుండా వ్యాపార పెట్టుబడులు కూడా పరిమితం అవుతున్నాయి. అప్పు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. బడ్జెట్‌లోని ప్రధాన్యతాంశాలు పక్కకు పోతాయి. ఏదేమైనా పెరుగుతున్న అప్పుల భారం ట్రంప్ ప్రభుత్వాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
వెంటాడుతున్న వడ్డీ భూతం
ఓ వైపు అప్పులు పెరుగుతుంటే మరోవైపు వాటిపై చెల్లించాల్సిన వడ్డీ రేటు కూడా పెరిగిపోతోంది. దీంతో వడ్డీ చెల్లింపుల్లో భారీ పెరుగుదల కన్పిస్తోంది. గతంలో తక్కువ వడ్డీ రేటుకే ప్రభుత్వానికి తేలికగా అప్పులు పుట్టేవి. అయితే కోవిడ్ మహమ్మారి రాకతో పరిస్థితి మారిపోయింది. ఆ కాలంలో దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడంతో పరిస్థితిని ఎదుర్కోవడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు ఒక ట్రిలియన్ డాలర్లు దాటవచ్చునని అంచనా. ఇది ఓ రికార్డు స్థాయి. గత ఐదు సంవత్సరాలలో ఫెడరల్ ఖర్చులు మూడు రెట్లకు పైగా పెరిగాయి. ప్రభుత్వ వ్యయంలో సామాజిక భద్రతది మొదటి స్థానమైతే మెడికేర్‌ది రెండో స్థానం. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ రక్షణ కోసం కంటే వడ్డీ చెల్లింపులకే అమెరికా ఎక్కువగా ఖర్చు చేస్తోంది. మరో మాటలో చెప్పాలంటే చిన్నారుల కార్యక్రమాలతో పోలిస్తే వడ్డీ చెల్లింపుల కోసమే యాభై శాతం అధికంగా ఖర్చు పెడుతోంది. వడ్డీ చెల్లింపులు అధికం కావడంతో ఇతర ఫెడరల్ కార్యక్రమాలకు, ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వడం ప్రభుత్వానికి కష్టంగా మారింది. భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడం మాట అటుంచి గతంలో తీసుకున్న రుణాలను ఎలా తీర్చాలనే విషయం పైనే ప్రభుత్వం ఎక్కువగా ఆలోచిస్తోంది. తీసుకున్న అప్పు మరింత రుణాన్ని సృష్టిస్తోందే తప్ప అది తీరే పరిస్థితి కన్పించడం లేదు. సమతుల్యత లోపించిన దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో క్రెడిట్ రేటింగులు పడిపోయాయి.
యుద్ధంలో 757 మంది సైనికులు గాయపడ్డారు : అమెరికా
ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాయపడిన సైనికుల సంఖ్య 750 దాటిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైన తర్వాత 18 మంది సైనికులు చనిపోయారని, 757 మంది క్షతగాత్రులయ్యారని వివరించింది. ఇరాన్, అమెరికా మధ్య చర్చల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రక్షణ శాఖ తన యుద్ధ నష్టాల డేటాబేస్‌ను విడుదల చేసింది. ఇరాన్ దాడులలో మరణించిన లేదా గాయపడిన సైనికుల సంఖ్యను పెంటగాన్ తగ్గించి చూపుతోందంటూ చట్టసభ సభ్యులు పదే పదే విమర్శలు కురిపించారు. దీంతో ఈ తాజా సమాచారం విడుదలైంది. గత నెలలో విడుదల చేసిన గణాంకాలలో మరణాలను, క్షతగాత్రుల సంఖ్యను తగ్గించి చూపి ఆ తర్వాత డేటాను సరిచేశారు.



