పార్లమెంటులో రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడండి
చట్టసభల్లో స్థానాలు పెంచకుండానే మహిళా రిజర్వేషన్లు దక్షిణ ప్రాంతీయ మండలి
సమావేశంలో ముఖ్యమంత్రుల సూచన
చెన్నై : తమిళనాడులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ (దక్షిణ ప్రాంతీయ మండలి) సమావేశంలో నియోజక వర్గాల పునర్విభజన, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్య పరిరక్షణ, నీట్ పరీక్ష, కావేరీ జలాల పంపిణీ, అధిక ఆర్థిక స్వయం ప్రతిపత్తి వంటి పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కాపాడేందుకు ఓ అధికారిక తీర్మానం చేయాలని కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోరగా ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కారణంగా తమ ప్రాంత రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ డిమాండ్ చేశారు. నదీ జలాల నిర్వహణ, రవాణా, లాజిస్టిక్స్, తీరప్రాంత భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విపత్తు నిర్వహణ వంటి విషయాలలో దక్షిణాది రాష్ట్రాల మధ్య మరింత సహకారం అవసరమని సమావేశానికి హాజరైన నేతలు అభిప్రాయపడ్డారు. నీట్ పరీక్ష గ్రామీణ విద్యార్థులకు, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రతికూలంగా ఉన్నదని జోసఫ్ విజయ్ చెప్పారు.
తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర కోటా కింద ఎంబీబీయస్, బీడీయస్, ఆయుష్ కోర్సులలో ప్రవేశాలను 12వ తరగతి మార్కుల ఆధారంగా చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు. కాగా సమావేశంలో నదీ జలాల అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. మేకెదాటు ప్రాజెక్టు విషయంలో సహకరించాలని కర్నాటక కోరగా గోదావరి – కావేరి అనుసంధాన ప్రాజెక్టు ద్వారా ఐదు వందల టీయంసీలకు పైగా నీటిని మళ్లించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. కొత్తగా ప్రతిపాదించిన ముళ్లపెరియార్ ఆనకట్ట ప్రాజెక్టుకు తమిళనాడు అంగీకరిస్తే దాని నుంచి వారికి నీరు అందేలా చూస్తానని కేరళ హామీ ఇచ్చింది. అదే సమయంలో ఓడరేవులు, రైలు అనుసంధానం, తీర ప్రాంత రక్షణ, అంతర్రాష్ట్ర భద్రత విషయంలో మరింత ప్రాంతీయ సహకారం అవసరమని అభిప్రాయపడింది.
రాష్ట్రాలను శిక్షించవద్దు : విజయ్
జనాభా నియంత్రణ విధానాలను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు దాని పర్యవసానంగా తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అన్నారు. జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన దక్షిణ రాష్ట్రాల సమిష్టి పార్లమెంటరీ వాణిని బలహీనపరుస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘జనాభా స్థిరీకరణ, మానవాభివృద్ధి, ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఈ విజయాలు మా ప్రాతినిధ్యంలో తగ్గుదలకు దారితీయకూడదు’ అని అన్నారు. జాతీయ లక్ష్యాలను నెరవేర్చినందుకు రాష్ట్రాలను శిక్షించకూడదని చెప్పారు.
ప్రస్తుత స్థానాలతోనే మహిళా రిజర్వేషన్లు : డీకే
1971 జనాభా లెక్కల ప్రాతిపదిక ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరపాలని, రాబోయే పాతిక సంవత్సరాల పాటు లోక్‌సభలో సీట్ల సంఖ్యను 543గానే కొనసాగించాలని, ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచించారు. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలు సీట్లను కోల్పోవంటూ కేంద్రం ఇచ్చిన హామీని స్వాగతిస్తున్నామని, అయితే ప్రాతినిధ్యం అంటే కేవలం సంఖ్య మాత్రమే కాదని, అది బలం, గొంతుకకు సంబంధించినదని చెప్పారు. పన్నులలో కర్నాటక వాటాను 3.6 శాతం నుంచి 4.7 శాతానికి పునరుద్ధరించాలని కోరారు. కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం మరింత మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తీర ప్రాంత కోతలపై జాతీయ విధానం : సతీశన్
మైనింగ్ చట్టానికి ప్రతిపాదించిన సవరణలను ఉపసంహరించుకోవాలని కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ డిమాండ్ చేశారు. మిషన్ సముద్ర కింద రాష్ట్రాన్ని పోర్ట్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రాంతీయ సహకారం అందించాలని కోరారు. కారుణ్య ఆరోగ్య సురక్షా విధానం ద్వారా ఆయుష్మాన్ భారత్ పీయం – జేఏవై అమలుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తీర ప్రాంతంలో కోతను రాష్ట్ర విపత్తుగా ప్రకటించి నిరాశ్రయులైన కుటుంబాల పునరావాసం కోసం నిధుల వినియోగానికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంత కోతలపై జాతీయ విధానాన్ని త్వరితగతిన ఖరారు చేయాలని సూచించారు. కేరళను కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో కలిపే అటవీ రహదారులపై రాత్రి సమయంలో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయడాన్ని సతీశన్ వ్యతిరేకించారు.
విభజన సమస్యలను పరిష్కరించండి : చంద్రబాబు
దక్షిణాది రాష్ట్రాల మధ్య మరింత సహకారం అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను విశ్వాసం, పరస్పర సహకారంతో పరిష్కరించుకోవచ్చునని అంటూ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సమన్వయం పైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన కారణంగా తలెత్తిన సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరారు. గోదావరి – కావేది అనుసంధానాన్ని ఆయన గట్టిగా సమర్ధించారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ బులెట్ రైలు కారిడార్‌ను ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నయ్లను అనుసంధానించే సమీకృత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు కోరారు.



