Friday, August 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

- Advertisement -

జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి
రాష్ట్రంలో 2 లక్షలు, కేంద్రంలో 10 లక్షల పోస్టులు ఖాళీ
నిరుద్యోగులకు నెలకు రూ.5వేల భృతి అందించాలి
కోచింగ్ సెంటర్లతో అప్పులపాలవుతున్న యువత
ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు.. పెద్ద ఎత్తున పాల్గొన్న యువత

నవతెలంగాణ-సిటీబ్యూరో/విలేకరులు
​‘‘దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న యువత నిరుద్యోగ సమస్యతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతోంది.. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, అప్పులు చేసి నగరాల్లోని కోచింగ్ సెంటర్లకు పంపిస్తుంటే.. ప్రభుత్వాలు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి’ అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనీ, కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. అనంతరం అధికారులకు వినతిప్రతాలు అందజేశారు. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీ ముషీరాబాద్ జోన్ కార్యదర్శి ఆర్.వెంకటేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యపై సీపీఐ(ఎం) సర్వేలు నిర్వహించి, పోరాటాలను ఉధృతం చేసిందని చెప్పారు. లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం తీవ్ర మానసిక ఆందోళనతో ఎదురుచూస్తోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్ ప్లాంట్ వంటి నవరత్నాలను నిర్వీర్యం చేస్తూ, ప్రయివేటీకరణ వైపు మొగ్గుచూపుతూ ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు ప్రకటనలకే పరిమితమైందని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వమూ పూర్తిస్థాయిలో పోస్టులను భర్తీ చేయడంలో విఫలమవుతోందని జ్యోతి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఖాళీలు ఉండగా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వల్ప సంఖ్యలోనే నియామకాలు చేపట్టిందని తెలిపారు. మెగా డీఎస్సీని వెంటనే ప్రకటించాలని, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 20 వేల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఏటా ఉద్యోగ విరమణ పొందుతున్న దాదాపు 9 వేల మంది స్థానంలో నూతన నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఉద్యోగాలు కల్పించే వరకు అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.5వేల చొప్పున నిరుద్యోగ భృతి అందించాలని, వెంటనే సమగ్ర జాబ్ క్యాలెండర్‌ ప్రకటించాలని అన్నారు. రాష్ట్రవ్యాప్త ధర్నాల అనంతరం నిరుద్యోగుల సమస్య లపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేస్తామని, నిరుద్యోగ పోరాటంలో యువతకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.​

​ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం 
విడుదల చేయాలి : నిరుద్యోగ జేఏసీ
గత ప్రభుత్వం పదేండ్లపాటు నిరుద్యోగులను మోసం చేసిందని, మార్పు వస్తుందన్న ఆశతో కాంగ్రెస్‌కు ఓట్లేస్తే ప్రస్తుత ప్రభుత్వమూ నిరాశకు గురిచేస్తోందని నిరుద్యోగ జేఏసీ నాయకులు నరేష్‌ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం తక్షణమే 13 నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. మ్యానిఫెస్టోలో ఉచిత దరఖాస్తులని చెప్పి.. ఇప్పుడు వేల రూపాయల ఫీజులు వసూలు చేయడం దారుణమన్నారు. పోలీస్ ఈవెంట్లలో లాంగ్ జంప్‌ను 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలని, పోలీస్ శాఖలోని మిగిలిన ఖాళీలతో పాటు డిగ్రీ, ఇంజినీరింగ్ అభ్యర్థులకు వెంట నే నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు. ఇకనైనా ప్రభు త్వాలు స్పందించకపోతే రాబోయే రోజుల్లో యువత తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.

​ జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు..
మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి సత్యం, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కలెక్టరేట్ల వద్ద సీపీఐ(ఎం) మహాధర్నాలు నిర్వహిం చింది. నుమకొండ, జనగామ జిల్లాల కలెక్టరేట్‌ కార్యాలయాల ఎదుట నిరుద్యోగులు ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ రవికిరణ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ధర్నా చేశారు. వరంగల్‌ జిల్లా రామన్నపేటలో నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా జిల్లా డీఆర్‌వోకు సీపీఐ(ఎం) బృందం వినతిపత్రం అందజేసింది. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ధర్నా చేశారు. వనపర్తి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహిం చారు. అనంతరం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభికి వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అడిషనల్‌ కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.

మెదక్‌, సిద్దిపేట కలెక్టరేట్‌ల ముందు ధర్నాలు జరిగాయి. కరీంనగర్‌ జిల్లాలోని ఐటీ, పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత కల్పించాలని, కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి స్వామికి వినతిపత్రం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాల యం ఎదుట ధర్నా అనంతరం నిరుద్యోగుల సమస్య లు, ప్రభుత్వాల హామీల అమలుకు సంబంధించిన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు ఇచ్చారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండల కేంద్రంలోని భగత్‌ సింగ్‌ విగ్రహం వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వ హించి కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రాన్ని అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -