ఎన్‌సీఈఆర్‌టీ కొత్త కమిటీలోఆరెస్సెస్, ఏబీవీపీ నేపథ్యం ఉన్నవారికి చోటు
11, 12 తరగతుల పాఠ్యపుస్తకాల రూపకల్పనకు కొత్త బృందం
‘భారతీయ జ్ఞానవ్యవస్థ’, సాంస్కృతిక మూలాలపై ప్రత్యేక దృష్టి
పాఠ్యాంశాల తటస్థతపై విద్యావేత్తల నుంచి ప్రశ్నలు
న్యూఢిల్లీ : దేశ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే పాఠ్యపుస్తకాలపై భావజాల ముద్ర వేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 11, 12 తరగతుల రాజకీయ శాస్త్ర (పొలిటికల్ సైన్స్) పాఠ్యపుస్తకాలను రూపొందించేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) పునర్‌వ్యవస్థీకరించిన కమిటీలో ఆరెస్సెస్, దాని విద్యార్థి విభాగం ఏబీవీపీ, బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్న వ్యక్తులకు చోటు దక్కింది. అంతేకాదు.. కొత్త పాఠ్యపుస్తకాల్లో ‘సాంస్కృతిక మూలాలు’, ‘భారతీయ జ్ఞాన వ్యవస్థలు’, ‘సమగ్రత’ వంటి అంశాలను అంతర్భాగం చేయాలని కమిటీకి ఆదేశాలూ అందాయి. దీంతో సంఘ్ అనుబంధ వ్యక్తులకు కమిటీలో చోటు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో రాజకీయ భావజాలానికి అతీతమైన శాస్త్రీయత, తటస్థతతో కూడిన విద్యా ప్రమాణాలు అవసరమని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు చెప్తున్న వేళ ఈ నియామకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
రాజకీయ శాస్త్ర పాఠ్యపుస్తకాలను కొత్తగా రూపొందించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్‌బుక్ డెవలప్‌మెంట్ టీమ్‌ను పునర్‌వ్యవస్థీకరించిం ది. ఈ కమిటీ 11వ తరగతి పాఠ్యపుస్తకాన్ని నవంబర్‌లోగా, 12వ తరగతి పుస్తకాన్ని వచ్చే ఏడాది జులైలోగా సిద్ధం చేయాల్సి ఉంది. కర్నాటకకు చెందిన నిట్టే డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్, విద్యావేత్త, రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి కమిటీకి నేతృత్వం వహించనున్నారు. అయితే ఈ కమిటీలోని కనీసం నలుగురు సభ్యులకు ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ, బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్నట్టు పలు ఆధారాలు ఉన్నాయి.
ఏబీవీపీ, ఆరెస్సెస్ నేపథ్యాలు
కేంద్ర విద్యాశాఖలో సీనియర్ కన్సల్టెంట్‌గా ఉన్న యదునాథ్ దేశ్‌పాండే గతంలో మహారాష్ట్రలో ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పనిచేసినట్టు ఆ సంస్థ రికార్డులు పేర్కొంటున్నాయి. అనంతరం ముంబయి-కొంకణ్ ప్రాంతంలోనూ ఏబీవీపీలో బాధ్యతలు నిర్వహించారు. ఆయన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో బీజేపీ రాజకీయ సలహాదారుగా కూడా తనను తాను పేర్కొన్నారు. ఇక ప్రశాంత్ దివేకర్‌కు ఆరెస్సెస్‌తో అనుబంధం ఉన్న పూణేకు చెందిన జ్ఞాన ప్రబోధినితో దీర్ఘకాలిక సంబంధం ఉన్నట్టు తెలిసింది. భారతీయ విద్యా తత్వశాస్త్రంలో తన విధానం వేళ్లూనుకున్నదని ఆయన నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్ పోర్టల్‌లో పేర్కొన్నారు. జేఎన్‌యూ సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ ప్రొఫెసర్ వందన మిశ్రా గతంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.అదే విధంగా జేఎన్‌యూకి చెందిన రవి రామచంద్ర శుక్లా ఆరెస్సెస్ అనుబంధ సంస్థగా పేర్కొన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్‌షిప్–రంభావు మ్హాల్గీ ప్రబోధిని ప్రచురించే ఇండియన్ జర్నల్ ఆఫ్ డెమొక్రాటిక్ గవర్నెన్స్ సంపాదక మండలిలో పనిచేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక జాతీయ వాదంపై ఆయన పరిశోధనలు కూడా చేశారు.
పలు విశ్వవిద్యాలయాల నుంచి సభ్యులు
ఇక ఈ కమిటీలో జేఎన్‌యూ, నేషనల్ లా యూనివర్సిటీ, చాణక్య యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఇగ్నో, జిందాల్ గ్లోబల్ లా స్కూల్, పాండిచ్చేరి యూనివర్సిటీ, ఉత్కళ యూనివర్సిటీ తదితర విద్యాసంస్థలకు చెందిన విద్యావేత్తలకు చోటు కల్పించారు. ప్రకాశ్ కంద్‌పాల్, నీధి గుప్తా, చేతన్ సింఘాయ్, సుకన్షికా వత్స, సతీశ్ కుమార్, దేవాంశు శ్రీవాస్తవ, ప్రణవ్ గుప్తా, నంద కిశోర్, స్వప్న ప్రభు తదితరులు కమిటీలో ఉన్నారు. ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన వాన్తాంగ్‌పుయి ఖోబంగ్, సుభాష్ సింగ్ వరుసగా సభ్య సమన్వయకర్త, సహ సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు.
‘భారతీయ జ్ఞాన వ్యవస్థ’కు ప్రాధాన్యమట!
ఎన్‌సీఈఆర్‌టీ నోటిఫికేషన్ ప్రకారం… సామాజిక శాస్త్రాలు, భాషలు, భారతీయ జ్ఞాన వ్యవస్థలు, పర్యావరణ విద్య, వినూత్న బోధనా పద్ధతులు, బోధన-అభ్యసనకు సంబంధించిన కరిక్యులర్ ఏరియా గ్రూపుల మార్గదర్శక త్వాన్ని కమిటీ తీసుకోనుంది. ఇతర తరగతుల పాఠ్యాంశాలతో అనుసం ధానం, వివిధ సబ్జెక్టుల మధ్య అంతరశాస్త్రీయ సంబంధాలు, బహుభాషా దృక్కోణాలను కూడా పరిగణనలో కి తీసుకోనుంది. ప్రతి పాఠ్యపుస్తకాన్ని సమీక్షించే సమయంలో సాంస్కృతిక మూలాలు, భారతీయ జ్ఞాన వ్యవస్థలు, సమగ్రత, విద్యా సాంకేతికత, మూల్యాంకనం వంటి అంశాలను ఎలా పొందుపరిచారో పరిశీలించాలని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాగా రాజకీయ శాస్త్రం వంటి కీలక సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఆరెస్సెస్, ఏబీవీపీ నేపథ్యాలున్న వ్యక్తులకు ప్రాధాన్యం లభించడం విద్యా రంగంలో పాఠ్యాంశాల తటస్థత, వైవిధ్యంపై చర్చకు దారితీసే అంశంగా మారింది.



