Friday, August 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆటో, క్యాబ్‌, స్కూల్‌ వ్యాన్‌ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

ఆటో, క్యాబ్‌, స్కూల్‌ వ్యాన్‌ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

24 నుంచి జరిగే నిరవధిక సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు : జాన్‌‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో జీవనోపాధి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్, లారీ, డీసీఎం డ్రైవర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24 నుంచి ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. లక్షలాది మంది డ్రైవర్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసిన డ్రైవర్లు, పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలతో కుటుంబ పోషణ భారమై అల్లాడిపోతున్నారు. ఓలా, ఊబర్, రాపిడో వంటి యాప్‌ల యాజమాన్యాలు డ్రైవర్ల నుంచి వసూలు చేస్తున్న అధిక కమీషన్ల వల్ల డ్రైవర్లు కనీస ఆదాయం పొందడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకునేలా ఇన్సూరెన్స్, 50 ఏండ్లు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని దశాబ్దాలుగా చేస్తున్న వారి పోరాటాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ఇది సరిగాదు. తక్షణమే వారి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్రంలోని దాదాపు 25 లక్షల మంది రవాణా రంగ కార్మికులు, డ్రైవర్ల సంక్షేమం కోసం వెంటనే ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలు, ఆర్థిక భరోసా కల్పించాలి. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

​ట్రాన్స్ పోర్ట్ సమ్మెకు మద్దతివ్వండి
ఆటో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 23 నుంచి తలపెట్టిన ఆటోల బంద్‌‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీకి ఆలిండియా రోడ్ ట్రాన్స్‌‌పోర్ట్‌ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా జాన్‌‌వెస్లీ సమ్మెకు మద్దతిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ‌కె.అజయ్ బాబు, ఉపాధ్యక్షులు ఎల్‌. కోటయ్య, సహాయ కార్యదర్శి కె.సతీష్ ఉన్నారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -