పిచ్చిమొక్కలు, మట్టితో నిండిన ఇంకుడుగుంతలు
ప్రభుత్వ కార్యాలయాల్లో పట్టించుకునేవారు కరువు
జలసిరితో ఇంకుడుగుంతల నిర్మాణానికి ప్రాధాన్యత
ఉన్న వాటి నిర్వహణ మరచిన వైనం
వీటిని పునరుద్ధరిస్తే ‘జలసిరి’ లక్ష్యం నెరవేరినట్లే
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
భూగర్భ జలాల పెంపు కోసం గతంలో నిర్మించిన ఇంకుడు గుంతలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారాయి. సరైన నిర్వహణ లేక చాలాచోట్ల ఇంకుడు గుంతలు పిచ్చిమొక్కలు, మట్టితో నిండిపోయాయి. దీంతో నీరు ఇంకే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో.. ఉన్న నీటి వనరులను సంరక్షించుకోవడంతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టి నేరుగా భూగర్భంలోకి మళ్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘జలసిరి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 9.60 లక్షల ఇంకుడు గుంతలు, 5,000 ఊట కుంటలు, 5000 బోర్వెల్ రీఛార్జీ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి వర్షపునీటి బొట్టును భూమిలోకి ఇంకించి భూగర్భజలాలను పరిరక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఇందుకోసం గ్రామాల, మండలాల వారీగా టార్గెట్లు నిర్దేశించి వీబీ గ్రామ్ జీ కింద ఉపాధి కూలీలతో పనులు చేపడుతున్నారు. అయితే కొత్త ఇంకుడు గుంతలు నిర్మించడంలో చూపుతున్న ఆసక్తి.. పాత వాటి నిర్వహణపై పెట్టడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది వరకే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్మితమై ఉన్న ఇంకుడుగుంతల్లో మట్టి చేరి పిచ్చిమొక్కలు పెరగడంతో నీరు ఇంకలేని పరిస్థితి నెలకొంది.
కొత్త వాటిని నిర్మించడంతో పాటు పాత వాటి నిర్వహణ సైతం చూస్తే ‘జలసిరి’ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో ‘జలసిరి’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 545 గ్రామాల్లో 1,00,825 ఇంకుడుగుంతలు నిర్మించేందుకు లక్ష్యం నిర్దేశించారు. అదే విధంగా కామారెడ్డి జిల్లాలోని 530 జీపీలకు గాను 1,00,270 ఇంకుడుగుంతలు నిర్మించేలా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. వీటితో పాటు గ్రామానికో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, రైతుల పొలాల వద్ద ఫామ్ పాండ్ల నిర్మాణాలు చేపట్టి.. వర్షపు నీటిని నేరుగా భూగర్భంలోకి పంపి తద్వారా భూగర్భజలాలను పరిరక్షిస్తే రానున్న కాలంలో తాగు నీటితో పాటు బోరుబావుల కింద సాగు చేపట్టే రైతులకు నీటి ఇబ్బందులు రాకుండా జలసిరిని అత్యంత ప్రాధాన్యతగా చేపడుతున్నారు.
పాత నిర్మాణాలు విస్మరణ
కొత్త వాటి నిర్మాణాలపై చూపెట్టిన ఆసక్తి.. పాత వాటి నిర్వహణపై ఉండటం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాత మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీస్స్టేషన్, పీహెచ్సీ, వ్యవసాయ, ఎంఈవో తదితర ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడుగుంతలు నిర్మించి ఉన్నాయి. వీటితో పాటు జిల్లా కేంద్రాల్లో ఆయా చోట్ల ప్రత్యేకంగా నిర్మించినవి ఉన్నాయి. గతంలో ప్రతి ఏడాదీ భారీవర్షాలు కురవడంతో ఇంకుడు గుంతల నిర్వహణను పట్టించుకోలేదు. దాంతో వాటిల్లో మట్టి చేరి పిచ్చిమొక్కలు పెరిగాయి. నీరు అందులోకి వెళ్లి ఇంకాల్సి ఉండగా.. పలుచోట్ల మట్టి ఎక్కువగా చేరి ఎత్తుగా మారడంతో నీరు భూగర్భంలోకి వెళ్లే పరిస్థితి లేకుండా మారింది.
వినియోగంలోకి తెస్తే ఉపయోగం
జిల్లా, డివిజన్ కేంద్రాల్లో ఉన్న ఇంకుడుగుంతల నిర్వహణను ఆయా మున్సిపాల్టీలు, మండలాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటిని డీఆర్డీఏ కింద ఏపీవోలు నిర్వహణ చేయిస్తూ పర్యవేక్షించాలి. కానీ ఇప్పటికీ పాత ఇంకుడు గుంతలను పట్టించుకున్న పరిస్థితి లేదు. సదరు శాఖ కార్యాలయ అధికారులు సైతం వీటిపై అప్రమత్తం చేసిన దాఖలాలు లేవు. ఫలితంగా వృథాగా మారాయి. ప్రస్తుతం ఒక్కో ఇంకుడు గుంత నిర్మాణానికి 2X2 సైజ్ నిర్మాణానికి రూ.6500 ఖర్చు కానుంది. కొత్త వాటితో పాటు పాత వాటిల్లో మట్టిని ఎత్తిపోసి, పిచ్చిమొక్కలు తొలగిస్తే.. వర్షాలు కురిసిన సమయాల్లో నీరు చేరి భూగర్భజలాలు పెరిగితే జలసిరికి సార్థకత. ఆ దిశగా అధికార యంత్రాంగం కృషి చేయాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.


