నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్
ద్విచక్ర వాహనం – లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐటీఐ విద్యార్థి మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటన శుక్రవారం మండలంలోని నమిలిగొండ మైనారిటీ పాఠశాల సమీపంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన గాదె దశరథం–కోమల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి కుమారుడు గాదె అశ్రిత్ (18) ప్రయివేట్ కళాశాలలో ఐటీఐ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అశ్రిత్ తన మామ వరుసైన జాఫర్‌గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన కలకోట శ్రీకాంత్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై నమిలిగొండ వైపుగా, మైనారిటీ పాఠశాల సమీపంలోని బోళ్ళ వద్ద పెద్ద చెరువు కట్ట వైపు తిరుగుతున్న సమయంలో, జాఫర్‌గఢ్ నుంచి స్టేషన్ ఘనపూర్ వైపు వస్తున్న లారీ ఒక్కసారిగా ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అశ్రిత్ లారీ టైరు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీకాంత్‌కు కాలు, పక్కటెముకలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి గాదె దశరథం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. కాగా అశ్రిత్ అందరితో కలివిడిగా ఉండేవాడని, స్నేహితులతో ఎంతో ఆప్యాయంగా మెలిగేవాడని తోటివారు తెలిపారు. అతడి ఆకస్మిక మృతితో స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనతో నమిలిగొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



