– పదేండ్లలో ప్రజలు చాలా నష్టపోయారు
– వారి భాగస్వామ్యంతో ప్రత్యేక ఫోరంలు ఏర్పాటు
– ప్రభుత్వ విధాన వ్యతిరేక ప్రజాఉద్యమాలు నిర్మిస్తాం : ఈఈఎఫ్‌ఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16వ తేదీ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తారని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఈఈఎఫ్‌ఐ) ప్రకటించింది. విద్యుత్ రంగ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటూ గడచిన పదేండ్లుగా దేశ ప్రజల్ని అనేక కష్టనష్టాలకు గురిచేసిందని తెలిపారు. వాటినుంచి విముక్తి కోసం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలనూ భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక ఫోరంలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామనీ, వాటికోసం మరికొన్ని చర్చలు జరగాల్సి ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈఈఎఫ్‌ఐ వర్కింగ్ కమిటీ రెండ్రోజుల సమావేశాలు బుధవారం ముగిసాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ కోఠిలోని ఐఎమ్‌ఏ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఈఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రశాంత నంది చౌదరి, ఉపాధ్యక్షులు సుభాష్ లాంబా, జితేన్ నంది, కార్యదర్శులు దీపా కే రాజన్, సందీప్ దత్త, వీ గోవర్థన్, కోశాధికారి రాజేంద్రన్, అలిండియా వర్కింగ్ కమిటీ సభ్యులు కే ఈశ్వరరావు, వీ కుమారచారి మాట్లాడారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలనీ, బొగ్గుసరఫరా సమస్యలు పరిష్కరించాలనీ, విదేశీ బొగ్గు దిగుమతులు నిలిపివేయాలని, థర్మల్ పవర్ స్టేషన్లపై రినవబుల్ ఎనర్జీ భారాల్ని నిలిపేయాలని కోరారు.
తిరోగమన విద్యుత్ ట్రాన్స్‌మిషన్ పాలసీ, విద్యుత్ సవరణ బిల్లు-2022 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల సాంకేతిక అప్‌గ్రేడేషన్‌ను డిస్కంలు లేదా ప్రభుత్వరంగ సంస్థలే చేపట్టాలనీ, థర్డ్ పార్టీ పేరుతో ప్రయివేటు ఏజెన్సీలకు అవకాశం కల్పిస్తూ, వినియోగదారుల డేటాను వారికి అందించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రినవబుల్ ఎనర్జీ, విద్యుత్ నిల్వ సహా ఇతర ఇంధన అనుబంధరంగాల్లో ప్రయివేటు గుత్తాధిపత్యాన్ని నిలువరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల విద్యుత్ హక్కును లాగేసుకొని, వ్యాపారాన్ని ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నదని విమర్శించారు. విద్యుత్‌రంగంలో క్రాస్ సబ్సిడీని క్రమేణా ఎత్తేయాలని కేంద్రం భావిస్తున్నదనీ, దానికోసం ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు అధికారిక ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.
విద్యుత్ టారిఫ్‌లను కూడా పీక్, నాన్‌పీక్ డిమాండ్ల ప్రాతిపదికగా నిర్ణయించే చర్యలకు సిద్ధపడుతున్నారనీ, దీనివల్ల ప్రజలు విద్యుత్ వెలుగుల వివక్షను ఎదుర్కోవలసి వస్తుందని వివరించారు. దేశంలో నిరుద్యోగంతో పాటు నిత్యవసర వస్తువుల ధరలూ పెరిగాయనీ, సైన్యంలో అగ్నివీర్ పేరుతో సేవల్ని నాలుగేండ్లకు కుదించారనీ, ప్రభుత్వరంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఈ చర్యల్ని ప్రశ్నిస్తే ఆయోధ్య, రామమందిరం అంటూ మత సెంటిమెంటును రాజేసి, రాజ్యాధికారాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు. కేంద్రం అనుసరిస్తున్న ఈ ధోరణిని కచ్చితంగా విద్యుత్ ఉద్యోగులు ప్రజల ముందు పెడతారనీ, గ్రామస్థాయిలో ఏర్పటయ్యే ప్రత్యేక ఫోరంల్లో వీటిపై ప్రజల మధ్యే చర్చిస్తామని చెప్పారు. దేశంలో సప్లరు కంటే డిమాండ్ తక్కువగా ఉన్నా విద్యుత్ ఎక్సేంజీల్లో కరెంటు రేట్లు ఎందుకు పెరుగుతున్నారని ప్రశ్నించారు. విద్యుదుత్పత్తిని ప్రయివేటుపరం చేయడం వల్లే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని ఉదహరించారు. సమావేశంలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎన్ స్వామి, సదాకర్, టీఎస్‌ఎస్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి సత్యం తదితరులు పాల్గొన్నారు.