– పర్యవేక్షించిన ఏడీఏ పెంటేల రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట : దమ్మపేట మండలంలో వానాకాలం – 2026 కు సంబంధించి చేపడుతున్న డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్)ను సహాయ వ్యవసాయ సంచాలకులు రవికుమార్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని నాచారం, దురదపాడు, మందలపల్లి గ్రామాల్లో జరుగుతున్న క్రాప్ బుకింగ్ ప్రక్రియను పరిశీలించి, రైతువారీగా, పంటలవారీగా సర్వేను పూర్తి చేయాలని ఏఈవోలను ఆదేశించారు. సాగు చేస్తున్న పంట, విస్తీర్ణం, భూమి వివరాలను జీపీఎస్, జియో ట్యాగింగ్ ఆధారంగా డిజిటల్‌గా నమోదు చేయడమే డీసీఎస్ ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ నెల 20 వ తేదీ నుంచి వానాకాలం – 2026 పంటల నమోదుకు సర్వే ప్రారంభమైందన్నారు. గ్రామాల్లో సర్వే వాలంటీర్ల ద్వారా, ఏఈవోల పర్యవేక్షణలో క్రాప్ బుకింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా రైతు, భూమి, పంట వివరాలను ఒకే డిజిటల్ డేటాబేస్‌లో అనుసంధానం చేయడంతోపాటు వాస్తవ సాగు విస్తీర్ణంపై కచ్చితమైన సమాచారం లభిస్తుందని తెలిపారు. పంటల కొనుగోళ్లు, వ్యవసాయ పథకాలు, పంట నష్టం – బీమా, ఎరువులు, విత్తనాలు తదితర వ్యవసాయ ఇన్పుట్ల అవసరాల అంచనాకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని వివరించారు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలైన మినుము, పెసర, కంది, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయలు సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. రైతులు తమ సమీప ఏఈవోను సంప్రదించి డీసీఎస్ సర్వే పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. క్షేత్ర పరిశీలనలో మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, ఏఈవోలు వినోద్‌కుమార్, అను బాబు, సర్వే వాలంటీర్లు పాల్గొన్నారు.



