ఆట్టహాసంగా ప్రారంభం..
ఇన్స్ట్రక్టర్ల నియామకంలో జాప్యం
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం ప్రీప్రైమరీ తరగతులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మండలంలో నాలుగు పాఠశాలలను ఎంపిక చేసి, జూన్ లోనే ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించారు. తరగతి గదులకు ఆకర్షణీయమైన వాల్ పెయింటింగ్లు వేయించి, రంగురం గుల బొమ్మలతో ముస్తాబు చేశారు. ఒక్కో పాఠశాలకు ఒక ఇన్స్ట్రక్టర్, ఆ యాను నియమించాల్సి ఉండగా..అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని మిగతా మండలాల్లో నియా మకాలు పూర్తయినప్పటికీ మండలంలో మాత్రం నియామకాలు జరగలేదు.
నిలిచిపోయిన బోధన..
నియామకాల్లో అధికారుల జాప్యం కారణంగా మండలంలో ప్రీప్రైమరీ విద్య ప్రారంభం కాకుండానే నిలిచిపోయింది. దీంతో తరగతి గదులు నిరుపయోగంగా మారాయి. అసలు ఎందుకు నియామకాలు చేపట్టలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభం కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు చెప్పిన వారినే నియమించాలని ఒత్తిళ్లు తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల జోక్యం, అధికారుల తాత్సారం వల్లనే పేద పిల్లలకు అందాల్సిన ప్రీప్రైమరీ విద్య అర్ధాంతరంగా నిలిచిపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, తక్షణమే ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను నియమించి ప్రీప్రైమరీ తరగతులను క్రమబద్ధంగా కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.



