Sunday, August 30, 2026
E-PAPER
Homeఖమ్మంరెండేళ్లు పూర్తయినా ప్రారంభం కాని మినీ స్టేడియం పనులు

రెండేళ్లు పూర్తయినా ప్రారంభం కాని మినీ స్టేడియం పనులు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట పట్టణ ప్రజలకు మినీ స్టేడియం నిర్మాణం ఇప్పటికీ అందని ద్రాక్ష గానే మారింది. శంకుస్థాపన చేసి రెండేళ్లు పూర్తయినా నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024 ఆగస్టు 29న అప్పటి ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మినీ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో పంచాయతీ హోదాలో ఉన్న అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రోడ్డులో నీటిపారుదల శాఖకు చెందిన స్థలంలో సుమారు రూ.5.70 కోట్లతో స్టేడియం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

అనంతరం అశ్వారావుపేట మున్సిపాలిటీగా మారడంతో నిర్మాణ బాధ్యతల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పంచాయతీరాజ్ శాఖ నుంచి నిర్మాణ బాధ్యతలను మున్సిపాలిటీ ఇంజినీరింగ్ విభాగానికి బదలాయించారు. మరోవైపు, ప్రతిపాదిత స్థలంలో ఇప్పటికే ఉన్న నీటిపారుదల శాఖ భవన సముదాయాలు కూడా నిర్మాణానికి అడ్డంకిగా మారినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ దిలీప్‌రెడ్డిని వివరణ కోరగా, నీటిపారుదల శాఖ నుంచి స్థలాన్ని మున్సిపాలిటీకి బదలాయించడం, పంచాయతీరాజ్ శాఖ నుంచి నిర్మాణ బాధ్యతలను మున్సిపాలిటీ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించడం ఇటీవలే పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. శంకుస్థాపన జరిగి రెండేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడంతో మినీ స్టేడియం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -