Tuesday, September 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత

- Advertisement -

ఇరాన్‌ రాకెట్‌ లాంఛర్లపై అమెరికా దాడి
వాషింగ్టన్‌ సైనిక స్థావరాలపై విరుచుకుపడిన టెహ్రాన్‌ క్షిపణులు

వాషింగ్టన్‌/టెహ్రాన్‌ : నెల రోజులకు పైగా కొనసాగిన ప్రశాంతతకు భంగం కలిగిస్తూ మధ్యప్రాచ్యం మరోసారి దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. తన రాకెట్‌ లాంఛర్లపై ఆదివారం జరిగిన దాడికి ప్రతిగా జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులను ప్రయోగించింది. హార్ముజ్‌ జలసంధిలో సముద్ర మందుపాతరలను అమర్చడానికి ఇరాన్‌ రాకెట్‌ లాంఛర్లు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ వాటిపై అమెరికా దాడులు జరిపింది. దీనికి ప్రతీకారంగా జోర్డాన్‌లోని అమెరికా సైనిక లక్ష్యాలపై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడింది. తమ గగనతలంలో ప్రవేశించిన ఎనిమిది ఇరాన్‌ క్షిపణులను ధ్వంసం చేశామని జోర్డాన్‌ సాయుధ దళాలు తెలిపాయి. పౌరులకు, ఆస్తులకు హాని జరగక ముందే వాటిని తటస్థం చేశామని చెప్పాయి. కాగా ఇరాన్‌ నుంచి సోమవారం ఉదయం తన ప్రాదేశిక జలాల వైపు వస్తున్న డ్రోన్‌ను అడ్డుకున్నానని యూఏఈ తెలియజేసింది. తాజా పరిణామాల కారణంగా పశ్చిమాసియాలో సంఘర్షణలు తిరిగి మొదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

మందుపాతరలు అమర్చేందుకు ఇరాన్‌ ప్రయత్నం : అమెరికా
మందుపాతరలతో కూడిన రాకెట్లను హార్ముజ్‌లోకి ప్రయోగించడానికి ఇరాన్‌ సేనలు లారక్‌ ద్వీపంలో సిద్ధంగా ఉన్నాయని గమనించామని, అందుకే ఆ రెండు రాకెట్‌ లాంఛర్లపై దాడి చేశామని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్‌కామ్‌) ప్రతినిధి కెప్టెన్‌ టిమ్‌ హాకిన్స్‌ చెప్పారు. కీలక జలమార్గంలో ప్రమాదకారిగా మారే మందుపాతరలను అమర్చే ఇరాన్‌ దళాలపై పరిమితమైన, కచ్చితమైన చర్య తీసుకున్నామని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో సెంట్‌కామ్‌ వివరించింది. ‘ఇరాన్‌ మందుపాతరల ముప్పును సృష్టించింది. నావికులను, వాణిజ్య నౌకల రవాణాను, ప్రపంచ వాణిజ్యాన్ని రక్షించడానికి మా సైన్యం ఆ ప్రమాదాన్ని తొలగించింది’ అని తెలిపింది.

దురాక్రమణను చూస్తూ ఊరుకోం : పెజెష్కియాన్‌
తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే దురాక్రమణ జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ తెలిపారు. నిర్ణయాత్మక ప్రతిస్పందన తెలిపే సామర్ధ్యం తమకు ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా దాడి ‘వ్యూహాత్మక, ప్రాణాంతక తప్పిదమ’ని ఐఆర్‌జీసీ వ్యాఖ్యానించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. జోర్డాన్‌, యూఏఈలలో అమెరికా సైన్యం ఉపయోగిస్తున్న స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని ఇరాన్‌ తెలియజేసింది.

ఆర్థిక యుద్ధమని చెప్పి…
మందుపాతరల నుంచి హార్ముజ్‌ జలసంధికి విముక్తి లభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన కొద్ది రోజులకే మధ్యప్రాచ్యంలో తిరిగి ఉద్రిక్తతలు తలెత్తాయి. సైనిక చర్యకు బదులుగా ఇరాన్‌పై ఆర్థిక యుద్ధాన్ని మొదలు పెడతానని చెప్పిన అమెరికా దానికి భిన్నంగా దాడులకు తెగబడింది. హార్ముజ్‌పై పట్టు కోసం అమెరికా, ఇరాన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. జలసంధిలో రాకపోకలు సాగిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్‌ తరచుగా దాడులు చేస్తూ జలమార్గాన్ని నిర్వహించే హక్కు తనకే ఉన్నదని చెబుతోంది. మరోవైపు అమెరికా సేనలు ఇరాన్‌ ఓడరేవులను దిగ్బంధించి హార్ముజ్‌లో నౌకాయానం సాఫీగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -