Tuesday, September 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

- Advertisement -

విద్యార్థులకు నాణ్యమైన భోజనం, బ్రేక్‌ఫాస్ట్, యూనిఫాంలు అందించాలి : ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు ఆదర్శ్ ఎం.సాజీ
కాచిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన బృందం

నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం.సాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాచిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా వాష్‌రూమ్‌లూ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, కాచిగూడ స్కూల్‌లో విద్యార్థులకు ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణను ప్రయివేట్‌ ఏజెన్సీకి అప్పగించినప్పటికీ నాణ్యమైన భోజనం అందించడం లేదని విమర్శించారు. నాసిరకం బియ్యం, నాణ్యత లేని పదార్థాలతో వంట చేస్తుండటంతో విద్యార్థులు ఆ భోజనం తినలేక ఇండ్ల నుంచే తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే యూనిఫాంలు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫాంలు అందించలేదని తెలిపారు. అన్ని సబ్జెక్టులకు తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, ఇలాంటి సమస్యలను పరిష్కరించకుండా విద్యా ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయని ప్రశ్నించారు. ప్రభుత్వం కేవలం ప్రచారాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పోషకాహార భోజనం, యూనిఫాంలు, ఉపాధ్యాయుల నియామకం, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్, నాయకులు ప్రవీణ్, అశ్వాక్, కైలాష్, భారత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -