అధికారులకు జిన్‌పింగ్ హెచ్చరిక
బీజింగ్: తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని అధికారులు జవాబుదారీగా ఉండాల్సిందేనని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) అధినేత షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. అధికారానికి తగ్గట్టుగా తగిన బాధ్యతతో పని చేయాలని సూచించారు. చైనాలో అధికారుల పనితీరు, బాధ్యతలపై ఆయన మరోసారి హెచ్చరికలు చేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ స్వీయ పాలనకు (సెల్ఫ్ గవర్నెన్స్) సంబంధించిన అంశంపై జిన్‌పింగ్ రాసిన ప్రత్యేక వ్యాసంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ప్రభుత్వ ఆధీనంలోని షిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ‘అధికారం ఎక్కడ ఉంటుందో అక్కడ దానికి సమానమైన బాధ్యత ఉండాలి. తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైన ప్రతి ఒక్కరినీ కచ్చితంగా జవాబుదారీ చేయాల్సిందే’ అని జిన్‌పింగ్ నొక్కి చెప్పారు. పార్టీ స్వయం పాలన పూర్తి స్థాయిలో అమలు కావడానికి పక్కా లక్ష్యంతో కూడిన, సమర్థవంతమైన జవాబుదారీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాంతాలు, ప్రభుత్వ విభాగాల్లో పార్టీ స్వీయ పాలనను కఠినంగా అమలు చేసే విషయంలో ఆయా పార్టీ సంస్థలు, ముఖ్యంగా కీలక అధికారులు ప్రాథమిక బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని స్థాయిల్లోని ఉన్నతాధికారులు తమ బాధ్యతల్ని కచ్చితంగా నిర్వర్తించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థలో నైతికత, క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని పెంపొందించాలని అన్నారు.
అవినీతిపై ఉక్కు పాదం
షీ జిన్‌పింగ్ తాజాగా చేసిన హెచ్చరికను ఆయన 2012 సమయంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొనసాగిస్తున్న కఠినమైన అవినీతి వ్యతిరేక ప్రచారానికి కొనసాగింపుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి గత కొన్నేండ్లలో అవినీతి ఆరోపణల పేరుతో వేలాది మంది పౌర, సైనిక అధికారుల్ని ఆయన పదవుల నుంచి తొలగించారు. కొందరు శిక్షలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఈ తాజా హెచ్చరిక కేవలం అవినీతిని అరికట్టడానికి మాత్రమే పరిమితం కాకుండా, అధికారులు తమ పనితీరులో మంచి ఫలితాలు రాబట్టాలనే దిశగా ఒత్తిడిని పెంచే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది.
నాలుగోసారి అధ్యక్షుడిగా కొనసాగుతారా?
జిన్‌పింగ్ ప్రస్తుతం చైనా కమ్యూనిస్ట్ పార్టీకి, అలాగే సైన్యానికి అధినేతగా ఉన్నారు. ఆయనను పార్టీలో ఫౌండర్ మావో జెడాంగ్ తర్వాత కీలకమైన కోర్ లీడర్‌గా పేర్కొంటున్నారు. ఈయన ఇప్పటికే మూడోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయనకు ముందు చైనా అధ్యక్షులు సాధారణంగా ఐదేండ్ల పదవీ కాలం రెండు సార్లు చేపట్టిన తర్వాత పదవి నుంచి తప్పుకునే సంప్రదాయం ఉండేది. జిన్‌పింగ్ మాత్రం ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పి మూడోసారి అధికారంలో కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఐదేండ్ల కోసారి నిర్వహించే కాంగ్రెస్‌లో ఆయన నాలుగోసారి అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తమ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిన్‌పింగ్ చేస్తున్న వరుస హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జవాబుదారీగా ఉండాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



