Wednesday, September 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా రక్ష‍ణ శాఖలో అంతర్యుద్ధం

అమెరికా రక్ష‍ణ శాఖలో అంతర్యుద్ధం

- Advertisement -

యూఎస్‌ ​ఆర్మీ సెక్రెటరీ డ్యాన్‌ డ్రిస్కోల్‌ రాజీనామా
హెగ్‌సెత్‌తో విభేదాలే కారణం?
ఇరాన్ తో యుద్ధం వేళ అమెరికా
రక్షణశాఖలో కీలక పరిణామం

వాషింగ్టన్ : ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా రక్షణ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యూఎస్ ఆర్మీ సెక్రెటరీ డ్యాన్ డ్రిస్కోల్ తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కలిసి ఆర్మీ ప్రస్తుత పరిస్థితులను వివరించిన అనంతరం ఆయన తన రాజీనామా లేఖను సమర్పించినట్టు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. ఒకవైపు ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు, మరోవైపు రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా ఆర్మీ చీఫ్ రాజీనామా అంశం చర్చనీయాంశంగా మారింది. మరోపక్క డ్యాన్‌ డ్రిస్కోల్ రాజీనామాను వైట్ హౌస్ ధ్రువీకరించింది. ఈమేరకు వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్మీలో రక్షణ సంసిద్ధతను పెంపొందించడంలో, సైనిక కార్యక్రమాలను విజయవంతం చేయడంలో డ్రిస్కోల్ అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించారని కొనియాడారు. ప్రెసిడెంట్ ట్రంప్ ‘మేక్ అమెరికా స్ట్రాంగ్ అగైన్’ అనే ఎజెండాను ఆర్మీ విభాగంలో విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. అంతేకాక రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల్లోనూ ఆయన అమెరికా తరఫున కీలకంగా వ్యవహరించినట్టు తెలిపారు.
ప్రస్తుతం అమెరికా సైన్యం ఇరాన్‌తో ఆరు నెలలుగా కొనసాగుతున్న సుదీర్ఘ పోరాటంలో తలమునకలై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత స్థాయి సైనిక అధికారులు వరుసగా వైదొలగడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే నేవీ సెక్రెటరీ జాన్ ఫెలన్ కూడా పలు విభేదాల కారణంగా తన పదవికి రాజీనామా చేయగా, తాజాగా డ్యాన్ డ్రిస్కోల్ నిష్క్రమణతో పెంటగాన్‌ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

రాజీనామాకు అంతర్గత విభేదాలే కారణమా?
డ్యాన్ డ్రిస్కోల్ రాజీనామాకు ఆధిపత్య పోరే అని లుకలుకలు వినిపిస్తున్నాయి. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌తో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరే ఈ అనూహ్య నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇద్దరి మధ్య అధికార పరిధులు, నిర్ణయాలు తీసుకునే తీరుపై తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు సమాచారం. మరోపక్క ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో డ్రిస్కోల్‌కు ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలే ఈ విభేదాలకు అసలు కారణంగా తెలుస్తోంది. డ్రిస్కోల్, జేడీ వాన్స్ ఇద్దరూ యాలే లా స్కూల్‌ మేట్స్. నాటి నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఈ సాన్నిహిత్యం కారణంగా డ్రిస్కోల్ రక్షణ శాఖ పరిధిలోని పలు కీలక విషయాలను నేరుగా వైట్ హౌస్‌తో, ముఖ్యంగా ఉపాధ్యక్షుడి కార్యాలయంతో చర్చిస్తుండేవారు. పీట్ హెగ్‌సెత్‌తో కాకుండా ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలతో సంబంధాలను కొనసాగించడం రక్షణ మంత్రికి నచ్చలేదని తెలుస్తోంది.
అలాగే, పెంటగాన్ నాయకత్వంపై కూడా హెగ్‌సెత్ తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. మిలిటరీ అధికారుల విధేయతను శంకిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలు డిపార్ట్‌మెంట్‌లో చిచ్చు పెట్టాయి. ఇందులో భాగంగానే, డ్రిస్కోల్‌కు అత్యంత సన్నిహితుడు, అప్పటి ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన జనరల్ రాండి జార్జ్‌తో పాటు మరో ఇద్దరు జనరల్స్‌ను హెగ్‌సెత్ ఇటీవల పదవుల నుంచి తప్పించారు. తన సహచరుడి తొలగింపు డ్రిస్కోల్‌కు తీవ్ర మనస్తాపం కలిగించింది. ప్రభుత్వానికి ఉన్న అధికారాల రీత్యా తాను దానిని అంగీకరించాల్సి వచ్చిందని డ్రిస్కోల్ గతంలో పేర్కొన్నారు. ఈ పరిణామం తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతూ వచ్చినట్టు సమాచారం. డ్రిస్కోల్ రాజీనామాను వైట్ హౌస్ ధ్రువీకరించినప్పటికీ, అంతర్గత కలహాల గురించి ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -