కాజీపేట ఆర్‌ఎంయూకు ‘మేధా’తో చెక్
టెండర్ ప్రక్రియలోనే ప్రయివేటీకరణకు బాటలు
‘మేధా’లో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారని ఆరోపణలు
వ్యతిరేకిస్తున్న రైల్వే కార్మిక సంఘాలు
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాజీపేట రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ) పనులు పూర్తయినా ప్రారంభోత్సవం కాలేదు. దీనికి ప్రధానంగా బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలే కారణమని ప్రచారం జరుగుతోంది. కాజీపేట ఆర్‌ఎంయులో పనులకుగాను చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీకి టెండర్లు ఆహ్వానించే బాధ్యతను సెంటర్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాజీపేటలో రైల్వే జాక్ నేతలు పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించి తమ నిరసనను బహిర్గతం చేయడంతో తాత్కాలికంగా రైల్వే ఉన్నతాధికారులు ఆ టెండర్‌ను నిలిపివేశారు. అంత వరకు బాగానే వున్నా.. రంగారెడ్డి జిల్లాలోని కొండకల్ ప్రాంతంలో ప్రారంభించిన మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఈ టెండర్‌ను అంటగట్టి కాజీపేట రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పనులన్నింటినీ ‘మేధా’తో చేయించే కుట్ర జరుగుతున్నట్టు సమాచారం. అందుకే కాజీపేటలో ఆర్‌ఎంయూ పనులు పూర్తయినా నేటికీ ఆ యూనిట్‌ను ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని తెలుస్తోంది. 2026 మార్చిలోనే ఈ యూనిట్‌ను ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రి తదితరులు ప్రకటించినా నేటికీ ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించకపోవడం వెనుక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
టెండర్ ప్రక్రియలోనే ప్రయివేటీకరణకు బీజం
కాజీపేటలో రూ.521.36 కోట్లతో 160 ఎకరాల్లో నిర్మించిన రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌లో ఉత్పత్తిని ప్రారంభించడానికిగాను తొలుత టెండర్ ప్రక్రియను నిర్వహించడానికి చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దీనిపై రైల్వే యూనియన్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దక్షిణ మధ్య రైల్వేకు జనరల్ మేనేజర్ లాంటి అధికారి వుండగా, టెండర్ ప్రక్రియను చెన్నై ఐసిఎఫ్ ఎందుకు నిర్వహించాలని కార్మిక సంఘాల నేతలు వ్యతిరేకించారు. కాజీపేట రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌లో ప్రత్యక్షంగా సుమారు 5 వేల నుంచి 6 వేల మంది ఉద్యోగులను నియమించాల్సి వుంది. చెన్నై ఐసిఎఫ్ టెండర్ల ద్వారా ఔట్‌సోర్సింగ్‌తో కార్మికులను నియమించి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను తీసుకోకుండా ముందే కుట్ర పన్నుతున్నారని రైల్వే సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో చెన్నై ఐసిఎఫ్ టెండర్లను ఆహ్వానించగానే వెంటనే కాజీపేటలో రైల్వే జాక్ నేతలు భారీ పాదయాత్రను నిర్వహించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఐసిఎఫ్ టెండర్‌ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి కాజీపేట ఆర్‌ఎంయూను సందర్శించి పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. త్వరలోనే ప్రారంభోత్సవం వుంటుందని ప్రకటించినా నేటికీ ప్రారంభం కాకపోవడం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, రైల్వే సంఘాల నేతలు, కార్మికులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
‘మేధా’లో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల భాగస్వామ్యం..?
రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో నిర్మించిన మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి వున్నా బీఆర్‌ఎస్ నేతలు ఒకవైపు ఈ నినాదంతో రాజకీయాలు చేస్తూనే మేధా కంపెనీకి 100 ఎకరాల భూమిని ఇప్పించడం, ఆనాడు ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పరిశ్రమను ప్రారంభించడం గమనార్హం. ఈ క్రమంలోనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో తీవ్ర జాప్యమవుతూ వచ్చింది. దీంతో కార్మిక సంఘాల మరింత లోతుగా అధ్యయనం చేస్తే ఈ కంపెనీలో బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలిద్దరికీ భాగస్వామ్యం వున్నట్టు తేలింది. బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్రంలో కీలకస్థానంలో వున్న ఒక నేతకు సైతం ఇందులో భాగస్వామ్యం వుండడంతో కాజీపేట ఆర్‌ఎంయూ ప్రారంభోత్సవానికి అడుగులు పడడం లేదు. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలే కాజీపేట ఆర్‌ఎంయూ ప్రారంభోత్సవానికి అడ్డు పడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కాజీపేట ఆర్‌ఎంయులో పనులను ప్రయివేటీకరించి వారి సొంత కంపెనీ మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పనులు అప్పగించేలా కుట్ర జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2023 జూన్‌లో నాటి సీఎం కేసీఆర్ ఈ కంపెనీని ప్రారంభించగా, ఈ కంపెనీ నుంచి పలు రైల్వే విడి భాగాలు ప్రస్తుతం కాజీపేటలోని డీజిల్ లోకో షెడ్, ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లకు సరఫరా అవుతుండడం గమనార్హం.
కోచ్ పనులు పూర్తయినా ప్రారంభానికి అడ్డంకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



