– వంటావార్పుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై చల్లా ధర్మారెడ్డి ఫైర్
నవతెలంగాణ -పరకాల
ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దగా పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పరకాల అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో ఆయన రోడ్డుపైనే మహిళలతో కలిసి భోజనం చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోందని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ హామీని ఎక్కడ అమలు చేసిందని ప్రశ్నించారు.
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ హామీ ఏమైందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, అదే సమయంలో ఇతర చార్జీల భారాన్ని పెంచి కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతోందని చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. మహిళల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఆ దిశగా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మహిళా సంఘాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పి ఆ హామీని కూడా పక్కన పెట్టారని మండిపడ్డారు.గర్భిణీలు, బాలింతలకు భరోసాగా నిలిచిన కేసీఆర్ కిట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం మాయం చేసిందని చల్లా ఆరోపించారు. విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వృద్ధులకు కొత్తగా సంక్షేమం అందించకపోగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలనే కొనసాగిస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం ప్రజలను మోసం చేయడమేనని చల్లా ధర్మారెడ్డి అన్నారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వానికి గుర్తుచేస్తూ బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సాయి తిరుపతి రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి సారంగపాణి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నక్క చిరంజీవి బీఆర్‌ఎస్ నాయకులు,కోడెపాక కరుణాకర్,నల్లెల లింగమూర్తి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాపక్క,బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళలు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.



