పిల్లల జీవితంలో గురువుల పాత్ర అత్యంత కీలకమైనది. బడిలో పాఠాలతో పాటు సమాజిక విలువలను కూడా నేర్చుకున్న విద్యా ర్థులు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. అలాంటి పౌరులను తీర్చగలిగే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. అందుకే తల్లిదండ్రుల తర్వాత పిల్లల జీవితంలో ఉపాధ్యాయులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అటువంటి ఉపాధ్యాయులను గౌరవించుకునేందుకు సర్వేపలి రాథాకృష్ణన్ జయంతి రోజైన సెప్టెంబర్ 5న టీచర్స్ డే జరుపుకుంటున్నాం. మహిళలను బయట అడుగుపెట్టనీయని కాలంలోనే అమ్మాయిలకు అక్షరాలు నేర్పిన సావిత్రీబాయి వంటి మహనీయులను ఆదర్శంగా తీసు కొని, పిల్లలకు పాఠాలతో పాటు విలువలు నేర్పుతున్న ఉపాధ్యా యులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను మానవితో ఇలా పంచుకున్నారు.
గురువుల పాత్ర కీలకం
మానవ సమాజంతో దగ్గరి సంబంధాలు ఏర్పరచుకునే, విద్యార్థులకు జ్ఞానాన్ని, మంచి ప్రవర్తనను నేర్పించే, వారి భవిష్యత్తు తీర్చిదిద్దే అవకాశం కేవలం గురువుకు మాత్రమే ఉంటుంది. అలాంటి వృత్తిలోకి నేను రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. మనిషి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువుల పాత్ర అత్యంత కీలకం. మంచి చెడును చెప్పి, బతుకు బండిని లాగేందుకు అవసరమైన విషయాలు బోధిస్తారు. అందుకే సమాజంలో తల్లిదండ్రులతో సమానమైన కీర్తి కేవలం గురువుకు ఇచ్చారు. ఉపాధ్యాయులంటే పాఠశాలలో చదువు చెప్పేవారు మాత్రమే కాదు. జీవితానికి కావలసిన పాఠాలు నేర్పించేవారు. అలాంటి ఉపాధ్యాయులకు అన్ని విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అలాగే విద్యార్థుల సమస్యలను ఓపికతో వినాలి. విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకొని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలగాలి.
నేను అనుకోకుండానే ఈ వృత్తిలోకి వచ్చాను. కానీ వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. అది నేను కలిసి పని చేసే ఉపాధ్యాయుల నుండి కొంతైతే, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్న టీఎస్‌యుటిఎఫ్ సంఘం నుండి మరి కొంత నేర్చుకున్నాను. సంఘం ఎప్పుడూ ఒకటే చెపుతుంటది. హక్కులు, బాధ్యతలు రెండూ మన రెండు కళ్ళలాంటివని. హక్కుల కోసం కొట్లాడుతూనే అంతే బాధ్యతగా నీ వృత్తిని నిర్వర్తించు అని. నేను ఈ వృత్తిలోకి వచ్చి 22 ఏండ్లు పూర్తయింది. నేను పని చేసే ప్రతి చోటా నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకు న్నాను. అది పిల్లల అభివృద్ధి కోసం కావచ్చు, బడి బాగు కోసం కావచ్చు. ఈ 22 ఏండ్ల కాలంలో పిల్లల మానసిక పరిస్థితి గమనిస్తే చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పటిలా పిల్లలు దేన్నీ స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అది గెలుపైనా ఓటమైనా. నేటి తరం చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. అంతే సున్నితంగా కూడా ఉన్నారు. వీళ్ళని మన వైపు ఆకర్షించాలన్నా, బోధన చేయాలన్నా వారి మానసిక స్థితిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. వారి స్థాయికి తగినట్లుగా బోధించాలి.
నేను ప్రస్తుతం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగా రెడ్డి జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాను. 2024 జులై 9న నేను ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యత తీసుకున్నాను. నేను బాధ్యత తీసుకునే నాటికి ఈ పాఠశాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అది భౌతిక వనరులు కావచ్చు, మానసిక వనరులు(విద్యార్థులు) కావచ్చు. ఎలాగైనా బడిని బాగు చేయాలన్న ఆలోచనతో ఆకాశం కోసం ఎదురుచూస్తున్న నేను 2024లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అవకాశంగా మలుచుకున్నాను. గ్రామంలోని ప్రజాప్రతినిధులను, గ్రామ పెద్దలను, యువకులను, పూర్వ విద్యార్థులను పిలిచి పాఠశాల స్థితిగతుల గురించి వివరిం చాను. వారు పాఠశాల స్థితిని అర్ధం చేసుకొని అభివృద్ధికై ముందుకు వచ్చారు. అందులో భాగంగా 4 లక్షల రూపాయలతో పాఠశాలలో రిపేర్ వర్క్ చేయించి, పెయింటింగ్ వేయించా ము. పిల్లలకు కనీస వసతులైన వాష్ రూమ్స్, తాగునీటి కోసం వాటర్ ప్లాంట్, బెంచీలు తదితర అవసరాలు తీర్చగలిగాము. మూతపడే దశ నుండి పాఠశాలను కాపాడుకోగలిగాము.
– నాగిళ్ళ సుగంధ, రంగారెడ్డి
మరింత శ్రద్ధ అవసరం
ఉపాధ్యాయురాలిగా 30 ఏండ్ల అనుభవం నాది. ఈ ఇంటర్నెట్ యుగంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎదుగుతున్న, కౌమార దశలో ఉన్న పిల్లలకి సెల్‌ఫోన్‌ని సాధ్యమైనంత దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సాంఘిక పరిస్థితులు, ఐక్యూ లెవెల్స్ ఒకేలా ఉండవు. ముఖ్యంగా కరోనా తర్వాత దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడి పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థులకు భాష కూడా ఒక ప్రధాన సమస్యగా మారుతుంది. అటువంటి వారికి ఉపాధ్యాయులు కాస్త శ్రమైనా మరింత శ్రద్ధ తీసుకొని బోధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. సాధారణంగా ఎనిమిదవ తరగతి నుంచి బాలురు కానీ బాలికలు కానీ కౌమార దశలో ఉంటారు. కాబట్టి వారికి శారీరక, మానసికమైన మార్పుల గురించి అవగాహన కల్పించాలి. 30 ఏండ్ల కిందట అంటే నేను వృత్తిలో చేరిన కొత్తలో ఉన్న పిల్లల వైఖరికి, ఇప్పటి పిల్లలకి చాలా తేడా గమనించాను. దానికి తగ్గట్టుగానే ఉపాధ్యాయులు కూడా పిల్లలకు బోధించే విధానంలో మార్పులు చేసుకోవల్సిన అవసరం ఉంది. చివరగా ఈ అంతర్జాల యుగంలో వాటి ప్రతికూల ప్రభావాల దృష్ట్యా పిల్లలకు కేవలం పాఠ్యపుస్తకాలలోని జ్ఞానమే కాదు, క్రమశిక్షణ, నిబద్ధత కూడా చాలా అవసరం. ఇవే వారి పురోగతికి, బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు కావడానికి ఉపయోగపడతాయి. అవి వాళ్లకు తెలియజేయడం ఉపాధ్యాయులుగా మన కర్తవ్యం అని నేను భావిస్తున్నాను.
ఆర్.మాధవి, జీహెచ్ఎస్ జమిస్తాన్పూర్



