అందరి చూపు మల్కాజిగిరి వైపు

అందరి చూపు మల్కాజిగిరి వైపు– బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఫోకస్‌
– బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో మల్లారెడ్డి ఫ్యామిలీ..!
– కాంగ్రెస్‌ నుంచి తెరపైకి మైనంపల్లి లేదా సుధీర్‌రెడ్డి పేర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
అందరి చూపు మల్కాజిగిరి లోక్‌సభ సెగ్మెంట్‌ పైనే పడింది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో దిగేందుకు స్థానికులతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు, మాజీ మంత్రులు సైతం సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆశావహులు ఎవరికి వారే టికెట్‌ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ లోక్‌సభ స్థానం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజవర్గాలతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని ఒక్కొక్క నియోజకవర్గంతో ముడిపడి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్‌ పరిధిలోని మేడ్చల్‌, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, కంటోన్మెంట్‌ నియోజవకర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నా.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. ఎమ్మెల్యేలందరూ బీఆర్‌ఎస్‌ వారే ఉన్నా.. కాంగ్రెస్‌ తరుపున ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీగా గెలుపొంది పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. ఈసారి కూడా అలాగే ఉంటుందా..? లేక మారుతుందా..? అనే చర్చ జరుగుతోంది.
అగ్రనేతల ఆసక్తి..
ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ తరుపున మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ పోటీలో ఉంటారని జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక వారం రోజుల క్రితం మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కేటీఆర్‌ను కలిసిన తర్వాత ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. తాను మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని, గతంలో ఇక్కడి నుంచి గెలుపొందానని, ఈ సెగ్మెంట్‌ పరిధిలో అందరూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నట్టు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇద్దరు మాజీ మంత్రులు మల్కాజిగిరి లోక్‌సభ అభర్థిపై చర్చించినట్టు సమాచారం. గత అనుభవంతోపాటు జిల్లాలో బలమైన నేతగా ఉన్న మల్లారెడ్డి కుటుంబం నుంచే ఒకరిని పోటీలో నిలబెడతారని సమాచారం. ఇక బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మురళీధర్‌రావు, ఈటల రాజేందర్‌ టికెట్‌ను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరూ బహిరంగంగానే ప్రకటించారు. అధికార కాంగ్రెస్‌ నుంచి ఆశావహులు పెద్దగా బయట పడకపోయినా.. మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, మలిపెద్ది సుధీర్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకనికి పార్లమెంట్‌, మరొకరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కట్టబెడతారని చర్చ జరుగుతోంది. సిట్టింగ్‌ స్థానం కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి చరిస్మా కలిసొస్తుందని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తుండగా.. అందరూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండటం కలిసి వస్తుందని బీఆర్‌ఎస్‌ నేతలు ధీమాతో ఉన్నారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు ఇలా..
పార్టీ మేడ్చల్‌ మల్కాజిగిరి కూకట్‌పల్లి కుత్బుల్లాపూర్‌ ఉప్పల్‌ ఎల్బీనగర్‌
బీఆర్‌ఎస్‌ 1,86,017 1,25,049 1,35,635 1,87,999 1,32,927 1,11,380
కాంగ్రెస్‌ 1,52,598 75,519 65,248 1,01,554 83,897 83,273
బీజేపీ 50,535 55,427 39,830 1,02,423 47,332 89,075

Spread the love