– ప్రతిపక్షం గొంతు నొక్కాలని ప్రభుత్వం చూస్తోంది
– 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలన
– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
నవతెలంగాణ-సత్తుపల్లి
బ్లాక్ టీ-షర్ట్‌లతో శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. అసెంబ్లీ వద్ద సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఆ పార్టీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నల్ల జెండాలు, కండువాలతో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన స్థానిక జీవీ మాల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగింది. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పోలీసులు దౌర్జన్యం చేసి స్వల్ప గాయాలకు గురిచేయడాన్ని సండ్ర గర్హించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా గుండాయిజానికి పాల్పడుతోందని సండ్ర తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే పూర్తి హక్కు ప్రతిపక్షానికి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

రాహుల్, ప్రియాంకలు నల్ల టీ-షర్టులు ధరించి పార్లమెంట్‌లో నిరసన చేయలేదా..!
ఢిల్లీ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నల్ల టీషర్టులు ధరించి నిరసన తెలిపినప్పుడు ఎన్డీఏ అనుమతించిందని సండ్ర గుర్తుచేశారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కి ఒక నీతి, తెలంగాణ అసెంబ్లీలో మరొక నీతా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ నీతిని సండ్ర నిలదీశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నాయకులపై జరిగిన అణచివేత చర్యలను సత్తుపల్లి ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని సండ్ర అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని సండ్ర స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని సండ్ర హెచ్చరించారు.
420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వ దగాకోరు పాలన – 1000 రోజుల విఫల పాలనపై రోడ్డెక్కిన గులాబీ దండు
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలన అంటూ బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో సత్తుపల్లిలో నల్ల జెండాలు, నల్ల కండువాలతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను విస్మరించి దగాకోరు పాలన సాగిస్తోందని మండిపడ్డారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, 1000 రోజుల విఫల పాలనగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లతో పాటు 420 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ పూర్తి చేయాలని, సెక్షన్ 22-A జాబితాలో చేర్చిన భూములను తక్షణమే ఆ నిబంధన నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్లను పక్కాగా అమలు చేయాలని కోరారు. అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్న రూ. 12 లక్షల సహాయాన్ని, ఎస్సీ-ఎస్టీ డిక్లరేషన్‌ను వెంటనే అమల్లోకి తీసుకురావాలన్నారు. విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీల బాకీని వెంటనే తీర్చాలని స్పష్టం చేశారు.
మహిళలకు ఇస్తామన్న నెలకు రూ. 2,500 భృతిని, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పాటు ఇస్తామన్న తులం బంగారాన్ని వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు రూ. 4,000, దివ్యాంగులకు రూ. 6,000 పెన్షన్ ఇస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలన్నారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి ఇచ్చే రూ. 12,000 సాయాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేశామని, ప్రస్తుతం విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సండ్ర ఆరోపించారు. కిష్టారం గ్రామంపై ఓపెన్‌కాస్ట్ గనుల ప్రభావంతో జరుగుతున్న నష్టంపై గ్రీవెన్స్ డేలో అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం పలు గ్రామపంచాయతీల నుంచి సమస్యలతో కూడిన వినతి పత్రాలను సత్తుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో సండ్ర వెంకట వీరయ్య అందజేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, నాయకులు ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, భీమిరెడ్డి గోపాల్ రెడ్డి, కోటగిరి సుధాకరరావు, తదితరులు పాల్గొన్నారు.



