– అత్యవసరమైన నీటి సంరక్షణ
– నియోజకవర్గం లో 65 శాతానికి చేరిన వర్షపాతం లోటు
– నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచన
– ఏడీఏ పెంటేల రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్లో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్న నేపథ్యంలో వాన నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. డివిజన్ పరిధిలో 50 శాతానికి పైగా సాగు విస్తీర్ణం వర్షాధారంగా ఉండగా, మిగిలిన విస్తీర్ణంలో బోర్ల ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాలపై ఆధారపడి వానాకాలం పంటల సాగు కొనసాగుతోంది.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతంలో లోటు నెలకొంది. చండ్రుగొండ మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన నాలుగు మండలాల్లో లోటు కొనసాగుతోంది. అన్నపురెడ్డిపల్లి మండలంలో 35 శాతం, ములకలపల్లిలో 45 శాతం, అశ్వారావుపేటలో 55 శాతం, దమ్మపేటలో అత్యధికంగా 65 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ప్రతి చినుకును ఒడిసిపట్టాలి:
వర్షపాతం లోటుతో పాటు భూగర్భ జలాలు కూడా తగ్గుతుండటంతో రైతులు తమ పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకునే చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పడిన వాన నీటిని సంరక్షించకపోతే అది వాగులు, వంకలు, నదుల ద్వారా సముద్రంలో కలసి వృథా అవుతుంది. ఒక మిల్లీమీటర్ వర్షపాతం ఒక ఎకరంలో సుమారు 4,047 లీటర్ల నీటికి సమానం. ఈ నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని పేర్కొంటున్నారు.
పొలాల్లో ఈ చర్యలు చేపట్టాలి: వ్యవసాయ కుంటలు
ఎకరానికి సుమారు రెండు గుంటల విస్తీర్ణంలో వ్యవసాయ కుంటను ఏర్పాటు చేసుకోవచ్చు. 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, మూడు మీటర్ల లోతు తో కుంటను తవ్వితే సుమారు 12 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటిని ఉపాధి హామీ పథకం ద్వారా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వర్షాలు లేని సమయంలో నిల్వ నీటితో ఒకటి, రెండు పంటలకు జీవపు తడులు అందించవచ్చు.
కాంటూర్ కందకాలు, కట్టలు: వాలు ప్రాంతాల్లో ఒక అడుగు వెడల్పు, ఒక అడుగు లోతు తో కందకాలు తీయడం ద్వారా వర్షపు నీటి వేగాన్ని తగ్గించి భూమిలోకి ఇంకేలా చేయవచ్చు. దీంతో నేల కోతను కూడా అరికట్టవచ్చు.
రీచార్జ్ పిట్లు: పొలం గట్టు వద్ద 3 మీటర్ల పొడవు, వెడల్పు, లోతు తో గుంత తవ్వి ఇసుక, కంకర, వల వంటి పదార్థాలతో నింపడం ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకించవచ్చు. బోర్ల సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తే భూగర్భ జలాల రీచార్జికి ఉపయోగపడతాయి.
చెక్‌డ్యామ్‌లు, మట్టి కట్టలు:
వాగులు, వంకలపై చిన్న చెక్‌డ్యామ్‌లు, మట్టి కట్టలు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయడంతోపాటు భూగర్భ జలాలను పెంచుకోవచ్చు. అయితే చెరువులు, కుంటల నుంచి ఇసుక, మట్టిని అక్రమంగా తరలించకుండా సంరక్షించాల్సిన అవసరం ఉంది.
ఇండ్లు, ప్రభుత్వ భవనాల్లోనూ చర్యలు
ఇంటి డాబాపై పడే వర్షపు నీటిని పైపుల ద్వారా ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలి. 1,000 చదరపు అడుగుల డాబాపై ఒక సెంటీమీటర్ వర్షపాతం కురిస్తే సుమారు 2,800 లీటర్ల నీటిని సేకరించవచ్చు. ఇంటి ఆవరణలో మూడు అడుగుల వెడల్పు, పది అడుగుల లోతు తో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి ఇసుక, 40 ఎంఎం కంకర తో నింపితే వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చేయవచ్చు.
గ్రామస్థాయిలో సమష్టి చర్యలు అవసరం
పాత చెరువులు, కుంటలను పునరుద్ధరించి పూడిక తొలగించడం, కట్టలను బలోపేతం చేయడం వంటి పనులు చేపట్టాలి. ప్రతి పొలం గట్టుపై చెట్లు నాటడం, నేరుగా విత్తే విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. చెరువులు, కుంటలు, కట్టలు, పొలాల్లో నీటి సంరక్షణ చర్యలు సమష్టిగా చేపట్టినప్పుడే భూగర్భ జలాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది.
బోర్లు ఎండిపోకుండా..
వాన నీటి సంరక్షణ, భూగర్భ జలాల చర్యలతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగి బోర్లు ఎండిపోకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్‌లో సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రతి చినుకును ఒడిసిపట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
“పడిన ప్రతి చినుకును పట్టుకుందాం.. రేపటి తరానికి నీరు అందిద్దాం” అనే నినాదంతో రైతులు, ప్రజలు వాన నీటి సంరక్షణలో భాగస్వాములు కావాల్సిన సమయం ఆసన్నమైంది.



