– ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ వంటి ప్రధాన కార్మిక సంఘాలను విస్మరించడాన్ని నిరసిస్తూ సోమవారం దమ్మపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ ప్రధాన కార్మిక సంఘాలను పక్కనపెట్టి తమకు అనుకూలమైన సంఘాలతో బోర్డును ఏర్పాటు చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలను అణిచివేసే విధానాలకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీఐటీయూను కనీస వేతనాల సలహా మండలి నుంచి తప్పించినంత మాత్రాన దేశంలోని కోట్లాది కార్మికుల హక్కుల కోసం సాగుతున్న పోరాటాలను అణచివేయలేరన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరికి వ్యతిరేకంగా కార్మికులను సంఘటితం చేసి వారి సమస్యలపై నిరంతరం పోరాడుతామని తెలిపారు. కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూతో పాటు ఇతర ప్రధాన కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, నరసయ్య, వీర్రాజు, శ్రీను, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.



