Tuesday, September 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవద్దు

ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవద్దు

- Advertisement -

చర్యల అధికారం స్పీకర్‌దే
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి :
డీజీపీకి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది. సభా నియమావళి, నిబంధనలను ఉల్లంఘించిన సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉంటుందని తెలిపింది. పోలీసులకు ఆ అధికారం లేదని తేల్చి చెప్పింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ప్రవేశాన్ని అడ్డుకోవడంతోపాటు వారితో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, పోలీసు కమిషనర్, డీసీపీ, సైఫాబాద్‌ ఎస్‌హెచ్‌ఓతోపాటు స్పీకర్‌ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తలసాని శ్రీనివాసయాదవ్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిష‌న్‌పై జస్టిస్‌ టి మాధవీదేవి సోమవారం విచారణ చేపట్టారు. బీఆర్‌ఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదిస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వె‌ళ్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలను ఎందుకు నిలువరిస్తున్నారో అడిగినా పోలీసులు సమాధానం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనగా నినాదాలు ముద్రించిన నల్ల టీషర్టులు ధరించిన ఎమ్మెల్యేలపై పోలీసులు దాడికి దిగారనీ, కొందరు గాయపడగా వైద్యులు చికిత్స అందించారని తెలిపారు. ఒక మహిళా ఎమ్మెల్యే చీర ధరించి ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకున్నారనీ, మాజీ హోం మంత్రిగా పనిచేసిన మరో మహిళా ఎమ్మెల్యే మెడపై చేయి వేసి అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నప్పటికీ ఒక్క మహిళా పోలీసు కూడా లేరని తెలిపారు. పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించిన ఫొటోలను పిటిషన్‌తోపాటు సమర్పించిన‌ట్టు చెప్పారు.
శాసనసభ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాల్సి వస్తే అది స్పీకర్‌ పరిధిలోని అంశమని, పోలీసులకు ఎమ్మెల్యేలపై అలాంటి చర్యలు తీసుకునే అధికారం లేదని బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. గతంలో పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ టీషర్ట్‌ ధరించి, ప్లకార్డులతో హాజరైన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉందనీ, ఎమ్మెల్యేలను అడ్డుకోకుండా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర హోంశాఖ తరఫున న్యాయవాది మహేష్‌రాజె వాదిస్తూ శాసనసభ నియమావళి ప్రకారం సభ్యులు బ్యాడ్జీలు ధరించరాదనీ, స్పీకర్‌ అనుమతి లేకుండా జెండాలు, చిహ్నాలు, ఇతర ప్రదర్శన వస్తువులను సభలో ప్రదర్శించరాదని తెలిపారు. నల్ల టీషర్టులపై నినాదాలు ఉండటంతో పోలీసులు అడ్డుకుని ఉండొచ్చని చెప్పగా, న్యాయమూర్తి జోక్యం చేసుకుని చీరలు ధరించి వచ్చిన మహిళా ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఫొటోలను పరిశీలిస్తే ఎమ్మెల్యేల మెడపై చేతులు వేసి గెంటాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం ఎమ్మెల్యేలను శాసనసభలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోరాదని హైకోర్టు ఆదేశించింది. దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకుని ఆ వివరాలతో నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ప్రతివాదులు సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

క్షమాపణ చెప్పిన ఐఏఎస్‌లు
కోర్టు ధిక్కరణ కేసుల్లో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌లు ఫాం–1 నోటీసులు జారీ చేసినా హాజరు కాకపోవడం, బెయిలబుల్‌ వారెంట్లు జారీ అయినా కోర్టుకు రాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిద్దరూ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన తర్వాత అధికారులు విదేశాలకు ఎలా వెళ్తారని తప్పుపట్టింది. వాళ్లను ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్ట్‌ చేస్తే పరిస్థితి ఏంటని అడిగింది. భూసేకరణ పరిహారానికి సంబంధించి కింది కోర్టు నిర్ణయించిన మొత్తంలో 50 శాతం సొమ్మును మూడు నెలల్లో డిపాజిట్‌ చేయాలంటూ గతేడాది ఏప్రిల్‌ 24న ఇచ్చిన ఉత్తర్వుల అమల్లో జాప్యంపై జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నాగిరెడ్డి తదితరులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లను జస్టిస్‌ ఎన్‌వి శ్రవణ్‌కుమార్‌ సోమవారం విచారించారు. కావాలని కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించలేదని ప్రభుత్వ ప్లీడర్‌ చెప్పారు. వారెంట్‌ రీకాల్, హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేశామని తెలిపారు. సుల్తానియా విదేశాలకు వెళ్లడంతో తన సూచన మేరకు మరో అధికారి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేశారని చెప్పారు. ఇద్దరు అధికారులు కోర్టును క్షమాపణ కోరుతూ అఫిడవిట్‌లు దాఖలు చేయడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణను ముగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -