ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్-సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో మంత్రుల హామీలో స్పష్టత లేదని ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్-సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రవాణా రంగం, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఇతర రవాణా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రవాణా , కార్మిక శాఖ మంత్రులతో సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన చర్చలు తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయని పేర్కొన్నారు. రవాణా రంగ కార్మికుల సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలు, కాలపరిమితితో కూడిన హామీలు వస్తాయని ఆశించినప్పటికీ, చర్చల్లో అలాంటి స్పష్టత కనిపించలేదని తెలిపారు.
రెండు శాఖల మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు, పోలీస్ ఆఫీసర్లు పాల్గొన్నప్పటికీ, ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వ వైఖరిలో స్పష్టత లేదని తెలిపారు. చర్చల సందర్భంగా కార్మిక సంఘాలు తమ సమస్యలను, డిమాండ్లను స్పష్టంగా వివరించాయని గుర్తు చేశారు. ప్రభుత్వం తరఫున “చేస్తాం”, “చూస్తాం”, “పరిశీలిస్తాం”, “పైకి పంపుతాం” అనే సమాధానాలే వచ్చాయని తెలిపారు. కార్మికుల జీవితాలతో ముడిపడిన సమస్యలపై కేవలం పరిశీలన, హామీలు కాకుండా స్పష్టమైన నిర్ణయాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, అమలుకు కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సరుకు రవాణా కార్మికులకు రక్షణ కల్పించడం తదితర అంశాలను జేఏసీ చర్చల్లో ప్రస్తావించిందని గుర్తు చేశారు. అయితే ఈ అంశాలపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది? ఏ విధంగా అమలు చేస్తుంది? ఎవరి బాధ్యత? ఎంత కాలంలో పరిష్కరిస్తుంది? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రాలేదని పేర్కొన్నారు. రవాణారంగ కార్మికులు ప్రతిరోజూ ప్రజలకు సేవలందిస్తూ, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ భారాలు, ఆన్‌లైన్ యాప్‌ల కమీషన్లు, తక్కువ చార్జీలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నాన్చివేత ధోరణి తగదని పేర్కొన్నారు.
డిమాండ్లు…
రవాణా రంగ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.
ప్రయివేట్ ఆన్‌లైన్ యాప్‌ల దోపిడీకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్
యాప్ ఏర్పాటు చేయాలి.



