Tuesday, September 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగుర్తింపు ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీనం

గుర్తింపు ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీనం

- Advertisement -

11 శాతం ఫిట్‌‌మెంట్‌ ఇస్తాం
 మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

టీజీఎస్ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికల తర్వాతే ఆ సంస్థ విలీన ప్రక్రియ ఉంటుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. గత ప్రభుత్వం ఎలాంటి కసరత్తు లేకుండా హడావుడిగా ఎన్నికల కోసం విలీన ప్రకటన చేసిందని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందిగా విలీనం చేయాలని తాము భావిస్తున్నట్టు చెప్పారు. ఆర్టీసీ జేఏసీతో జరిపిన చర్చల్లో భాగంగానే కార్మిక సంఘాల గుర్తింపునకు ఎన్నికలు నిర్వహించాలని, విలీన ప్రక్రియతో పాటు 11 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం కార్మిక శాఖ ప్రత్యేక అధికారిని కూడా నియమించిందన్నారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఆర్టీసీ జేఏసీతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, చర్చల అంశాల నుంచి ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయలేదని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విలీనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని, అలాంటి ఇబ్బందులు తెలంగాణలో పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఆచితూచి అడుగులు వేస్తున్నామని చెప్పారు.

​అప్పులతో సంక్షోభం..
2017 నుంచి 2024 వరకు రిటైర్డ్ అయిన సుమారు 13 వేల మంది ఉద్యోగులకు రూ.1,152 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై మోపిన అప్పుల భారమే ఆర్టీసీని కూడా ఆర్థిక సంక్షోభంలో నెట్టిందని విమర్శించారు. ప్రస్తుత ఆర్థిక వెసులుబాటును బట్టి ఆ బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఆర్టీసీ స్థలాలను ప్రభుత్వానికి కేటాయించడంపై వస్తున్న విమర్శలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రజా సంక్షేమం కోసం అవసరమైతే మరిన్ని స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వమే ఆర్టీసీకి స్థలాలను కేటాయించిందని, ఇప్పుడు పేదల గృహ నిర్మాణం కోసం ఆ సంస్థ తిరిగి స్థలాలను కేటాయించడం ఆర్టీసీ -ప్రభుత్వాల మధ్య ఉన్న పరస్పర సమన్వయమని వివరించారు.
​గుడిసెలు లేని రాష్ర్టమే లక్ష్యం.. :
 మండలిలో మంత్రి పొంగులేటి వెల్లడి
రాష్ట్రాన్ని గుడిసెల రహితంగా మార్చాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. వచ్చే దఫాలో గుడిసెల్లో ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నామని చెప్పారు. సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ర్టంలో 53,300 గుడిసెలు ఉన్నాయని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ​సిమెంట్ బస్తాను రాయితీపై కేవలం రూ. 230కే లబ్ధిదారులకు అందిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే స్టీల్‌‌ను కూడా రాయితీపై అందించడానికి ఆయా కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని రాబోయే రోజుల్లో ఇతర కార్పొరేషన్లకు కూడా విస్తరిస్తామని మంత్రి వెల్లడించారు.

​మరో 2.50 లక్షల ఇళ్ల మంజూరు..!
రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 3.35 లక్షల ఇళ్లకు సంబంధించి మంజూరు ప్రక్రియ పూర్తికాగా వాటిలో 3 లక్షల 28 వేల ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. రాబోయే దసరా పండగ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మొదటి విడతలో అసంపూర్తిగా మిగిలిన ఇండ్లకు రెండో విడతలో నిధులు విడుదల చేస్తామన్నారు. అదే విధంగా రెండో విడత కింద మరో 2.50 లక్షల ఇళ్ల మంజూరు ప్రక్రియను ఈ నెల 20 లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

​​వచ్చే బోనాల నాటికి అన్నీ పూర్తి..
2023 ఎన్నికలకు ముందు నాటి ప్రభుత్వం హడావిడిగా పట్టాలిచ్చిందని, లబ్ధిదారులు నివసించే ప్రాంతానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఇండ్లు కేటాయించడంతో చాలా మంది అక్కడ నివసించలేకపోతున్నారని మంత్రి తెలిపారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం పేదలు ఎక్కడ నివసిస్తే అక్కడే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తోందని చెప్పారు. ఇండ్ల కేటాయింపులో నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకున్నామని తెలిపారు. వచ్చే బోనాల నాటికి ఈ ఇండ్లన్నింటినీ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.

​ వెంటనే ఒపిఎస్‌ అమలు చేయాలి : 
తీన్మార్ మల్లన్న
‌ఇతర కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నట్లుగానే తెలంగాణలోనూ వెంటనే పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం శాసనమండలిలో ఆయన ఈ మేరకు ప్రస్తావించారు. గత కొన్నేండ్లుగా ఉద్యోగులు ఈ విధానం కోసం పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతీ రాష్ట్రంలో ఓపీఎస్ అమలు చేస్తామని ‌ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గతంలో చెప్పారని గుర్తుచేశారు. అనంతరం సభను చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలిని వాయిదా వేశారు. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -