Friday, April 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునిపుణులతో చర్చించాకే కాళేశ్వరంపై ముందుకు

నిపుణులతో చర్చించాకే కాళేశ్వరంపై ముందుకు

- Advertisement -

వెంటనే సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం
పెన్షనర్లు, ఉద్యోగుల బకాయిలపై 100 రోజుల్లో ప్రణాళిక
50 శాతం జీతం విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులు
రూ.700 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో గచ్చిబౌలి స్టేడియం ఆధునీకరణ
నామినేటెడ్‌ పద్ధతిలో పీఏసీఎస్‌ చైర్మెన్ల నియామకం :క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌, వాకిటి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
న్యాయ నిపుణులతో చర్చించాకే కాళేశ్వరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికుల సమస్య లు, కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రి వర్గం గురువారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగి సిన అనంతరం క్యాబినెట్‌ నిర్ణయాలను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. హైకోర్టు పూర్తి తీర్పు పరిశీలించిన తర్వాత ఢిల్లీలో ఉన్న న్యాయ నిపుణులతో సంప్రదించి, సుప్రీంకోర్టుకు వెళ్లాలా.. లేదా కమిషన్‌ గడువు పొడగించాలా అనేది, వారిచ్చే సలహాలు సూచనల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయించామని తెలిపారు. ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలు, లోపాలు, అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం జీవో జారీ చేసి తొమ్మిది నెలలైనా దర్యాప్తు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. హైకోర్టు తీర్పు సీబీఐ దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకిగా లేదని న్యాయ నిపుణులు తెలియజేశారన్నారు. వెంటనే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం తరఫున మరోసారి సీబీఐని కోరాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

కాళేశ్వరంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ జ్యుడీషియల్‌ కమిషన్‌ నియామకంతో పాటు నివేదికను హైకోర్టు తప్పుబట్టలేదని తెలిపారు. జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చట్టబద్ధమనీ, రాజ్యాంగబద్ధమని కూడా అభిప్రాయపడిందన్నారు. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే సాంకేతిక కారణాలను హైకోర్టు తప్పుబట్టిందని తెలిపారు. ఈ నివేదికలో వారిపై ప్రస్తావించిన అంశాలు అమల్లో ఉండవనీ, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. కోర్టు తీర్పు ఇలా ఉంటే బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారో చెప్పాలన్నారు. వారి చేసిన తప్పిదం వల్ల కాళేశ్వరం పేరిట ఏటా రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. కేంద్ర మంత్రి ఎన్డీఎస్‌ రిపోర్ట్‌ చదువుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆహ్వానం మేరకు ఎన్డీఎస్‌ చైర్మెన్‌ అనిల్‌ జైన్‌ కాళేశ్వరం క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చారనే విషయం సంజరు గుర్తుంచుకోవాలని తెలిపారు. అలాగే రెగ్యులర్‌ ఉద్యోగులకు సంబంధించి రూ.6,200 కోట్లు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి రూ.8 వేల కోట్లు పెండింగ్‌ లో ఉన్నాయన్నారు. ఈ బకాయిలు గత సర్కార్‌ హయాం నుంచి కొనసాగుతున్నాయని గుర్తు చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీటిని వెంటనే ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పటికీ వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అన్వేషించి, అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులకు ఇచ్చే జీతాల నుంచి 50 శాతం రిటైర్డ్‌ ఉద్యోగులకు వెంటనే సర్దుబాటు చేయాలని ముందుకొచ్చారని వివరించారు. రిసోర్స్‌ మొబిలైజేషన్‌ సబ్‌ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘాలు, బాధ్యులైన వారందరినీ పిలిచి చర్చలు జరిపి, వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. వంద రోజుల్లోగా రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిల చెల్లింపు దిశగా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్రంలో పదవీ కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు(పీఎసీఎస్‌) నామినేటెడ్‌ పద్ధతిన పాలకవర్గాలను నియమించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్‌ ప్రయివేట్‌ పార్టనర్షిప్‌ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసిందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో 21 రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంతో పాటు అవుట్‌ డోర్‌ స్టేడియం సామర్థ్యం 20 వేల నుంచి 50 వేలకు పెంచాలని నిర్ణయించిందని వివరించారు. మిగిలిన 12 ఎకరాలను డెవలపర్స్‌కు ఇచ్చి..వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పోర్ట్స్‌ యూనివర్సిటీ నిర్వహణ, క్రీడాకారుల వసతి, శిక్షణ ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని నిర్ణయించామన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ భూసేకరణ పూర్తి చేయాలని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

ప్రాజెక్ట్‌కు దాదాపు 2,427 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటివరకు 1020 ఎకరాలు సేకరించామన్నారు. మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా పార్క్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 85.10 ఎకరాలను మత్స్య శాఖకు కేటాయిస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని మంత్రులు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -