Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్న్యాయవాదిపై ఖాకీ ప్రతాపం!

న్యాయవాదిపై ఖాకీ ప్రతాపం!

- Advertisement -

ఆగి ఉన్న బైక్‌కు చలాన్ల మోత
ఇంతెజార్‌గంజ్‌ ఎస్సై దురుసు ప్రవర్తన..
వరంగల్‌ బార్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు
పోలీసుల తీరుపై న్యాయవాదుల ఆగ్రహం

నవతెలంగాణ-వరంగల్‌
తమ గౌరవానికి భంగం వాటిల్లితే చలాన్లతో సమాధానం చెప్తాం’ అన్నట్టు ఉంది వరంగల్‌లోని కొందరు పోలీసుల తీరు. ఓ వైపు జిల్లాలో శాంతి భద్రతల తీరు ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు కొందరు ఖాకీలు చలాన్ల జారీపై అత్యుత్సాహం చూపుతున్నారా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి వరంగల్‌లోని ఇంతెజార్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఓ సివిల్‌ ఎస్సై నుంచి ఒక న్యాయవాదికి ఎదురైన ఘటనే ఇందుకు నిదర్శనం. ఈనెల 14న వినాయకచవితి పండుగ రోజు రోడ్డు పక్కన ఆపి ఉంచిన న్యాయవాది గోవర్ధన్ వాహనం వద్దకు వెళ్లి మరీ సదరు ఎస్సై మొత్తం రూ.1500ల విలువైన పలు చలాన్లు విధించాడు. అయితే ఇంత చేసిన సదరు ఎస్సై అక్కడే రోడ్డుపై పార్కింగ్‌ చేసిన ఇతర వాహనాల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. తనకు ఇన్ని చలాన్లు వేసిన పోలీసు అధికారి.. ఆయన వచ్చిన వాహనంలో మాత్రం సీటు బెల్టు ధరించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడని న్యాయవాది తెలిపాడు.

కాగా తాను వాహనం నడపకపోయినా తనపై పలు ట్రాఫిక్‌ చలాన్లు వేశారనీ, తాను న్యాయవాదినని తెలిసిన తర్వాత ఎస్సై తనతో అనుచితంగా వ్యవహరించారని ఆరోపించాడు. ”ఎస్సై వాహనం వస్తే గౌరవం లేదా.. ఏయ్‌.. వైట్‌ క్యాప్‌ నీ విద్యార్హత ఏంటి?” అని పోలీసులు తనను ప్రశ్నించారనీ, అగౌరవంగా, వ్యంగ్యంగా మాట్లాడారని తెలిపాడు. పార్కింగ్‌ పొజిషన్‌లో ఉన్న వాహనం విషయమై నాపై జారీ చేసిన ముఖ్యంగా హెల్మెట్‌, ఇతర చలాన్ల చట్టబద్ధత, విధానంపై తనకు సందేహాలు ఉన్నాయని అన్నాడు. ఎస్సై నుంచి తనకు ఎదురైన అనుభవం, చలాన్ల జారీపై ఉన్న సందేహాలను వరంగల్‌ బార్‌ అసోసియేషన్‌ దృష్టికి తీసుకెళ్లానని సదరు న్యాయవాది గోవర్ధన్ తెలిపాడు. పోలీసుల నుంచి న్యాయవాదులకు ఎదురైన గత కఠిన అనుభవాల దృష్ట్యా.. ఇప్పుడిది వరంగల్‌ న్యాయవాదుల్లో చర్చకు దారి తీసింది. కొందరు పోలీసుల దురుసు ప్రవర్తనకు అడ్డుకట్ట వేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేస్తున్నారు. ఒక న్యాయవాది పట్ల పోలీసుల తీరు ఇలా ఉంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటనే సందేహం అందరిలో కలుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -