Thursday, September 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిశాకాహారమే భారతీయతా?

శాకాహారమే భారతీయతా?

- Advertisement -

బ్రిక్‌ దేశాధినేతల సమావేశం సందర్భంగా ఢిల్లీలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో శాకాహార పదార్థాలు మాత్రమే వడ్డించారు. తద్వారా శాకాహారంలోనే భారతీయత ఉందన్న తమ ధోరణిని ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన పరివారం చెప్పదల్చింది. భారతీయుల్లో ఎనభై శాతం మంది మంసాహారులే. కనుక శాకాహారమే భారతీయతగా చూపడంలో అర్థం లేదు. అది దగాకోరు తనం కూడా. వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, వైశ్య కులాలు మాత్రమే మాంసం తినవు. నిజానికి అది కూడా పూర్తి వాస్తవం కాదు. చాలా రాష్ట్రాల్లోనూ, చాలా బ్రాహ్మణ శాఖల్లోనూ మాంసం తింటారు. అయిన ప్పటికీ శాకాహారమే పవిత్రమైందన్న భావనను రుద్దే ప్రయత్నం చాలా కాలం నుంచి దేశంలో కొనసాగుతుంది. ఆ ఒరవడిల భాగమే బ్రిక్ దేశాధినేతలకు ఏర్పాటు చేసిన శాకాహార విందు. మరో విధంగా చెప్పాలంటే అది గుజరాతీ భావన. బెంగాల్‌లో జరిగే దుర్గా పూజల సందర్భంగా మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టరాదని ఒక స్వామిజీ కూడా ఇటీవల ముందస్తు ఒక ఫత్వా జారీ చేశాడు. ఆ ఫత్వాను బీజేపీ ఎంపీ ఒకరు వ్యతిరేకించారు. దుర్గాపూజలో చేప మాంసాన్ని, వేట మాంసాన్ని ప్రసాదంగా పెట్టడం తమ ఆనవాయితీ, దాన్ని అడ్డుకొనే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. ‘‘మేము కాళిమాత ముందు గొర్రెలు, మేకలు బలిఇస్తాం. ఆ మాంసాన్నే నైవేద్యంగా పెడ్తాం. కాదనడానికి మీరెవరు?’’ అని బీజేపీ ఎంపీ ప్రశ్నించారు. పూజా స్థలాల్లో స్థానిక ఆచారాలను అణిచివేసి వైదిక సాంప్రదాయాలను ప్రవేశపెట్టి పట్టు సాధించాలన్నదే ప్రయత్నం కూడా చాలా పాతదే.

​మతంలోని మహిళా వివక్షను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘటన కూడా ఈ మధ్యే జరిగింది. పారిస్‌ నగర శివారులో నిర్మించిన బాబ్స్‌ స్వామి నారాయణ ఆలయాన్ని మోడీ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. అనంతరం బాబ్స్‌ సన్యాసులు ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ను సందర్శించారు. తాము టవర్‌ ఎక్కే సమయంలో మహిళా ఉద్యోగులు ఎవరూ తమకు ఎదురు పడరాదని వారు అధికారులను కోరినట్లు వార్తలు వచ్చాయి. వారి రాక సమయంలో మహిళా ఉద్యోగులను అక్కడ లేకుండా చేశారు. దీన్ని నిరసిస్తూ టవర్‌ ఉద్యోగులు సెప్టెంబర్‌ 8న ఒక రోజు సమ్మె చేశారు. 18వ శతాబ్దంలోనే ఫ్రాన్స్‌ ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం కోసం పోరాడి సాధించుకున్నారు. అత్యంత సంపన్నమైన, బలమైన లూయి రాజరికాన్ని వేళ్లతో సహా పెకిలించివేశారు. అలాంటి దేశంలో మహిళా ఉద్యోగులు కన్పించరాదన్న ఆదేశం ఎంత దుర్మార్గమో! దానిని అమలు చేయడం అంతకంటే దుస్సాహసం. మనదేశంలోని కొన్ని హిందూ దేవాలయాల్లోకి మహిళలను ఇప్పటికీ రానివ్వరు. అదే పురుషాధిక్యతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది బాబ్స్‌. మహారాష్ట్రలోని శని సిగ్నాపూర్‌ ఆలయంలో మహిళలకు ప్రవేశం ఉండేది కాదు. మహిళలు ఆలయ మెట్లెక్కితే ఉపద్రవం ముంచుకొస్తుందని చెప్పేవారు.

మహిళలు చాలా కాలం పోరాడిన తర్వాత కోర్టు వివక్షను తొలగించాలని ఆదేశించింది. కోర్టు తీర్పు వల్ల ఎలాంటి ఉపద్రవం జరగలేదు. ఈఫిల్‌ టవర్‌ ఘటనపై మోడీ ప్రభుత్వం, బాబ్స్‌ తమకు సంబంధం లేదని ప్రకటించాయి. మరి మహిళా ఉద్యోగులను ఆ రోజు అక్కడ లేకుండా చేసినది ఎవరి ఆదేశంతో? దీనిపై పారిస్‌ మేయర్‌ దర్యాప్తునకు ఆదేశించారు. యూరప్‌ దేశాల్లోని పర్యాటక స్థలాల్లో టికెట్లు, సావనీర్లు, మంచినీళ్లు, చిరుతిళ్లు, టీ కాఫీలు అమ్మేవారిలో భారత ఉపఖండ వాసులు ఎక్కువగా కనిపిస్తారు. ఇది మన పేదరికానికి, నిరుద్యోగానికి ఒక సంకేతం. వారి నైపుణ్యం వారిని అక్కడికి తీసుకెళ్లిందా, లేక నిరుద్యోగమే పట్టుకెళ్లిందా అంటే నిరుద్యోగమే అని చెప్పాలి. గుజరాతీ సంపన్నులు మాత్రం వివిధ దేశాల్లో స్వామి నారాయణ గుడులు నిర్మిస్తున్నారు. మందిరాలు ప్రశాంతతకు, నిరాడంబరతకు నిలయాలుగా ఉండాలన్న భావనకు బదులు అట్టహాసం, సినిమా సెట్టింగుల్లాంటి తళుకు బెళుకులు కనిపిస్తున్నాయి. మహిళలకు ప్రత్యేక వరుసలు కూడా ఉంటాయి.
​దక్షిణాది వారు నిర్మించిన వెంకటేశ్వర ఆలయాల్లో ఇంతటి ఆర్భాటం, స్త్రీ పురుష వివక్ష తక్కువగా కనిపిస్తాయి. గుజరాతీల ఆధ్వర్యంలోని కొన్ని మందిరాల్లో బంగారు మూర్తులతో పాటు రథాలకు, మండపాలకు కూడా బంగారం వాడుతున్నారు. తమిళనాడులోని సిరిపురం మందిరం స్వర్ణమయం. దేశంలోని మహిళలు బంగారం కొని విదేశీ మారక ద్రవ్యానికి చేటు తేవద్దని విజ్ఞప్తి చేసే ప్రధాని మోడీ, గుడులకు బంగారం వాడొద్దని మాత్రం చెప్పరు.

పెద్ద వ్యాపారుల నియంత్రణకు మోడీ పూనుకోరు కదా! దక్షిణాది రాష్ట్రాల్లో వైదిక సంస్కృతితో పాటు శూద్ర సంస్కృతి కూడా కొనసాగుతోంది. అయితే అది క్రమంగా వెనకబడుతోంది. శూద్ర దేవతల గుడుల్లోకి వైదిక పూజారులు ప్రవేశిస్తున్నారు. కొన్నిచోట్ల వేద మంత్రాలు, జంతుబలులు ఒకే ప్రాంగణంలో సాగుతున్నాయి. కొన్నిచోట్ల శూద్ర పూజారులను పూర్తిగా తరిమేశారు. అమ్మవార్ల పేర్లను సంస్కృతీకరించి వారికి వైదిక దేవతల హోదా కల్పించే ప్రయత్నం జరుగుతోంది. మశమ్మ మహిషాసురమర్ధినిగా, జోగులమ్మ జోగులాంబగా మారుతోంది. ​ వైదిక దేవతలకు పురాణాలు, స్తోత్రాలు, కీర్తనలు, భజనలు, ప్రచార నెట్‌వర్క్‌ ఉన్నాయి. స్థానిక దేవతలకు ఆ సౌకర్యాలు లేవు. అందుకే విదేశాల్లో కూడా స్వామి నారాయణ ఆలయాలు కనిపిస్తాయి. తెలంగాణవారు విదేశాల్లో బోనాలు జరుపుకున్నా, పోచమ్మ స్థానంలో దుర్గామాత ఫొటో, బ్రాహ్మణ పూజారి కనిపిస్తారు. గ్రామదేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మశమ్మ, వీరనాగమ్మ, జములమ్మ, జోగులమ్మ, నూకాలమ్మ, కర్రెమ్మలకు భర్తలు ఉండరు. పురుషాధిక్య కుటుంబ వ్యవస్థకు అతీతంగా స్వతంత్రంగా నిలిచే దేవతలు వారు. వారికి బ్రహ్మాండమైన మందిరాలు లేకపోయినా ప్రజల ఆరాధనలో ఉన్నారు. వారి దగ్గర కుటుంబంలోని సీనియర్‌ మహిళే పూజారిగా వ్యవహరిస్తుంది. ఈ స్వతంత్ర సంప్రదాయానికి విరుద్ధంగా వైదిక మతంలోని పురుషాధిక్యత ఈఫిల్‌ టవర్‌ ఘటనలోనూ కనిపించింది. సంఘ్‌పరివార్‌ మనుస్మృతిని ఆరాధిస్తుంది.

నాలుగు వర్ణాలను బ్రహ్మ సృష్టించాడని, వాటిని మార్చడానికి వీలులేదని మనుస్మృతి చెబుతుంది. సమాజంలో మార్పులు వచ్చినా వర్ణాశ్రమ ధర్మం తప్పు అని ఆరెస్సెస్‌ చెప్పలేదు. మహిళలు కూడా అర్చకులుగా ఉండొచ్చని చెప్పలేదు. మతంలోని మహిళా వివక్షపై ప్రశ్నించలేదు. ​ఆహారం విషయంలోనూ మనుస్మృతి మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించలేదు. ఏ మాంసం ఎప్పుడు తినాలో, ఎలా పథ్యం పెట్టాలో వివరించింది. అయినా ప్రధాని మోడీ శ్రావణ మాసంలో మాంసం తినేవారిని ఎగతాళి చేశారు. తాను భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న స్పృహతో ఆయన వ్యవహరించడం లేదు. గుజరాత్‌ భావననే భారతీయ సంస్కృతిగా చూపడం కింది వర్ణాల వారిని అవమానపర్చడమే. బ్రిక్స్‌ విందుకు వ్యాపార ప్రముఖులను, వివిధ మతాల స్వాములను ఎందుకు పిలిచారు? వారికి బ్రిక్స్‌ సమావేశంతో సంబంధం ఏమిటి? వారు భారతదేశానికి ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు? మతం, వ్యాపారం, ప్రభుత్వం ఈ మూడింటినీ ముడిపెట్టడంలో మోడీని మించినవాడు లేడు.

ఎస్. వినయ కుమార్, 9989718311

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -